Sunday, April 28, 2024

సత్యాసత్యాలు

లోకానికి సత్యాసత్యాలు రెండు కళ్లలాంటివి. ఒక కన్ను ఎప్పుడూ సత్యాన్నే చూస్తుంది. సత్యాన్నే చూపిస్తుంది. మరో కన్ను అసత్యం. అది ఎల్లప్పుడూ అసత్యాన్నే చూస్తుంది. అసత్యాన్నే చూపి స్తుంది. ఏది సత్యం? ఏది అసత్యం? అని ఎలా తెలుసు కోవాలి. ఎలా గ్రహించాలి? అని ఆలోచిస్తే సత్యం ఎలా వుంటుందో తెలుస్తుంది.
ఆత్మ సత్యం. పరమాత్మ సత్యం. జ్ఞానం సత్యం. వెలుగునిచ్చే సూర్యచంద్రులు సత్యం. మంత్రం సత్యం. ఇవన్ని తెలుసుకోవాలంటే మొదట నేను దేహా న్ని కాను ఆత్మను అనేది మొట్టమొదటి సత్యం. ఆ సత్యం తెలుసుకోవడమే పరమాత్మ కలుసుకునే మా ర్గం. దానికి కావాల్సింది జ్ఞానం. కేవలం జ్ఞానమార్గాన మాత్రమే ఆత్మను పరమాత్మలో ఏకంచేయగలం. ఇది పరమ సత్యం. భక్తి ద్వారా దేహం ప్రాపంచిక విషయా లకు, వస్తు వ్యామోహాలకు ఆకర్షణ చెందకుండా కాపా డుకోవాలి. జ్ఞానం ద్వారా దేహంలోని ఆత్మని చైతన్య పరచుకోవాలి. కేవలం దేహం మాత్రమే నేను అనేది అసత్యం. ఆత్మ కనబడనిది కావున లేదు అనుకోవడం అసత్యం. గాలి కనిపించకపోయినా మానవజాతికి ప్రాణవాయువుగా మారి మన ఉనికి ని శక్తిని చాటుకుంటుంది. ప్రకృతికాంతకు అనుకూలంగా మానవాళికి కావాల్సిన సమస్త అవసరాలను తీరుస్తుంది. విద్యుత్తు కూడా కంటికి కనిపించకుండా తీగలలో ప్రవహి స్తుంది. తద్వారా శక్తిగా మారి ఎన్నో అవసరాలకు ఉపయోగపడ్తుంది. కంటికి కానరా నంత మాత్రాన సత్యం అసత్యంగా మారదు. కంటికి కనిపించినంత మాత్రాన అసత్యం సత్యంగా మారదు. నేడు సత్యం, రేపు అసత్యం. సత్యమనే నీటిలో జ్ఞానమనే పడవ నేసుకుని లక్ష్యాన్ని చేరుకోవడమే మానవుడి లక్ష్యం. నిన్న ఒక చెట్టుపై బోలెడు పండ్లు, కాయలు చూసాము. కానీ వాటిని నేడు కోసేసారు అనుకుందాం. అప్పడు ఏమనాలి? నిన్న చూసింది సత్యమా? నేడు చూసింది సత్యమా? ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ సమస్త జీవకోటిలో శాశ్వతంగా నిలిచిపోయేది సత్యం. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవడమే సత్యం. పరమాత్మ సత్యం. దేహం అసత్యం. అశాశ్వతం. అసత్యం ముందున్న అ అనే అక్షరాన్ని తొలగిస్తే సత్యం అవుతుంది. ఆలోచిస్తే అ ఆత్మగా రూపాం తరం చెంది అసత్యంలో దాగున్న సత్యంగా ఆవిష్కృతమవుతుంది. నిరంతరం సాధన ద్వారా తపస్సు ద్వారా జపం ద్వారా నామ పారాయణ ద్వారా సత్యాన్వేషణ చేయవచ్చు.
పూర్వం యోగులు, మహర్షులు కఠిన, కఠోర తపస్సుతో ఆత్మజ్ఞానాన్ని పొందారు. కలియుగాన రమణ మహర్షులు తనను తాను తెలుసుకోవడమే జ్ఞానమని, నేనెవరినో తెలుసుకోవడమే సత్యమని భావించారు. తమ భక్తులకు సైతం ఆత్మజ్ఞానాన్ని పంచి పెట్టారు రమణులు. వ్యక్తి తనను తాను పూర్తిగా శోధించుకుని తానేమిటో తెలుసు కోవడం అసలైన సత్యం.
బాహ్య ప్రేరణలతో అర్థబలంతో పదవులతో, ఆడంబరాలతో వచ్చే గుర్తింపులు గౌరవాలన్నీ అశాశ్వతం, అసత్యం. వీటిని అంటీ అంటక తామరాకువలే ఎవరైతే జీవి స్తారో వారే ఈ కలియుగ మహర్షులు.
మట్టిలో మాణిక్యాలు. పరమాత్మునికి అత్యం త ఇష్టులు. ఆత్మానంద స్వరూపులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement