Thursday, May 16, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

12. నినుసేవింపగనాపదల్వొడమనీనిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీమహాత్ముడననీ సంసార మోహంబు పై
కొననీ జ్ఞానము గల్గనీగ్రహగతుల్కుందింపనీ మేలు వ
చ్చినరానీయవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!నిను -నిన్ను,సేవింపగన్ – సేవిస్తుండగా,ఆపదల్ -కష్టాలు,పొడమనీ – కలుగనిమ్ము, నిత్య – ఉత్సవంబు – ఎల్లప్పుడు వేడుకలు లేక శుభాలు,అబ్బనీ – కలుగనిమ్ము,జనమాత్రుండు-అననీ – సామాన్య మానవుడే అననీ, మహాత్ముడు – అననీ – గొప్పవాడు అననీ, సంసార మోహంబు – సంసారం మీద భ్రమ,పైకొననీ – ఆవరింపనీ,జ్ఞానము – ఎఱుక ( తెలియ వలసిన దానిని తెలిసి కొనుట),కల్గనీ -కలుగనీ,గ్రహగతుల్ -గ్రహాల సంచరాలు,కుందింపనీ -అణగద్రొక్కనీ, మేలు వచ్చినన్- మంచి జరిగినట్లైన,రానీ్స జరగనీ, నాకు – నాకు, అవి-అవన్నీ, భూషణములే – అలంకారాలే.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను నేను సేవించుకుంటున్నప్పుడు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్త సుఖాలు వచ్చినా, వట్టి సామాన్య మానవుడే అన్నా, చాల గొప్ప వాడు అన్నా, లౌకిక జీవనం పై వ్యామోహం కలిగినా ( ఆజ్ఞానాంధకారం క్రమ్మినా) సుజ్ఞానమే కలిగినా,గ్రహస్థితులు సరిలేక కష్టాలు క్రుంగదీసినా, అవన్నీ సరిగా ఉండి మేలే చేసినా – అవన్నీ నాకు అలంకారాలే. అవి నీ సేవకు ప్రతిఫలంగా లభించినవి కనుక నీ అనుగ్రహాలే.
విశేషం: ఈ పద్యంలో పరిపూర్ణ శరణాగతి దర్శన మిస్తుంది. భక్తుడు భగవంతుణ్ణి సేవించటం తన భక్తి తాత్పర్యాలని ప్రకటించటానికే, కాని,దేనిని ఆశించి కాదు. పరమప్రేమ ( సా పరమ ప్రేమ రూపా – నారద భక్తి సూత్రాలు) అయిన భక్తిలో స్వార్థచింతన ఉండదు. ఆనందమే దాని ఫలం. అది కూడా చివరకు కాదు. నిజమైన భక్తి హృదయంలో పుట్టిన క్షణం నుండి. ఆ ఆనందంలో సమస్తము ( కష్టసుఖాలు, కీర్తి అపకీర్తులు మొదలైనవి) భగవదనుగ్రహంగాఅనుభూతమౌతుంది. తీవ్ర నియమనిష్ఠలతో ఎంతో సాధన చేయటం వల్ల కూడా పూర్తిగా సిద్ధించని ద్వంద్వాతీత స్థితి భక్తి మాత్రం చేత అప్రయత్నంగా సిద్ధిస్తుంది. అందుకే మోక్షసాధనామార్గాలలో భక్తి శ్రేష్ఠం, సులభం అని పేర్కొనటం జరిగింది.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement