Tuesday, April 30, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

  1. భవదుఃఖంబుల్రాజకీటములనే( బ్రార్థించినన్ బాయునే?
    భవదంఘ్రిస్తుతి చేత( గాక, విలసద్బాల క్షుధా క్లేశ దు
    ష్టవిధుల్మానునె? చూడమేకమెడచంటన్దల్లి కారుణ్య దృ
    ష్టివిశేషంబుననిచ్చుచంట ( బలెనోశ్రీకాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం: శ్రీ కాళహస్తీశ్వరా!, భవత్ -నీ యొక్క, అంఘ్రి – పాదముల, స్తుతి – కీర్తన, చేతన్ – వలన, కాక – తప్ప, భవదుఃఖంబులు – సంసారబాధలు, రాజకీటములన్ – రాజులనే పురుగులని / పురుగుల వంటి రాజులను, ఏన్ -నేను, ప్రార్థించినన్ – ప్రార్థించగా, పాయును – ఏ – తొలగునా?, చూడన్ – చూడగా, తల్లి – జనని, కారుణ్య దృష్టి విశేషంబునన్ – వాత్సల్య పూరిత దృష్టి విశేషముతో, ఇచ్చు – ఒసగు, చంటన్ – పలెన్ – చనుబాలతో పోయినట్లు, విలసత్ – పెరుగుచున్న, వికసిస్తున్న, బాల – బాలుడి, క్షుధా – ఆకలి, క్లేశ – బాధ వలన కలిగిన, దుష్ట విధుల్ – వికారాలు, మేక – మేక యొక్క, మెడ చంటన్ – మెడ క్రింద వ్రేలాడుచన్నులతో, మానునె? -పోవునా? ( పోవు కదా!అని భావం)
    తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా!సంసారదుఃఖాలు (జననమరణరూపమైనవి) నీ పాదకీర్తనం చేస్తే తొలగుతాయి కాని, పురుగుల వలె అల్పులైన రాజులని ప్రార్థిస్తే తొలగుతాయా? (తొలగవు) పసిబిడ్డకి ఆకలిబాధ వల్ల కలిగిన వికారాలు తల్లి వాత్సల్యదృష్టితో ఇచ్చిన పాలతో తీరుతాయి కాని, మేక మెడచెన్నుతోతీరతాయా? (తీరవు)
    విశేషం: ఇది చక్కని అర్థాంతరన్యాసాలంకారంలోశివనుతి. దయతో నిండిన తల్లిపాలవంటిది శివుడి కరుణ అంటూనే రాజుల ఆదరణ మేకచంటివంటిదని కూడా చెప్పాడు.మగమేకలకిమెడక్రింద రెండు చన్నుల వలె వ్రేలాడుతూ ఉంటాయి. కాని, అవి చన్నులు కావు కనుక పాలుండవు. వాటిని ఆశించటం వృథ. రాజులును అంతే అని భావం.
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement