Sunday, April 28, 2024

హర హర మహాదేవ…

ఎందరో ప్రాచీన, ఆధునిక కవులు, వాగ్గేయకారులు ఓంకార స్వరూపుడైన శివుని కీర్తించారు. ఓంకారమును ధ్వని లింగమని, స్వయంభూలింగమని, నాదలింగమని, యంత్రమును బిందు లింగమని, ప్రతిష్టిత లింగమును మకారలింగమని, ఉత్సవాలలో ఊరేగించే లింగమును ఉకార లింగమని, గురువు శరీరము అకారలింగమని అంటారు. ‘లింగం’ అనే పదానికి ‘చిహ్నం’ అని అర్థం. అది పానవట్టం చేత ఆవృతమై ఉంటుంది. పానవట్టం ప్రకృతి శక్తికి ప్రతీక. అర్థనారీశ్వర తత్వమే పానపట్టం చేత చుట్టబడిన శివలింగతత్త్వం.

ఉపనిషత్తులు పరమాత్మను ”సత్యం-శివం-సుందరం” అని నిర్వచించాయి. అతడే పరమమైన సత్యం, పరమమైన శుభం, పరమమైన సుందరం అన్నాయి. అతడే శివుడు. ఆ పర తత్వమే శివతత్త్వం అనీ సర్వకారణకారణమని విశ్లేషించాయి. అట్టి పరతత్త్వమైన పరమశివుని ఆరాధించడం భారతీయ సంస్కృతి. శివారాధన నిగమ, ఆగమ పద్ధతుల్లో జరుగుతున్నది. ‘అకల’, ‘సకల’ రూపాలలో ఆరాధింపబడుతున్నాడు పరమ శివుడు. అలాగే నిర్గుణ, సగుణ రూపాలలో ఆరాధనలందుకుం టున్నాడు. ‘అకల’ రూపం లింగాకారం. నిర్గుణ స్వరూపం. ‘సకల’ రూపం ‘సగుణ’ రూపంగా అనేక నామాలతో ప్రకటిత మవుతున్నాయి. చంద్రశేఖరునిగా, జటావల్లభునిగా, పశుపతిగా, నందివాహనునిగా, పార్వతీ పతిగా ఇలా ఎన్నో రూపాలలో సాక్షాత్కరిస్తున్నాయి. నిర్గుణ, సగుణ రూపాలు అతనివెె. అకల మూ, సకలమూ అయిన అన్ని రూపాలు ఆరాధనీయాలే.
ప్రధానంగా లింగతత్త్వం పరమశివుని పరతత్త్వ స్వరూపం…
ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మకు, స్థితి భర్త విష్ణువుకు తను ఇరువురిలో ఎవరు గొప్ప అనీ వాగ్వీవాదం చెలరేగి యుద్ధంగా మారింది. కర్త, భర్తల మధ్య నెలకొన్న యుద్ధ తీవ్రత లోకాలన్నిటికి ఉపద్రవం తెచ్చిపెట్టింది. దేవతలంతా లోక క్షేమం కోసం శివుని ప్రార్థించగా, శివుడు వారి మధ్య జ్వాలా స్థంభంగా ఆవిర్భవించాడు. కక్షిదారులకు ఆశ్చర్యం కలిగించాడు. బ్రహ్మ, విష్ణువుల్లో ఆ స్తంభం ఆది అంతములను ఎవరు కనుగొనగలరో వారే ఆది పురుషుడుగా నిర్ణయించుకోవాలన్న నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇరువురూ వైఫల్యం పొందేరు. లింగరూపంలోనున్న శివుడు ప్రత్యక్షమై మన మువ్వురిలో ఎవరూ ఒకరికంటే మరొకరు గొప్పవారం కామని, అందరము పరమాత్మ అంశలతో అతని ఆదేశాలను పాటిస్తున్నామని హితవు చెప్పేడు.
ఈ సంఘటన మాఘ కృష్ణ చతుర్దిశి అర్థరాత్రి జరిగింది. ఆనాడే మహాశివరాత్రి. అర్ధరాత్రి లింగోద్భవ సమయం. ఆ జ్వాలాలింగ మహాస్వరూపాన్ని చూడలేని దేవతా సమూహం ఆ రూపాన్ని ఉపసంహరించమని వేడుకొనగా, శాంతించిన పరమేశ్వరుడు పార్థివలింగ రూపంలో పృథ్విపై ఆవిర్భవించాడు. లింగతత్వం పరమశివుని జ్ఞానజ్యోతి స్వరూపం. అదే విధంగా సగుణ రూపాలు కూడా. ఇవి దివ్య యోగ జ్ఞానాలకు ప్రతీకలుగా భాసిల్లుతున్నాయి. సగుణ రూపాలను, నిర్వికార, నిరాకార, జ్యోతిర్మయ పరతత్త్వమై లింగ బింబంలో సాక్షాత్కరింపజేసుకుని లింగార్చన చేయడం సంప్రదాయం. ఆ కారణంగానే శివార్చన అనేక ప్రాంతాల్లో వేర్వేరు నామాలతో జరుగుతుంటుంది. పరమేశ్వరుడు తనంతట తానే పన్నెండు ప్రదేశాలలో ఆవిర్భవించినట్లు పురాణాలు వచిస్తున్నాయి. అవన్నీ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రాచుర్యం పొందాయి.
అవి –
సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం
ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకార మమలేశ్వరం
పరత్యాం వైద్యనాథంచ, ఢాకిన్యాం భీమశంకరం
సేతుబంధేచ రామేశం, నాగేశం దారుకావనే
వారణాశ్యంతు విశ్వేశం. త్య్రంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం, ఘృశ్నేశంచ శివాలయం.
ఇలా ఈ స్వయంభూలింగాలు జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించి ఆరాధనలనలందుకుంటున్నాయి. పరమశివుడు లోకాల్ని రక్షిస్తున్నాడు. జ్యోతిర్లింగాలుగానే కాక, శ్రీ ఆది శంకరాచార్యులవారికి అయిదు స్ఫటిక లింగాలనిచ్చి ఆయా ప్రాంతాల్లో ప్రతిష్టించమని ఆదేశించాడు పరమశివుడు. పంచభూతాత్మకమై న ఈ ప్రపంచానికి కారకుడతనే. ఆదిశంకరులు ఆ లింగాలను – పృథ్వీలింగం కాంచి క్షేత్రంలోనూ, జలలింగం జంబుకేశ్వరంలోనూ, అగ్నిలింగం అరుణాచలంలోనూ, వాయులింగం శ్రీకాళహస్తిలోనూ, ఆకాశలింగం చిదంబరంలోనూ ప్రతిష్టించారు.
ఇంతేకాక ఆంధ్రప్రదేశ్లో పంచారామాల వంటివి, ఎన్నో ప్రాంతాలలో శివ క్షేత్రాలు నెలకొని శివారాధనలు జరుగుతున్నాయి. ప్రతి క్షేత్రానికి వెనుక ఎన్నో పురాణగాథలు ఉండడం విశేషం. పరమశివుని స్వరూపం చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. జటాజూటం, శిరస్సుపై చంద్ర రేఖ, గంగాభవాని, చేతిలో త్రిశూలం, డమరుకం, గరళకంఠం, సర్పాలే ఆభరణాలుగా, చర్మాన్ని ధరించి ఉండడం, వంటినిండా భస్మాన్ని ధరించడం కానవస్తాయి. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి విశ్లేషణలున్నాయి.
”పరమతాపసిగా, విద్యలన్నీ జటలుగా తేజరిల్లిన మహాజ్ఞానాగ్ని శివుడు, అమృత తత్వమే చంద్రరేఖ, జలమూ-అగ్ని రెండూ ధరించిన విశ్వరూపుడు, లోకరక్షణ కోసం విషాన్ని త్రాగి కంఠాన దాచుకున్న దేవుడు, పవనాహారులైన యోగులే శివునాశ్రయించుకున్న సర్పాలు, కర్మలు. జ్ఞానాగ్నిచే దగ్ధమయ్యాక మిగిలే తత్వమే భస్మం, తాపసిక తత్త్వానికి ప్రతీక చర్మవసనం.”
ఆదిమధ్యాంత రహితుడు, జగదాధా రుడైన పరమశివుని వర్ణించడంఎవరికి సాధ్యం? శంకరుల అవతారమైన ఆదిశంకరులే ”యస్యత త్తుల్య దేవం నజానే నజానే నజానే” నీతో సమా నమైన దైవాన్ని తెలియలేకున్నాను” అన్నారు మహాకవి కాళిదాసు.

అకించ నస్సన్ ప్రభావస
సంపదాం త్రిలోకనాథ: పితృ సద్మగోచర:
సఖీను రూపశ్శివ యిత్యుదీర్యతే
ససంతి యథార్జ్యవిద: పినాకిన:
ఏమి లేనివాడైనా సంపదల నిచ్చేవాడు. స్మశాన వాసియైనా త్రిలోకనాథుడు భయంకర రూపం కలవాడైనా మంగళస్వరూ పుడు శివుడు అని చెప్పబడుతున్నాడు. అయినా శివుని యథార్థ స్వరూపం తెలిసినవారు లేరని భావం. ఇదే విధంగా భారవి తమ రచన కిరాతార్జునీయంలో శివస్వరూపణ అతి రమ్యంగా చిత్రించాడు.
త్రిమూర్తులలో శివునికి రుద్రుడని నామాంతరం. రుద్ర శబ్దానికి అనేక అర్థాలున్నాయి. ”రుతం సంసార దు:ఖం ద్రాతయతీతి-రుద్ర:” అంటే సంసార దు:ఖమును శమింపజేసే వాడని అర్థం.
”రుత్యా వేద రూపయా ధర్మాదీ నవలోకయతి ప్రాపయాతీతి” అని మరొక అర్థం అంటే వేద రూపంగా ధర్మాన్ని పెంపొందింపజేయువాడని భావం. ప్రణవ రూపము ను పొందింపజేయువాడూ రుద్రుడే.
త్యాగరాజు కూడా ఒక కీర్తనలో ”సదా శివమయుడగు- నాదోంకారస్వర విదులు జీవన్ముక్తులని – త్యాగరాజు తెలియు”అన్నాడు.
ఇలా ఎందరో ప్రాచీన, ఆధునిక కవులు, వాగ్గేయకారులు ఓంకార స్వరూపుడైన శివుని కీర్తించారు.
ఓంకారమును ధ్వని లింగమని, స్వయంభూలింగమని, నాదలింగమని, యంత్రమును బిందు లింగమని, ప్రతిష్టిత లింగమును మకారలింగమని, ఉత్సవాలలో ఊరేగించే లింగమును ఉకార లింగమని, గురువు శరీరము అకారలింగమని అంటారు.
‘లింగం’ అనే పదానికి ‘చిహ్నం’ అని అర్థం. అది పరమ శివునికి ప్రతీక. శివలింగ తత్త్వం అగాధం, అద్భుతం. అది పానపట్టం చేత ఆవృతమై ఉంటుంది. పానపట్టం ప్రకృతి శక్తికి ప్రతీక. అర్థనారీశ్వర తత్త్వమే పానపట్టం చేత చుట్టబడిన శివలింగతత్త్వం. శక్తి సంస్పర్శ చేత శివుడు వ్యక్తమౌతాడు.

పానపట్టమే యోని పీఠం. శక్తిపీఠం. వ్యాపకశీలమైన ప్రకృతీ తత్త్వమే యోని. ఉత్పత్తికి ఉపాదాన కారణమైన పరమశివుడే లింగం. యోగినే ‘భగము’ అన్నారు. ‘భగము గలవాడు’ భగ వానుడు అలా ప్రకృతీ శక్తులు. పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తు సృష్టికి కారకులు. ఈ విషయాన్ని ఉపనిషత్తులే కాక, పురాణాలు, భగవద్గీత, లలితోపాఖ్యానం విశదీకరించాయి. సృష్టి, స్థితి, లయాత్మకమైన శక్తి సంయోగం చేతనే శివుడు ‘కర్మ-కర్త’ అవుతున్నాడు. లింగవేది పార్వతి. లింగం మహేశ్వరుడు. ఈ జగత్తుకు తల్లిదండ్రులు. లింగాన్ని అర్చించడం అంటే మాతాపితరులను అర్చించినట్లే. బ్రహ్మవిష్ణు రుద్రాత్మకమైన పరంజ్యోతి స్వరూపమే లింగం అని శాస్త్రాలు వచిస్తున్నాయి. లింగార్చనకు మించిన సాధన లేదు. సమస్త పాపాలను భస్మం చేసి ఇహపర భోగాలనిచ్చి, కడమ శివ సాయుజ్యాన్ని ప్రసాదించే శక్తి లింగార్చనకు ఉంది. వాగర్థముల వలె కలసియున్న పార్వతీ పరమేశ్వరులను ప్రతి ఒక్కరూ నిత్యం పూజించాలి. ప్రత్యేకించి ప్రతి మాసంలో వచ్చే కృష్ణ చతుర్దశినాడు, విశేషంగా మాఘకృష్ణ చతుర్దశి (మహాశివరాత్రి) నాడు ఉపవాస, జాగరణల వంటి నియమాలు పాటించి, లింగోద్భవ సమయాన శివశక్తి స్వరూపుడైన లింగరూపంలో ఉన్న పరమశివుని దర్శించి, ‘హరహర మహాదేవ’ నామస్మరణతో తరిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement