Sunday, May 5, 2024

సర్వకార్యసిద్ధి హనుమాన్‌ మంత్రం!

ప్రతి ఒక్కరు తాము తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని అనుకుంటారు. ఎంత శ్రద్ధాసక్తులతో పనులు మొదలుపెట్టినా ఏవో అడ్డంకుల వల్ల ఆగిపోతుండటం జరుగుతూ ఉంటుంది. అందుకుగాను శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా, హేతుబద్ధంగా అన్నివిధాలా మనిషికి విజయాన్ని చేకూర్చే మార్గాలు ఉంటాయి. అలాంటిదే హనుమాన్‌ కార్యసిద్ధి మంత్రం.
సుందరకాండలో హనుమంతుడు సీతను వెతుకుతూ సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి, అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుంది. అది-

త్వమస్మిన్‌ కార్య నిర్యోగే
ప్రమాణం హరిసత్తమ!
హనుమన్‌ యత్న మాస్థాయ
దు:ఖ క్షయ కరోభవ!!

సుందరకాండలోని 39వ సర్గలో అయిదవ శ్లోకంగా ఉన్న ఈ మాటను సీతమ్మ సాక్షాత్‌ ఆంజనేయస్వామితో పలికింది. హనుమా! నేను చాలా దు:ఖంలో వున్నాను. నన్ను ఈ కష్టాల నుండి గడ్డెక్కించగల సమర్థుడివి నువ్వే! ఈ పని చేయడంలో తగినవాడవు నువ్వే. అందుకే హనుమా! సరైన ప్రయత్నం నువ్వే చేసి నా దు:ఖాన్ని పోగొట్టు అని సీతమ్మ పేర్కొంది. సీతమ్మ హనుమంతునితో చెప్పిన మాట ఒక కార్యసిద్ధి మంత్రంగా వ్యాప్తి చెందింది. సీతమ్మ పలికిన ఈ మాటను ఎవరు పఠించినా కార్యసిద్ధి కలుగుతుంది. దు:ఖాలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని మంగళవారం లేదా శనివారం రోజు పఠించడం ప్రారంభిస్తే విశేష ఫలితమని చెబుతారు. ముఖ్యంగా శనివారం రోజు సంధ్యా సమయంలో స్నానమాచరించి శుచిగా హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని 40 రోజులపాటు ప్రతి రోజూ భక్తితో 1110సార్లు పఠించాలి. తత్ఫలితంగా అనుకున్న పులు సక్రమంగా జరుగుతాయని, ఈతిబాధలు, శత్రు భయం తొలగిపోయి సుఖసంతోషాలతో కూడిన ప్రశాంత జీవనం ప్రాప్తిస్తుందని పురాణ కథనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement