Thursday, May 2, 2024

శుద్ధాంతరంగులు శుక, హనుమంతులు

పరిశుద్ధమైన మనసు కలవారిపై కామ, క్రోధాది అరిషడ్వర్గాల ప్రభావం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అరిషడ్వర్గాలను జయించినవారి ని జితేంద్రియులు అంటారు. అటువంటి జితేంద్రియులలో ప్రసిద్ధ పురు షులు ఇద్దరు మనకు రామాయణ, భారత, భాగవతాలలో దర్శనమిస్తారు. వారే వాతాత్మజుడైన హనుమంతుడు, వ్యాసాత్మజుడైన శుక మునీంద్రుడు.
”ఆడుదాని చూడ నర్థంబు చూడగ
బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు” అంటూ వేమన కవి స్త్రీ, ధన వ్యామోహాలకు లోనుకాని వారు చాలా అరుదు అంటూ తీర్పరించినాడు. అయితే మహనీ యులు అలాంటి వ్యామోహాలకు అతీతులు. రామాయణంలోని సుందర కాండలో సీతాదేవిని అన్వేషిస్తూ రావణుని అంత:పురంలో ప్రవేశించిన హను మకు రావణుని వైభవం, అతని ఐశ్వర్యం, విలాసాలు, అక్కడి చిత్ర విచిత్ర ములై నోరూరిస్తున్న ఆహార పానీయాలేకాక, రావణుడు వరించిన అతడిని వరించిన ఎందరెందరో యక్ష, గంధర్వ, అప్సర, మానవ, రాక్షస కాంతలు వివిధ భంగిమలలో నిశిరాత్రివేళ నిద్రాపరవశులై అస్తవ్యస్త వస్త్రాభరణాలతో పడుకొని ఉండి కనిపిస్తారు. ఆ లంకాపుర ధన వైభవం, ఆ సుందరీమణుల రూప విలాసాలు ఆంజనేయుని మనసును ఏమా త్రం చలింపచేయలేదు. ఆ క్షణంలో ఆయన ఇలా ఆలోచించాడట.
”పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణమ్‌
ఇదంఖలు మమాత్యర్థం ధర్మ లోపం కరిష్యతి||
నహిమే పరదారాణాం దృష్టి ర్విషయ వర్తినీ
అయం చాత్ర మయాదృష్ట: పరదార పరిగ్రహ:||”
అయ్యో, నిద్రిస్తున్న పరస్త్రీలను చూడడం అనే ఈ చర్య పాప హేతువు కదా! నా దృష్టి పరస్త్రీ సుఖాదులందు లగ్నము కాకపోయి నప్పటికీ నేనిక్కడ రావణుడు తన స్త్రీలతో శయ నించుట చూచాను. ఇది తప్పు కాదా?” అనుకున్నాడట. అలాగ ఆత్మశోధన చేసుకొని తన పని ధర్మవిరుద్ధంకాదని ఇలా నిర్ణయించుకొంటాడు.
”కామం దృష్ట్వామయా సర్వావిశ్వస్తా రావణ ప్రియ:
నహిమే మనస: కించి ద్వైకృత్యముప పద్యతే||
మనోహి హేతు స్సర్వేషామింద్రియాణాం ప్రవర్తనే
శుభాశుభ స్వవస్థాసు తుచ్ఛమే సువ్యవస్థితమ్‌||”
రావణుని విశ్వాసపాత్రులైన భార్యలందరినీ చూచినప్పటికీ నా మనసు ఎటువంటి వికారాన్నీ పొందలేదు. మంచి పని కానీ, చెడు పనిని కానీ చేయడా నికి సకలేంద్రియాలను ప్రవర్తింపచేసేది మనస్సు. కానీ, నా మనస్సు ఎంత మాత్రం చెదరక కుదురుగానే ఉంది. సీతాదేవిని స్త్రీలలోనే వెదకవలసి ఉంది. కనుక నేను చాలా పరిశుద్ధమైన మనస్సుతో ఇక్కడ వెదుకు తున్నాను. అందుకే నా మనస్సు వేరే మార్గంలో తప్పుగా ప్రవర్తించడంలేదు. కనుక ఇలానే జానకీ మాత అన్వేషణా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను” అని తీర్మా నించుకున్నాడు. ఇలా అనుకోవడం పరమ భక్తుడైన హనుమంతునికే తప్ప సామాన్యులెవ్వరికీ సాధ్యంకాదు. అందుకే ఆయనను ”జితేంద్రియం బుద్ధి మతాం వరిష్ఠం” అని లోకమంతా కొనియాడుతోంది.
ఇక మరియొక శుద్ధాంతరంగుడైన మహనీయుడు వేదవ్యాసుని కుమారు డైన శుక మహర్షి. ఈయన జీవితమంతా సంచారిగా తిరుగుతూ, ఏ ఒక్కచోట కూడా ఆవుపాలు పితికినంతసేపు కూడా మించి ఉండేవాడు కాదట. అయితే శుక మహర్షి పరీక్షిత్తు మహారాజు యొక్క అంత్యకాలములో మాత్రము ఆయ న ఇంటిలో ఏడు రోజులుండి భాగవాతి పురాణాలను ఆయనకు వినిపించాడు. శుక మహర్షి పుట్టుక విషయానికి వస్తే వ్యాసుడు సుదీర్ఘ తపస్సు చేసి, శివుని ప్రత్యక్షం గావించుకొని, తనకు పంచభూతాత్మకుడైన కొడుకు కావాలనే వర మడిగాడు. శంకరుని కృప వలన వ్యాసుడు ఒకనాడు ఆరణిని మథిస్తున్న సమ యంలో ఘృతాచి అనే చిలుక రూపంలో ఉన్న అప్సరసను చూచి, కామ వివ శుడై స్ఖలించాడు. దాని నుండి, అయోనిజునిగా చిలుక ముఖం కలిగిన శుకుడు జన్మించాడు. వెంటనే ఆకాశగంగ ఆ బాలునికి స్నానం చేయించింది. కృష్ణా జినం, చేతిదండం ఆకాశం నుండి అతనికి లభించాయి. శుకుడు దేవగురువైన బృహస్పతి వద్ద, తండ్రియైన వ్యాసుని వద్ద సకల శాస్త్రాలు అభ్యసించాడు. తం డ్రి మాట మేరకు జనక మహారాజు వద్ద మోక్ష మార్గాన్ని అభ్యసించడానికి వెళ్ళాడు. జనక మహారాజు సపరివారంగా శుకునికి ఎదురేగి స్వాగతం పలి కాడు. మణిరత్న ఖచిత సింహాసనంపై ఆయనను కూర్చొండబెట్టి బంగారు పూలతో పూజించాడు. అపురూప సౌందర్యవతులతో నృత్య గాన వినోదాలను ఏర్పాటుచేశాడు. అయినా అవి ఏవీ శుకుని ఆకర్షించలేకపోవడం గమనించి, ఆయన వచ్చిన కారణం అడిగి సంతోషంగా ఆయనకు మోక్ష మార్గం బోధిం చాడు. శుకుడు తిరిగి తన తండ్రి ఆశ్రమానికి చేరుకొన్నాడు. ఒకనాడు వ్యాసాశ్ర మానికి వచ్చిన నారద మహర్షి వద్ద యోగమార్గం తెలుసుకొని, విరాగియై భూ లోకమంతా అవధూతగా సంచరిస్తూ జీవితం గడిపాడు. తనను వరించి వచ్చి న రంభతో తాను తుచ్ఛ సుఖములను ఆశింపనని ఆమెను నిరాకరించాడు. గోచి కూడా ధరించకుండా వెడుతూ ఉన్న శుకుని జూచి, దారిప్రక్కన సరస్సు లో స్నానాలు చేస్తున్న యువతులు తమ దేహాలపై వస్త్రాలు లేకపోయినా, ఆ మహనీయుని బ్రహ్మచర్య దీక్షా దక్షతలు తెలిసినవారు కనుక ఏ మాత్రం కంగారుపడకుండా ప్రశాంత చిత్తులై జలక్రీడలు కొనసాగించారు. శుకుని వెను కనే ‘కుమారా’ అంటూ వస్తున్న అతని తండ్రి వ్యాసుడిని చూసి సిగ్గుపడి ఆ యువతులు వెంటనే గట్టుపై ఉన్న వస్త్రాలు ధరించారు. కారణమడిగిన వ్యాసు నికి వారు ”నీ కొడుకు ఇది సతి, వీడు పురుషుండని భేద దృష్టి లేక యుండు. అతడు నిర్వికల్పుండు. కాన నీకు అతనికి మహాంతరంబు కలదు. అతని మన సు అప్పుడే పుట్టిన పసిపిల్లవాని వలె నిర్మలమైంది” అని కూడా చెప్పారట.
”సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసియై యొంటిబో
వ మహాభీతినొహో కుమారయనుచున్‌ వ్యాసుండు చీరంగ వృ
క్షములున్‌ తన్మయతన్‌ ప్రతిధ్వనులు చక్కన్‌ చేసె మున్నట్టి భూ
తమయున్‌ మ్రొక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్‌ ధీమణిన్‌.”
(శ్రీ మహాభాగవతం- ప్రథమ స్కంధం- 53వ పద్యం)
సర్వ భూతమయుడుగా, నిర్వికల్పుడుగా, సర్వాన్నిత్యజించి, ఒంటరిగా ముందుకువెళ్తున్న కుమారునిపై మమకారాన్ని వదలలేక వ్యాసుడు ‘ఓ కుమారా!’ అని పిలుస్తూ అనుసరిస్తుంటే, వృక్షాత్మకమై ప్రకృతి ఆయనకు ‘ఓ’ అంటూ బదులిచ్చింది తప్ప శుకుని నుండి మాత్రం సమాధానం రాలేదట. అంటే బంధ విముక్తుడై ప్రకృతిమయుడై, అంతటి తండ్రికే అంతుపట్టని ఆధ్యా త్మిక ఔన్నత్యాన్ని పొందిన ఘనుడు శుకుడు. శుక మహర్షిని పోలిన తత్వజ్ఞుడు, యోగీశ్వరుడు మూడు లోకాలలో ఉండరనేది సత్యము. శుద్ధాంతరంగులు శుక హనుమంతుల స్మరణం అందరికీ మనో నిగ్రహాన్ని కలిగించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement