Tuesday, July 23, 2024

TS | ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా: డీజీపీ రవి గుప్తా

రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. ఇవాళ (శనివారం) డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో భద్రత విధుల నిమిత్తం 73,414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు, 164 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, తమిళనాడుకు చెందిన మూడు స్పెషల్ ఆర్మ్ ఫోర్స్, 7000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఎన్నికల భద్రత విధుల్లో ఉంటారని వెల్లడించారు.

మద్యం అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా మొబైల్ టీమ్‍లను ఏర్పాటు చేశామని వివరించారు. మార్చి 16న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జరిపిన తనిఖీల్లో రూ. 184 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా 34,526 మందిని బైండోవర్ చేశామని అన్నారు. పొలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల పర్యవేక్షణ కొరకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. చివరి ఈవీఎం స్ట్రాంగ్ రూముకు చేరేంతవరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement