Thursday, May 16, 2024

శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌ర శ‌త‌కం..

5. భవకేళీమదిరా మదంబున మహాపాపాత్ముడై వీడు న
న్ను వివేకింప డటంచు, నేను నరకార్ణోరాశి పాలైన బ
ట్టవు, బాలుం డొకచోట నాటతమితో డన్నూత గూలంగ దం
డ్రి విచారింపక యుండునా, కటకటా శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, భవ = సంసార ( జనన మరణ చక్రం) రూపమైన, కేళీ = ఆట అనే, మదిరా = కల్లు వలన కలిగిన, మదంబున = మత్తుచే, మహాపాప + ఆత్ముడు + ఐ = అధికమైన పాప బుద్ధి కలిగిన వాడై, వీడు = ఇతడు ( తాను, మానవుడు), నన్ను = తనను ( భగవంతుణ్ణి), వివేకింపడు = తెలిసికొనడు, అట+ అంచున్ = అనుకొంటూ, నరక = నరకము అనే, అర్ణోరాశి పాలు +ఐనన్ = సముద్రంలో పడిపోయినా, నన్ను = నన్ను ( అనగా కవిని), పట్టవు =పట్టించుకోవు, రక్షించవు. బాలుండు = పసివాడు, అమాయకుడు, ఆట +తమి + తోడన్ = ఆటల పైనున్న మిక్కిలి ఇష్టంతో, ఒక చోట = ఒక ప్రదేశంలో, నూతన్ = నూతిలో, కూలంగన్ = పడిపోగా, తండ్రి = ఆ బాలుడి తండ్రి, విచారింపక = పట్టించుకోకుండా, ఉండునా = ఉంటాడా. ఉండగలడా?
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! సంసారరూపమైన ఆట అనే కల్లు త్రాగి, మత్తెక్కి, ఒళ్ళు తెలియని ఈ నరుడు పాపాత్ముడై, నన్ను ధ్యానించలేదు అనే నెపంతో నరక మనే సముద్రంలో పడి మునిగి పోతూ ఉన్నా నీకేమీ పట్టనట్టు ఉరకుంటున్నావు. అయ్యో! ఇదేమైనా న్యాయముగా ఉన్నదా? పిల్లవాడు ఆటలలో పడి ఒళ్ళెరుగక నూతిలో పడినట్లైతే తండ్రి పట్టించుకోకుండా ఉండడు కదా! అనగా, తను సేవించినా లేక పోయినా, తండ్రి వంటి శివుడు తనను ఉద్ధరించి రక్షించాలి, తనపై వాత్సల్యం చూపాలి అని భావం.
విశేషం:
భగవంతుడికి భక్తుడికి మధ్య నున్న తండ్రి కొడుకుల సంబంధం ఈ పద్యంలో ప్రస్తావించ బడింది. ధూర్జటి శివుణ్ణే తనకు తండ్రిగా భావించాడు. అందుకే తన వంశం గురించిన ప్రస్తావన కూడా చేయ లేదు. “ భవము” అంటే “ సంసారం”. జనన మరణ చక్రమునకే సంసారము, లేక భవము అని పేరు. ఈ చక్రంలో చిక్కుకొని పోయిన జీవుడు అదే తన పరమార్థం అనుకుంటాడే గాని, ఆ చక్రభ్రమణంలో నుండి ఇవతలకు రావాలని కూడా అనుకోడు. చావు పుట్టుకలు అనే ఆటనే, అందులో నిమగ్నమైపోయి మరీ, ఆడుతూ ఉంటాడు. ఆ విధంగా ఆటలో లీనమైపోయేది పసిబాలుడు. కనుకనే తనను బాలునిగా భావించి రక్షించ మని ప్రార్థించాడు. జీవుడు పడిన నూయి సంసార రూపమే. ఆటలో లీనం అవటం ఎంతగా ఉంటుందంటే “ మళ్ళీ జన్మ అంటు ఉంటే …..” అని ఆలోచిస్తారే కాని, “ జన్మ లేకుండా..” అని మనసులో కూడా అనుకోరు.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement