Sunday, April 28, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

  1. తనయుం గాంచి, ధనంబు నించి, దివిజస్థానంబు గట్టించి, వి
    ప్రున కుద్వాహము చేసి, సత్కృతికి పాత్రుండై, తటాకంబు నే
    ర్పున ద్రవ్వించి, వనంబు పెట్టి మననీ, పోలేడు నీ సేవ చే
    సిన పుణ్యాత్ముడు పోవు లోకమునకున్ శ్రీకాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, తనయున్- కుమారుణ్ణి, కాంచి- పొంది, ధనంబు-ధనము / డబ్బు, నించి- నింపి/ నిండుగా సంపాదించి, దివిజస్థానంబు- దేవాలయం, కట్టించి- నిర్మాణం చేసి, విప్రునకు- బ్రాహ్మణుడికి, ఉద్వాహము చేసి- పెండ్లిచేసి, సత్కృతికి- మంచికావ్యానికి, పాత్రుడు- ఐ- అర్హుడై (అంకితం పుచ్చుకునే అర్హత కలవాడై), నేర్పున- కౌశలంతో, తటాకంబు- చెఱువును, త్రవ్వించి్స త్రవ్వునట్లు చేసి, వనంబు పెట్టి- తోటలను ఏర్పాటు చేసి (మొక్కలు నాటి, తోటలు పెంచి), మననీ- పేరొంది బ్రతుకును గాక, నీసేవ చేసిన- నిన్ను కొలిచిన, పుణ్య- ఆత్ముడు- పుణ్యశీలి, పోవులోకమునకు- చేరే ఉత్తమలోకానికి, పోలేడు- వెళ్ళలేడు.
    తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! పుత్రసంతానం, ధనసంపద, దేవమందిరనిర్మాణం, బ్రాహ్మణుడికి వివాహం జరిపించటం, మంచి కావ్యాన్ని అంకితం పుచ్చుకోవటం, చెరువుని తవ్వించటం, ఉద్యానవన నిర్మాణం – అనే సప్తసంతానాలని పొందిన పుణ్యాత్ముడు కూడా నీ భక్తుడు పోయే పుణ్యలోకాలకి పోలేడు.
    విశేషం: సప్తసంతానాలు పుణ్యప్రదాలు. పుణ్యకార్యాల వల్ల లభించేది స్వర్గలోకప్రాప్తి. పుణ్యం కర్చు అయినాక మళ్లీ భూలోకం చేరక తప్పదు. “క్షీణేపుణ్యే మర్త్యలోకం వింశతి.” శివభక్తి అనేది ఒక్కటి ఉంటే ఈ పుణ్యకార్యాల కన్న ఘనం. శివలోకప్రాప్తి శివభక్తి ఉంటే మాత్రమే లభిస్తుంది.
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement