Monday, April 29, 2024

ఎడిటోరియ‌ల్ – క‌ర్నాట‌క క‌మ‌లంలో సెగ‌లు .. పొగ‌లు

కర్నాటక అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతాపార్టీ (బీజేపీ) జాబితా విడుదల ఆలస్యానికి కారణంపార్టీలో కుతకుత ఉడుకుతున్న అసమ్మతే కారణమన్న ఊహాగానాలు నిజమయ్యాయి. పార్టీ తొలిజాబితాలో 150 మంది పేర్లను మంగళవారం నాడు పార్టీ కేంద్ర నాయకత్వం ప్రకటించగానే, పుట్టల్లోంచి బుసలు కొడుతూ పాములు బయటికి వచ్చినట్టు, టికెట్లు రాని సీనియర్‌ నాయకులు ఒక్కసారిగా అసమ్మతి గళాలను విప్పారు. ఒకసారి, రెండుసార్లు ఎమ్మెల్యేలుగా పని చేసినవారు అసంతృ ప్తి వ్యక్తం చేయడం సహజం.ఆరుసార్లు ఎమ్మెల్యేగా నూ, ఒకసారి ముఖ్యమంత్రిగానూ వ్యవహరించిన సీనియర్‌ నాయకుడు జగదీష్‌ షెట్టార్‌ ఒక్కసారిగా తన స్వరాన్ని పెంచారు. తనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదనీ,తననెందుకు పక్కన పెట్టారంటూ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న వారిని విస్మరిస్తే జరిగే నష్టమేమిటో కేంద్ర నాయకత్వానికి ఆయన వివరిం చారు. ముఖ్యంగా దక్షిణాదిన బీజేపీ బలపడటానికి కారకుల్లో తాను ఒకడినని చెప్పుకోవడమే కాకుం డా, తన వంటి సీనియర్లకు పార్టీ పెద్దలు ఇచ్చే గౌరవ మర్యాదలు ఇవేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కులపరంగా బలమైన వర్గమైన లింగాయత్‌ సామా జిక వర్గానికి చెందిన షెట్టార్‌ మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప తర్వాత రాష్ట్రంలో సీనియర్‌ నాయ కునిగా పేరొందారు. యెడియూరప్ప చిక్కుల్లో ఉన్నప్పుడు ఏడాది పాటు ముఖ్యమంత్రిగా వ్యవహ రించారు. పార్టీ టికెట్‌ లభించకపోతే ఇండిపెం డెంట్‌ గా పోటీ చేస్తానంటూ షెట్టార్‌ ప్రకటించడంతో ఆయనను బుజ్జగించే యత్నాలను కేంద్ర నాయకు లు ప్రారంభించారు.అటువంటి సీనియర్‌ నాయకు నికి ఈసారి టికెట్‌ దక్కలేదంటే, ఆయన సేవలను ఢిల్లిdలో వినియోగించుకోవాలని కేంద్ర నాయకత్వం భావిస్తోందేమోనన్న వార్తలు వచ్చాయి.

అయితే, ఆయనకు రెండో జాబితాలో టికెట్‌ వచ్చే అవకాశం ఉందని యెడియూరప్ప ప్రకటించారు.ఏమైనా పార్టీ కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీలో సైతం కాంగ్రెస్‌లో మాదిరిగా ఫిరాయింపులు, తిరుగుబా ట్లు అనివార్యమన్న సంగతి తేలిపోయింది. బీజేపీని విలక్షణమైన పార్టీగా పార్టీ పెద్దలు ఇంతవరకూ చెప్పుకుంటున్నారు.అటువంటి పార్టీలో ఇప్పుడు అసమ్మతి సెగలు వ్యాపిస్తున్నాయి. అలాగే, మాజీ ఉప ముఖ్యమంత్రి,మరో సీనియర్‌ నాయకుడు కెఎస్‌ ఈశ్వరప్పకు కూడా టికెట్‌ దక్కలేదు. ఆయన ఇతర వెనుక బడిన కులాలకు చెందిన నాయకు డు.ఆయన కూడా పార్టీ కేంద్ర నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఈసారి బీజేపీలో 52 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించారు. ఎస్సీలకు30, ఎస్టీలకు 16 సీట్లు కేటాయించారు. బీజేపీ మొదటి జాబితాలో 189 మంది పేర్లు ఉన్నా యి. కాంగ్రెస్‌ ఇంతవరకూ 166సీట్లకు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే, పీసీసీ అధ్యక్షుడు డికె శివ కుమార్‌ వంటి పెద్ద నాయకుల పేర్లను ముందే ప్రక టించారు. బీజేపీ ఈసారి ఎక్కువ మంది కొత్త వారిని నియమించాలన్న నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. బొమ్మయి హయాంలో చోటుచేసుకున్న హిజాబ్‌ వంటి వివాదా లు రాష్ట్రంలో బీజేపీని దెబ్బతీశాయి.

హిజాబ్‌ వల్ల పార్టీ ప్రతిష్టమంటగలిసింది.అలాగే, మహా త్మా గాంధీని హత్య చేసిన గాడ్సే విగ్రహాలను రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రతిష్టించడం వల్ల కూడా బీజేపీ ప్రతిష్ట మసకబారింది.దేశంలో అన్ని రాష్ట్రాల్లోకన్నా అవినీతి కేసులు ఎక్కువ బహిర్గతం కావడం కూడా పార్టీ కేంద్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇంజనీరింగ్‌ శాఖలో ముడుపులు చెల్లించని ఇద్దరు కాంట్రాక్టర్లు అధికారుల వేధింపులను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.ఈ ఇద్దరి ఆత్మహత్యలు జాతీయ స్థాయిలో బీజేపీ ప్ర తిష్టను మసకబార్చా యి.దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రా ల్లో లేని విధంగా కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అను సరించిన మతపరమైన విధానాలు కూడా పార్టీని అప్రదిష్టపాలు చేశాయి. కేంద్ర నాయకత్వం జరిపిం చిన సర్వేల్లో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని తేలింది. అందుకే చాలా నియోకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను మార్చారు. దాంతో అసమ్మతి చెలరేగింది. బీజేపీలో అసమ్మతి ఇంకా చల్లారలేదు. కేంద్ర నాయకులు బుజ్జగిస్తున్నప్పటికీ సీనియర్‌ నాయకులు తమకు ప్రాధాన్యం దక్కలేదని వాపోతు న్నారు. ఈసారి పార్టీకి గడ్డు పరిస్థితి తప్పదని బహి రంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే ఇండిపెం డెంట్లుగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ప్రధాన మంత్రి మోడీ జోక్యం చేసుకున్నప్పటికీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గా ల్లో తిరుగుబాటుదారుల నుంచి పార్టీ అభ్యర్థులు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర నాయకులు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement