Wednesday, May 15, 2024

Gutha Amit: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గుత్తా కుమారుడు..

గ‌త కొంత కాలంగా ధిక్కార‌స్వ‌రం వినిపిస్తున్న
మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి
పార్టీ విడ‌తార‌ని ఊహ‌గానాలు
ఆక‌స్మికంగా హ‌స్తం గూటికి ఆయ‌న కుమారుడు
కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్

హైద‌రాబాద్ – తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని వీడి మ‌రో నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. శాస‌న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. నేడు అమిత్ ఏఐసీసీ తెలంగాణ‌ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీని కలిశారు. అనంత‌రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు గుత్తా అమిత్. జూబ్లీహిల్స్ లోని త‌న నివాసంలో అమిత్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఇటీవల కాలంలో గుత్తా సుఖేందర్‌ కూడా పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. అధినేత కేసీఆర్, నాయకుల తీరును తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఆరు నెలలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, తనకే అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మిగతా వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఓటమిపై ఇప్పటి వరకు సమీక్ష చేయలేదని మండిపడ్డారు.. దీంతో ఆయన కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన దానిని కొట్టిపడేశారు. కాని ఆయ‌న‌ కుమారుడు కాంగ్రెస్‌లో చేరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement