Saturday, May 11, 2024

సద్గురుం తమ్‌ నమామి

భారతీయ సంస్కృతి గురువులకు విశిష్ట స్థానాన్ని కల్పిస్తూ ఆషాఢ పూర్ణిమను వ్యాస మహర్షి జయంతిగా గుర్తించి గురుపూర్ణిమగా అంగీకరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమాన స్థానం కల్పించి, తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే అని ప్రబోధించింది. తనకు గురువు. దైవం ఒకేసారి ప్రత్యక్షమైతే తాను మొదట నమస్కరించేది గురువుకేనని, ఎందుకంటే గురువు ద్వారానే భగవంతుని తెలుసుకోగలిగా నని అంటూ దైవంకంటే గురువే గొప్పవాడని తీర్పరించాడు కబీర్‌దాస్‌. తల్లిదండ్రులు ప్రసాదించిన శరీరంలో సంస్కారం, విజ్ఞానం అనే రెండు చైతన్య జ్యోతులను వెలిగించి, క్రమశిక్షణ కలిగిన ఉత్తమ జీవిగా క్రొత్త జన్మనిచ్చేవాడే గురువు. ఏ రక్త సంబంధం లేకపోయినా శిష్యులను తన కొడుకులకంటే మిన్నగా అభిమానించే గురువును మించిన నిస్వార్థ హితైషి మరెవరుంటారు? వామన పురాణంలో సనత్కుమారుడు బ్రహ్మదేవుని ఇలా ప్రశ్నిస్తాడు.
”నవిశేషోస్తి పుత్రస్య, శిష్యస్యచపితామహ?” కొడుకు, శిష్యుడు ఇద్దరూ గురువుకు సమానులేనా? తేడా ఏమైనా ఉందా! అని. బ్రహ్మ ఇలా సమాధా నమిచ్చాడు. ”పున్నామ నరకాత్‌ త్రాతి పుత్రస్యే నేహగీయతే! శేషపాప హర: శిష్య ఇతీయం వైదికీశ్రుతి:!!” అంటే ‘పుత్‌’ అనే నరకం నుండి మాత్ర మే రక్షింపగలవాడు పుత్రుడు. మిగిలిన అన్ని పాపాలబారి నుండి తప్పించ గలిగేవాడు శిష్యుడే కదా. కనుక కొడుకు కంటే శిష్యుడే అధికుడని భావం.
ప్రతి వ్యక్తికీ గురువు మార్గదర్శనం అవసరమే. శ్రీరాముడు వశిష్ట, విశ్వామిత్రుల వద్ద, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద వినయ విధేయ తలతో శుశ్రూష చేసి విద్యలను గడించారు. రామాయణంలోని అయోధ్య కాండలో గురువు గొప్పదనం ఇలా చెప్పబడింది.
స్వర్గ సౌఖ్యాలు, సిరిసంపదలు, ధనధాన్యాలు, విద్యావైభవాలు, పుత్రపౌత్ర సుఖము… ఇలా ఏది కావాలన్నా గురువు అనుగ్రహంతోనే సాధ్యపడతాయి. గురు అనుగ్రహం లేకుంటే అవన్నీ దుర్లభాలే. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు కూడా గోవింద భగవత్పాదుల వద్ద విద్యార్జన చేశారు. ఉత్తమ గురువుకు ఉండాల్సిన లక్షణాలను శాస్త్రాలు ఇలా చెప్పాయి
”శాంతోదాంత: కులీనశ్చ వినీత: శుద్ధ వేషవాన్‌
శుద్ధాచార స్సుప్రతిష్ఠ: శుచిర్దక్షు: సుబుద్ధిమాన్‌
ఆధ్యాత్మ జ్ఞాన నిష్ఠశ్చ, మంత్ర విశారద:
నిగ్రహానుగ్రహే శక్తో గురురిత్యభిదీయతే” శాంతుడు, ఇంద్రియ నిగ్ర హం కలవాడు, కులీనుడు, వినయశీలి, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధి మంతుడు, పరిశుద్ధుడు, ఆచారవంతుడు, చక్కని వేషధారణకలవాడు, మంత్ర తంత్రాలలో నిష్ణాతుడు, నిగ్రహాను గ్రహ శక్తుడు అయినవాడే సద్గు రువు అనిపించుకొంటాడని శ్లోకార్థం. ఈ లక్షణాలతోబాటు ఆయనకు విష య పరిజ్ఞానం, బోధన తత్పరత తోడైతే బంగారానికి పరిమళం అబ్బినట్లే.
గురువులు ‘బోధ’ గురువులు, ‘బాధ’ గురువులని రెండు రకాలు.
శిష్యుల నుండి ధనాన్ని కొల్లగొట్టేగురువులు లోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళు బాధ గురువులు. శిష్యుల మనస్సులకు దగ్గరై, వారి మనోవేదనలను పోగొట్టే నిజమైన బోధ గురువులు చాలా అరుదుగా ఉంటారని భావం. తెలుసుకోవాలి అనే తపన ఉండాలేగాని, ప్రకృతిలోని ప్రతి అణువు మనకు ఏదో ఒక పాఠాన్ని బోధిస్తుంది. యదు మహారాజుతో దత్తాత్రేయుల వారు తనకు ఇరవైనాలుగుమంది గురువులు ఉన్నారని చెప్పారట. తమ బోధించే తీరునుబట్టి గురువులు ఏడు రకాలంటారు పెద్ద లు. దర్పణ గురువులు. వీరు అద్దంవలె నిర్మలంగా ఉంటారు. గురువు శిష్యు ని రూపాన్ని తన మనస్సులో తలచుకోగానే ఆ శిష్యునికి గురువు విజ్ఞానం బదిలీ అయ్యి, అతను గురువు ప్రతిబింబంగా మారతాడు. క్రౌంచ గురు వులు. క్రౌంచపక్షి తన పిల్లలను జ్ఞాపకం చేసుకోగానే దూరంలో ఉన్నా ఆ పక్షి పిల్లలకు కడుపు నింపుతుందట. అలాగే ఈ గురువులు దూరాన ఉన్నప్పటికీ విద్య ప్రసాదిస్తారు. చందన గురువులు తన సమీపానికి వచ్చిన ప్రతి వస్తు వుకూ చందన వృక్షం పరిమళాన్ని పంచినట్లుగా వినయంగా తమను ఆశ్రయించిన శిష్యులకు ఇలాంటి గురువులు తమ విద్యను ధారపోస్తారు. కచ్ఛప గురువులు. తాబేలు తన చూపుతోనే తన పిల్లలను శక్తివంతులుగా చేసినట్లు ఈ గురువుల కటాక్ష వీక్షణాలు ప్రసరింపగానే శిష్యులు విద్యా వంతులవుతారు. స్పర్శ గురువులు. తన స్పర్శతో ఇనుమును బంగారంగా మారే ‘పరసువేది’లాగా కేవలం తమ అద్భుత స్పర్శతో శిష్యులను ప్రతిభా శాలురుగా చేసే గురువులు ఈ కోవకు చెందుతారు. ఛాయానిధి గురువులు. ఛాయానిధి అనే పక్షి నీడ మీదపడినవ్యక్తులు అదృష్టవంతులవుతారని నమ్మకం. ఇటువంటి గురువుల నీడలో ఎదిగిన శిష్యులు మహోన్నతుల వుతారు. నాదనిధి గురువులు. నాదనిధి అనే రాయికి ఏ వస్తువు తాకినా శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుందట. తమ చేతి స్పర్శతో శిష్యులకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు.
జిజ్ఞాసులై శిష్యునికి సమర్థుడైన గురువు, అలాగే సమర్థుడైన గురువు కు యోగ్యుడైన శిష్యుడు లభించడం ఒక అదృష్టమన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. వివేకానందునికి ఆయన గురువుగా, పరమహంసకు వివేకా నందుడు శిష్యునిగా లభించడం అలాంటి అరుదైన సంఘటనే కదా. చాణక్య చంద్రగుప్తులు, సమర్థ రామదాసు శివాజీలు వంటి గురుశిష్యులు అద్భుతాలు సృష్టించినవారే. మరి అంతటి గురువుల పట్ల శిష్యులు ఎలా ప్రవర్తించాలో కూడా మన సంస్కృతి మనకు నేర్పింది. కూర్మ పురాణం ఈ అంశం గురించి ఇలా చెప్పింది. ఎప్పుడూ గురువుగారి ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చోరాదు. ఆవులించడం, పరిహాసంగా మాట్లాడటం చేయ రాదు. డాంబికమైన కంఠాభరణాలు ధరింపరాదు. గురువులను, దేవత లను, వేదాలను నిందించేవారికి రౌరవాది నరకాలు సంప్రాప్తిస్తాయి. అటు వంటి వారితో కలిసి ఉండరాదు. వారికేసి కనీసం చూడరాదు. రెండు చెవు లను మూసుకొని ప్రక్కకు తొలగి వెళ్ళాలట. దిశానిర్దేశం చేసిన మన సంస్కృతి మహత్యాన్ని గుర్తిం చి మసలుకొందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement