Sunday, May 19, 2024

మహా స్వామి లీలలు…

కుంభకోణం సమీపంలోని కుగ్రామంలో ఒక మండువా ఇంటిలో మహాస్వామి వారు బసచేసి ఉన్నారు. స్వామివారిని దర్శించడానికి దీక్షితులు గారు వెళ్ళారు. పరిచారకులను స్వామివారి ఆచూకీ అడిగి తెలుసుకుని స్వామివారున్నా రన్న గదిలోనికి ఓరవాకిలిగా మూసి ఉన్న తలుపు తీసుకుని ప్రవేశించారు. అక్కడ స్వామి వారు కూర్చునే ఆసనం ఉంది. కమండలం ఉంది. కాషాయ ఖద్దరు శాఠీలున్నాయి. స్వామి వారు కన్పించలేదు. బయటకు వెళ్లి ఉండవచ్చని గుమ్మం దగ్గరే కూర్చున్నారు దీక్షితులు. ఎంతసేపయినా అలికిడి ఏమీలేదు. పరిచారకులు మాత్రం స్వామివారు గదిలో ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారు.
గంట గడిచాక ఉండబట్టలేక దీక్షితులుగారు పరిచారకుణ్ణి ”స్వామివారు ఎక్కడ?” అని అడిగారు. ”లోపల జపం చేసుకుంటున్నారు కదా! మీరు వెళ్లి చూసివచ్చారు కదా! మళ్ళీ అడుగు తారేమిటి?”అన్నాడు పరిచారకుడు ఆశ్చర్యంగా. స్వామి లోపల లేరని తెగేసి చెప్పారు దీక్షితులు గారు. ఇద్దరూ కలిసి లోపలికి ప్రవేశించారు. ఆచమనం చేస్తూ స్వామి కనిపించారు. ”ఇందాక నేను చూసినప్పుడు మీరు అదృశ్యమైనారు” అన్నారు దీక్షితులు గారు. స్వామివారు సమాధానంగా చిరునవ్వు నవ్వారు.
ఇటువంటి అనుభూతి దీక్షితులుగారికి ఒక్కరికే కాదు ఇంకా అనేక మందికి కలిగాయి. తెనాలి సీతమ్మగారు తనకు జరిగిన ఇటువంటి అనుభూతి పదేపదే చెబుతుండేవారు. స్వామివారు ఓసారి దక్షిణాదికి వెళ్ళినప్పుడు అక్కడ పర్యటిస్తున్న సందర్భంలో ఒక గ్రామంలో దర్భపొదల మధ్య స్వామివారి మేనా దింపి బోయీలు విశ్రాంతి తీసుకుంటు న్నారు. పరిచారకులందరికి కునుకు పట్టింది. సీతమ్మ గారి భర్తకి స్వామివారిని తక్షణమే చూడాలన్న ఆవేశం పుట్టుకొచ్చింది. మేనా తలుపు తీసి చూశారు. లోపల స్వామి కన్పించ లేదు. అనుమానం వచ్చి హారతి వెలిగించి చూశారు. అబ్బే! స్వామి లేరు, పారిచారకులను, బోయీలను లేపారు. మేనా తలుపు తీసి చూశామంటే వారే మంటారో అని ”లోపల స్వామివారున్న అలికిడి లేదు చూడ”మన్నారు. వారు ”తలుపు లు మూసుకునే లోపల ఉంటారు. మీరు విశ్రాంతి తీసుకోండి” అని గట్టి గానే చెప్పారు. సీతమ్మ గారికి, భర్తకి, పిల్లవానికి ఏమి చెయ్యాలో పాలు పోలేదు. భార్యాభర్తలు పిల్లవాడు మేనాకు చేరొక ప్రక్కన కూర్చుని ధ్యానం చేస్తూ గడిపారు. మూడు గంటలకు పహారా వాళ్ళు, బోయీలు, పరిచార కులు నిద్రలేచి క్రొత్త కాగడాలు వెలిగించి ”రామా… రామయ్యా” అంటూ మేనా ఎత్తగానే తలుపు తీసి చిరునవ్వు నవ్వుతూ చేయెత్తి ఆశీర్వదిస్తున్నారు స్వామివారు. మహాభక్తురాలు సీతమ్మ. ఆమెది స్వామివారి పట్ల పుత్రప్రేమ. ”రాత్రంతా మమ్మల్ని భయభ్రాంతుల్ని చేశారు. ఎక్కడికి అదృశ్యమయ్యారు” అని గట్టిగా అడిగింది. అంత తేలికగా పట్టు బడ తారా స్వామివారు. వెన్నెల విరిసినట్లు చిరునవ్వులొలకబోశారు. ఆ మహాస్వామి వారి చిరునవ్వు సొగసులో ఎవరైనా సరే కొట్టుకొనిపోవలసినదే! అంతే… ఆ క్షణంలో ఇక మరో ప్రశ్న వేయడానికి ఎవరికీ మనస్కరిం చదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement