Tuesday, April 30, 2024

ఆది వైద్యులు-జీవకుడు

మన భారత సంస్కృతి- ప్రకృతిలో మమేకమైన, ప్రకృతిలోని ప్రతి జీవిని, వస్తు వును, దైవంగా భావించి జీవనగమనంలో ముందుకుసాగమని చెబుతుం టుంది. అందుకే నాడు రోగాలు, రుగ్మతలు కూడా తక్కువే ఉండేవి. ఏమైనా రోగాలు వస్తే, అందుకు తగిన, ప్రకృతి సహజంగా లభ్యమయ్యే మూలికలతో వైద్యం చేయబడేది. ఘనమైన మనచరిత్రలో ఎంతోమంది వైద్య ఘనాపాఠీలు ఉన్నప్పటికీ, వారిలో ”జీవకుడు” ప్రముఖంగా కనిపిస్తాడు.
జీవకుడు క్రీ.పూ. అయిదు ఆరు శతాబ్దివాడు. పాట్నా దగ్గర రాజగృహ ఆస్థాన వేశ్య శాలావతికి కుమారుడు. అప్పుడు మగధ సామ్రాజ్య రాజధాని రాజగృహ. బౌద్ధం ఉన్నతదశలో ఉన్నప్పుడు గొప్ప వైద్యుడుగా ఉన్నాడు. బుద్ధునికి కూడా వైద్యం చేశాడు. అరుదైన శస్త్రచికిత్సలు చేసేవాడు. శిశువైద్యంలో ప్రవీణుడు ”కౌమార భ్రుత్య” అనే శిశు రోగ వైద్యం ఈయన ద్వారా వచ్చిందే.
జీవకుడు ప్రతిభావంతుడైన భిషక్కు, బుద్ధుని ఆంతరంగిక వైద్యుడు. జీవకుడు రాజగృహ నగర వేశ్య కుమారుడు. ఆమె జీవకుడు జన్మించగానే చెత్తకుప్పపైన వదిలి వెళ్ళింది. మగధ రాజవంశీయుడైన కుమార అభయుడు జీవకుడిని పెంచుతాడు. జీవకుని ప్రస్తావన బౌద్ధ గ్రంథాలలోనేగాక జైనగ్రంథాలలో కూడా వుంది.
యుక్తవయసొచ్చాక రాజవిద్యలలో ప్రావీణ్యం పొందలేక వైద్యము, ఔషధ తయారీ విద్యల కొరకు తక్షశిల చేరాడు. ఏకసంథాగ్రాహ అయిన జీవకుడు ఏడు సంవత్సరములు వైద్య విద్య అభ్యసించి, గురువును నా చదువు పూర్తయిందా? అని అడుగుతాడు. గురువు గారు ఒక పార చేతికిచ్చి తక్షశిలకు ఒక యోజన దూరం (అంటే నాలుగు క్రోసులు లేక ఎనిమిది మైళ్ళు)లో వైద్యానికి పనికిరాని మొక్కలను తనకు తెచ్చిచ్చిపొమ్మని చెబుతాడు.
ఆనాడు జీవకుని గురువు దగ్గర పదిమంది శిష్యులు ఉండేవారు. ఈ పదిమందికి ఆయన వైద్యం నేర్పారు. చివరిలో ఒక పరీక్ష పెట్టారు. పదిమంది విద్యార్థులను పిలిచి ”మీరు అరణ్యంలోకి వెళ్ళి ఏ మందుకూ పనికిరాని ఆకులు తెచ్చి నాకు చూపించండి” అని. పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టంగానీ, పనికిరాని ఆకులు తేవడంలో కష్టమేముం ది? వెంటనే అందరూ బయలుదేరి వెళ్లారు. వెళ్లినవారిలో రెండెడ్లబండి తీసుకెళ్లిన విద్యార్థి ముందువచ్చాడు. గుత్తగా ఆకులన్నీ తీసి బండి నింపేసి తెచ్చాడు. ‘ఇవన్నీ పనికిరానివే’ అని చెప్పాడు గురువుగారితో. ఆయన నవ్వుకున్నారు. తరువాత సంచి తీసుకె ళ్లిన విద్యార్థి, రెండు జేబుల విద్యార్థి… ఇలా తొమ్మిదిమందీ వచ్చారు. ఒక్కొక్కళ్లు వాళ్ల కు తోచినన్ని పనికిరాని ఆకులు తెచ్చి గురువు గారికి చూపించారు. చివరికి పదవ విద్యార్థి కూడా వచ్చాడు. అతనే జీవకుడు. అతని ముఖంచిన్నబోయి ఉంది. గురువు గారు ”ఏంనాయనా అలా ఉన్నావు! నువ్వేమీ తేలేదా?” అని అడిగారు.
జీవకుడు ”గురువుగారూ! నేను ఎంత వెతికినా వైద్యానికి పనికిరాని ఆకు ఒక్కటీ నాకు కనపడలేదు” అన్నాడు. ”అదేమిటీ! నువ్వు వీళ్లందరికంటే తెలివైనవాడివా?” అని గురువు అంటే, ”అలాకాదండీ! మీరు నాకు వైద్య విద్యనేర్పడం ప్రారంభించినప్పుడే ఒక శ్లోకం నేర్పారు. దానిప్రకారం ఈ ప్రకృతిలో పనికిరానిదేదీలేదు అని చెప్పారు!” అన్నాడు.
”ఏమిటా శ్లోకం?” అని అడిగాడు గురువు.
”అమంత్రమక్షరం నాస్తి
నాస్తి మూలం అనౌషధం
అయోగ్య: పురుషోనాస్తి
ప్రయోగ: తత్రదుర్లభ:” అని జీవకుడు శ్లోకం చెప్పాడు. దీని అర్థం.
‘అమంత్రమక్షరంనాస్తి’ అంటే ఏ భాషలోనూ మంత్రంకాని అక్షరంలేదు. సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. వీటిలో మంత్రానికి పనికిరాని అక్షరంలేదు. ఏ అక్షరం దేనికి బీజాక్షరం అనే దాన్లో తేడాలుంటాయి గాని, అన్ని అక్షరాలు బీజాక్షరాలే. అలాగే ”నాస్తిమూలం అనౌషధం” అంటే వైద్యానికి పనికిరాని ఆకు కూడా ప్రపంచంలో లేదు. అలాగే ”అయోగ్య: పురుషోనాస్తి” అంటే పనికిరాని మనిషి కూడా ప్రపంచంలోలేడు (ఇక్కడ పురుష: అంటే మగ అనికాదు, మనిషి అని అర్థం. అంటే మగ లేదా ఆడ అని) ఇక చివరి వాక్యం”ప్రయోగ: తత్రదుర్లభ:” అంటే ఏ విషయం గురించి అయినా ముందు ప్రయోగంచేసి చూడాలి. అంటే పరిశీలించాలి. అంతేకాని ‘అది బాగోదు’ అని వెంటనే తీర్మానించకూడదు.
”ఈ శ్లోకాన్ని మీరు నాకు చెప్పారు గురువుగారూ! అందుకే నేను ప్రయత్నం చేశాను. మీరు చెప్పినట్లుగా నాకు పనికిరాని ఆకు దొరకలేదు” అన్నాడు జీవకుడు. వెంటనే గురువుగారు అతనికి మరో పరీక్ష పెట్టారు. ”మిగతావిద్యార్థులు పనికిరావం టూ తెచ్చిన ఆకులు దేనికి పనికొస్తాయో చెప్పు!” అన్నారు.
