Thursday, May 16, 2024

సాయి ప్రేమ వర్ణించ సాధ్యమా..!

మహారాష్ట్రలో నివసించే సఖారాం ఔరంగాబాద్‌కర్‌ అనే వాడికి వివాహం అయ్యి 27 సం లు పూర్తయినా సంతానం కలుగలేదు. సుప్రసిద్ధులైన ఎందరో డాక్టర్ల చేత లక్షలకు లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించుకున్నారు. ఎన్నో వ్రతాలు, పూజలు, హోమాలు చేయించారు, ఎందరో దేవతలకు మొక్కుకున్నారు గాని ఫలితం కనిపించలేదు. చివరకు తమకు సంతాన యోగం లేదని నిర్ణయించుకున్నారు. అంతులేని ఆందోళన, ఆవేద నతో నిస్సారమైన జీవితం గడుపుతున్నారు. శ్రీ శిరిడి సాయినాథుని మహత్యం గురించి విని శిరిడి వెళ్ళి ఆఖరు ప్రయత్నం చేద్దామని అనుకున్నారు. ఔరంగాబాద్‌కర్‌ భార్య తన బంధు వైన విశ్వనాథునితో శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని అక్కడ రెండు నెలలు గడిపింది. ప్రతీ రోజూ పూజాది కార్యక్రమములను నిర్వహంచడం, నాలుగు వేళలా ఆరతులలో పాల్గొ నడం, సేవ, సద్గ్రంథ పఠనం, సద్గోష్టిలో పాల్గొనడం వంటి సత్కార్యాలలో చాలా చురుకుగా పాల్గొంది. ఒక్కసారైనా బాబాను ఒంటరిగా వున్నప్పుడు దర్శించుకొని తన కోరికను వెల్లడిం చుదామని ఆమె అనుకుంది. కాని మసీదు ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుండడం వలన అది ఆమెకు సాధ్యపడలేదు. ఇక ఆగలేక ఔరంగాబాద్‌ కర్‌ భార్య శ్యామాను కలిసి తన మనసులోని మాటను చెప్పింది. శ్యామా ఆమెకు సహాయం చేయ సంకల్పించి బాబా భోజన సమయంలో కొబ్బరికాయ ఇత్యాది పూజా ద్రవ్యాలతో మసీదు వాకిలి వద్ద సిద్ధంగా వుండమని చెప్పాడు.
ఒకరోజు బాబా భోజనం చేసాక శ్యామా ఆయన చేతులను తువ్వాలుతో తుడుస్తున్నాడు. అప్పుడు సాయి ప్రేమతో శ్యామా బుగ్గలు గిల్లారు. అందుకు శ్యామా కినుక వహంచి ”సాయి! నా బుగ్గను గిల్లడం నీకు భావ్యం కాదు. మా బుగ్గలు గిల్లే అల్లరి దేముడు మాకు అక్కర లేదు” అని అన్నాడు.
శ్రీ సాయి చిరునవ్వుతో ”శ్యామా! గత 72 జన్మల నుండి మనకు సంబంధం వుంది. అయినా నిన్ను నేను ఎన్నడూ గిల్లలేదు. ఇన్నాళ్లకు నిన్ను గిల్లగా నీకు కోపం వస్తుంది.” అని అన్నారు.
”దేవా! మాకు మీ నుండి ఎటువంటి స్వర్గ సౌఖ్యాలు అవసరం లేదు. మమ్మల్ని ఎల్లవే ళలా కనిపెట్టుకొని వుండి కాపాడితే అదే చాలు” అని మనస్పూర్తిగా ప్రార్ధించాడు శ్యామా. ఈ మాటల ద్వారా తన భక్తులతో ఎన్నో జన్మల నుండి తనకు అనుబంధం వున్నదని, అన్ని జన్మలలోనూ తన భక్తులను ఒకేవిధంగా కంటికి రెప్పలా కాపాడుతూ వుంటానని శ్రీ సాయి స్పష్టంగా తెలియజేసారు. అంతేకాక జనన మరణం ఎరుగని పరబ్రహ్మాన్ని అని, తనను నమ్మి శరణుజొచ్చే భక్త జనావళికి రక్షణ కవచం అందిస్తూ సన్మార్గ వర్తులను గావించడమే తన ముఖ్య కర్తవ్యమని శ్రీ సాయి తెలియజేసారు.
శ్రీ సాయి వెళ్ళి తన ఆసనం పై కూర్చోగానే శ్యామా ఔరంగాబాద్‌కర్‌ను రమ్మని సైగ చేసా డు. ఆమె ఆర్ద్రతతో పరుగు పరుగున వచ్చి శ్రీ సాయికి నమస్కరించి కొబ్బరికాయ, ఇతర పూజాద్రవ్యాలను ఆయనకు సమర్పించుకుంది. శ్రీ సాయి కొబ్బరికాయ నాడిస్తూ ”శ్యామా! ఇది ఎండిన టెంకాయ, ఇది ఏమంటుందో విను” అని అన్నారు.
”సాయీ! నీ భక్తురాలు తన గర్భంలో ఒక బిడ్డను ఇదేవిధంగా ఆడాలని కోరుకుంటోం ది. దయ చేసి ఆమెకు ఈ వరం ప్రసాదించు” అని శ్యామా ప్రార్ధించాడు.
అప్పుడు సాయిబాబా ”శ్యామా! మీరెంత అమాయకులు? టెంకాయ బిడ్డలను ప్రసా దిస్తుందా?” అంటూ చిరునవ్వు నవ్వారు.
”దేవా! నీ ఆశీర్వాద ప్రభావం నాకు బాగా తెలుసు. నీ కరుణామృత చూపులే ఆమెకు బిడ్డ ల పరంపరను ప్రసాదిస్తుంది. దయచేసి ఆ అమాయకురాలి తప్పులను మన్నించి ఆమెకు నీ వరాన్ని అనుగ్రహంచు” అంటూ బాబాను శ్యామా పరిపరి విధాలుగా వేడుకున్నాడు. ఔరం గాబాద్‌ కర్‌ భార్య కూడా తమ గత జన్మల పాపములను మన్నించి తమకు ఒక బిడ్డను ప్రసా దించమని మనసులోనే ఎంతో ఆర్ద్రతతో ప్రార్ధించింది. తుదకు భక్తుల ప్రార్ధనకు, ప్రేమకు లొంగిపోయి నీకు ఒక సంవత్సరంలోగా బిడ్దలు కలుగుతారని ఆశీర్వదించారు. అట్లా ఆశీర్వ దించి టెంకాయను పగులగొట్టి ఒక భాగాన్ని ఔరంగాబాద్‌ కర్‌ భార్యకు ప్రసాదంగా శ్రీ సాయి ఇచ్చారు.
ఔరంగాబాద్‌ కర్‌ భార్య పట్టరాని సంతోషంతో శ్రీ సాయికి నమస్కరించి తమ ఊరికి తిరుగు ప్రయాణం కట్టింది. శ్రీ సాయినాథుని మాటలు నిజం చేస్తూ సంవత్సరంలోగా ఆమె కు పండంటి బాబు పుట్టాడు. ఆ బాబు అయిదవ నెలలో ఆ దంపతులిద్దరూ శిరిడీ వచ్చి శ్రీ సాయి దర్శనం చేసుకొని తమ బిడ్డను సాయి పాదాలపై పడుకోబెట్టి ఆశీర్వదించవల్సిందిగా ప్రార్ధించారు. తమకు పుత్రోదయం కల్గించినందుకు కృతజ్ఞతతో ఆ దంపతులిద్దరూ శ్రీ సాయికి దక్షిణగా అయిదు వందల రూపాయలను సమర్పించారు.
శ్రీ సాయిబాబా వారిద్దరి పేరిట ఆ దక్షిణతో తన గుర్రమైన శ్యామకర్ణకు ఒక శాలను కట్టిం చారు. వైద్యుల ట్రీట్మెంట్‌, జ్యోతిష్కుల పరిశోధనలను అధిగమించి తమ భక్తులకు వారి లలాట లిఖితాన్ని తిరగరాసి బిడ్డలను ప్రసాదించిన శ్రీ శిరిడీ సాయినాథుని కరుణను, ప్రేమా నురాగాలను, భక్త పరాయణ తత్వాన్ని వర్ణించుటకు మాటలు చాలడం లేదు. అనుక్షణం శ్రీ సాయికి పరిపూర్ణమైన హృదయంతో కృతజ్ఞతలు అర్పించడం తప్ప మనమిక ఏమీ చేయగలం?

Advertisement

తాజా వార్తలు

Advertisement