వెంటనే జీవకుడు ”ఇదిగో ఇవి మారేడు ఆకులు, తేమ (నీటితడి) ఉన్నచోట ఈ ఆకులు వేస్తే తేమను లాగేస్తాయి. అలాగే ఇది ఉత్తరేణిఆకు. పళ్లు తోముకోడానికి పనికి వస్తుంది, ఇది ఫలానా ఆకు, అతిసారం తగ్గిస్తుంది” అంటూ అన్ని ఆకుల గురించి, అవి దేనికి పనికొస్తాయనేది వివరంగా చెప్పాడు. గురువు ఆనందభరితుడయ్యాడు. దానితో అతని విద్య విజయవంతంగా పూర్తయిందని కొంత ధనం చేతబెట్టి పంపుతాడు గురువుగారు.
అలా బయలుదేరి అయోధ్య నగరం చేరేసరికి జీవకుడి వద్దనున్న ధనం పూర్తిగా అయిపోయింది. అయోధ్యలో ఒక శ్రేష్టిగారి భార్యకు ఎంతోకాలంగా శిరస్సుకు సంబం ధించిన వ్యాధితోబాధపడుతుంటుంది. అనేక రకాల వైద్యం చేయించినా నయంకాలే దు. జీవకుడు ఆ వ్యాధి నయం చేస్తానంటే కుర్రవాడు వీడేంచేయగలడని నమ్మరు. నయ మయితేనే రుసుము ఇమ్మన్నాడు. ఒక ద్రావకం ముక్కు ద్వారా పంపి నోటి ద్వారా తెప్పించి వ్యాధి నయం జేశాడు. ఆమె నాలుగువేల కహాపణాలు ఇచ్చింది. ఆమె కుమా రుడు సంతోషం పట్టలేక మరో నాలుగువేలిచ్చాడు. భర్త అదనంగా మరో నాలుగువేల కహాపణాలిస్తూ ఇద్దరు నౌకర్లను, గుర్రబ్బగ్గీని బహూకరించాడు.
ఇవన్నీ పెంచిన అభయుడికిచ్చి ఇదంతా మీ చలవే అన్నాడు. జీవకుడిని రాజభిష క్కుగా నియమించారు. బుద్ధుని ఆంతరంగిక వైద్యునిగా చేరి నలుదిక్కులా పేరుప్రతి ష్ఠలు సంపాదించాడు జీవకుడు. కపాలాన్ని ఛేదించి మెదడులోని రెండు యెటిక పాములు అంటే టేప్వార్మ్స్‌ (ిశూ| ూశసప) తీశాడు. ఇతడు బింబిసార చక్రవర్తికి కూడా శస్త్రచికిత్స చేశాడు.
వేరు మూలికలతో కషాయం, లేపనాలు, పిండికట్లు, ఔషధ గుణాలు కల నూనెలు వాడటం, శస్త్రచికిత్స పలురకాల వైద్యవిధానం అవలంబించారు. మంత్ర తంత్ర తాయె త్తుల ప్రమేయం వుండేదిగాదు. రక్తం గడ్డకట్టిన తరువాత పదునైన కొమ్మును వాడి చికిత్స చేసేవాడు. బుద్ధుడిపై ఈయన ప్రభావం చాలానే ఉంది. బౌద్ధసన్యాసుల వస్త్రధా రణ విషయంలో జీవకుడు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాడు. సన్యాసులు ముందే తయారైన వస్త్రాలను స్వీకరించడానికి అనుమతించాలని బుద్ధుడిని ఒప్పించడంలో జీవకుడు కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు బౌద్ధ సన్యాసులు శ్మశాన వాటికల నుండి తెచ్చిన వస్త్రాలు ధరించేవారు. ఈ వస్త్రాలు సన్యాసుల ఆరోగ్యానికి హానికరమని జీవకుడు వాదించి బుద్ధుడిని ఒప్పించాడు అంటారు. జీవకుడి వైద్యవిధానాలు ఇప్ప టికి థాయిలాండ్లో ప్రజలు అనుసరిస్తున్నారు. జీవకుడి విగ్రహాలు కూడా థాయిలాండ్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విధానాలన్నీ తరువాత కాలం నాటి వైద్య ప్రముఖుడు సుశ్రుతుడు తను అమలుజేసి తన రచనల్లో ఈ చికిత్సా విధానాలను ప్రస్తావిస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement