Thursday, May 2, 2024

గోమాబాయి ?

చాలాకాలం క్రితం, మహారాష్ట్రలో గోమాబాయి అనే పేద పండరీనాథునికి మహాభక్తురాలు ఉండేది. ఆమె ఎప్పుడూ హరినామ సంకీర్తనం, బిక్షాటనతో దేహ పోషణ. వితంతువు, సంతానహనురాలు, అత్యంత పేదరాలు. తనకు వచ్చిన బిక్షలో తన శరీరపోషణకు ఎంత అవసర మో అంత ఉంచుకుని, మిగిలినది ఇతర పేదలకు పంచిపెట్టేది.ఒక్కోసారి తనకు వచ్చిన పిండి, బియ్యంలాంటి మూల పదార్థాలు దాచి, ఆ ఊరికి వచ్చిపోయే భాగవత బృందాలకు వండి పెట్టి భాగవత కైంకర్యం చేసేది. ఒకనాడు పండరీపురంలో మహోత్సవం దర్శించాలని ఆ ఊరినుండి ఎంతో మంది భాగవతులు బృందాలుగా ఏర్పడి వెళ్తున్నారు. గోమాబాయి తానుకూడా వెళ్ళాల నుకుని బయలుదేరడానికి నిశ్చయించుకుంది. తన దగ్గరనున్న కొంచెం సత్తు పిండిని మూటకట్టు కుని రంగారంగా అంటూ కాలినడక న బయలుదేరింది. మార్గమధ్యంలో కొంచెం పిండితో రొట్టెలు చేసుకుని తిని మళ్ళీ బయలుదేరేది. అలా నడి చి నడిచి భీమానది తీరం చేరింది. మర్నాడే మహోత్సవ ఆరంభం. భీమనాది పొంగు మీద ఉండడంతో కచ్చితంగా పడవ మీదే తీరం దాటా ల్సిన పరిస్థితి ఏర్పడింది. గోమా బాయి దగ్గర సత్తుపిండి తప్ప ఒక్క కాసు కూడాలేదు. ధనం ఉన్నవాళ్లు పడవలు ఎక్కి తీరం దాటి పండరీపు రానికి వెళ్తున్నారు. ఈమె దగ్గర ఒక్క కాసు కూడా లేకపోవడంతో పడవ నడిపే వాళ్ళు ఈమెను ఎక్కించుకోలేదు. ఎంతోమందిని బతిమాలింది, కానీ ఎవరూ పట్టించు కోలేదు. గట్టు మీద కూర్చున్న గోమాబాయి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ కూర్చుంది. గోమాబాయి ”అయ్యా, పండరీనాథా, నీ పండుగ చూడాలన్న కోరికతో వచ్చాను. నా ప్రాప్తం ఇంతేనేమో. ఇక్కడినుండి ఆ వెలుగులను చూసి తృప్తిపడమని చెప్తున్నావా తండ్రీ” అనుకుంది.
సరిగ్గా అప్పుడే ఒక ఖాళీ పడవ గోమాబాయి ఉన్న తీర్థం వైపు వచ్చింది. ఆ పడవ నడిపే వాడు ఆ ముసలవ్వను చూసాడు. పలకరించాడు. గోమాబాయి పులకరించి పోయింది. తన కష్టా న్ని చెప్పుకుంది. అవతలి గట్టుకు చేర్చు నాయనా, నీకు పుణ్యముంటుంది, అని వేడుకుంది.
ఆ యువకుడు నేను చేరుస్తాలే, ఇక్కడంతా బురదగా ఉంది, నీవు నడవలేవు అని అవ్వని చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని పడవ వరకూ తీసుకెళ్లి జాగ్రత్తగా పడవలో కూ ర్చోబెట్టి అవతలి వడ్డుకు తీసుకెళ్లాడు. పడవనడుపుతూ అవ్వ కష్టసుఖాల గురించి అడిగాడు. కష్టం ఏముంది నాయనా, సమయానికి పాండురంగడిలా వచ్చి నన్ను అవతలకి చేరుస్తున్నావు. ఆ రంగనాథుడి ం వైభోగం చూడబోతున్నాను, ఇక కష్టాలెక్కడుంటాయి అంది. అవతలి తీరంలో కూడా బురద అంటకుండా ఎత్తుకుని నేలపై దిగబెట్టాడు యువకుడు. గోమాబాయి తన దగ్గర ఉన్న పిండిలో సగభాగం ఇవ్వబోయింది. వద్దు పొద్దుటి నుండి చాలానే సంపాదించాను. ఆ సత్తుపిండిని రొట్టెలుగా చేసి ఎవరైనా భాగవతులకు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. గోమాబాయి ఉత్సవంలోమునిగిపోయింది.మర్నాడు నదిలో స్నానంచేసి, గుడికెళ్లింది. స్వామిని సేవించుకుంది.
తరువాత జ్ఞాపకం వచ్చింది. తన దగ్గరవున్న సత్తుపిండిలో సగభాగం రొట్టెలు చేసి ఎవరైనా భాగవతులకు ఇవ్వాలి. గోమాబాయి నీరసంగా ఉంది. ఏ భగవతులకైనా రొట్టెలు దానం చేసి కానీ ఆమె ఏమీ తినకూడదని నియమం పెట్టుకుంది. ఒక్క బ్రాహ్మణుడూ రాలేదు. శోష వచ్చి పడిపోయేలా వుంది. ఆ క్షణంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. ”అమ్మా, ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం వుందా?” అని అడిగాడు గోమాబాయిని. తన దగ్గరఉన్న పిండితో రెండు రొట్టె లు చేసి ఉంచింది. దాంట్లో ఒకదాన్ని తీసి వృద్ధుడికి ఇచ్చింది. ఆ వృద్ధుడు ఆ రొట్టె తిని, దీవిం చాడు. కానీ, తన వెంట ఉన్న వృద్ధురాలికి కూడా పెట్టమ్మా అన్నాడు.తన గురించి ఉంచుకున్న రొట్టె ఇచ్చింది. ఆమె నోట్లో రొట్టె పెట్టుకుందో లేదో, వృద్ధ దంపతులు పాండురంగడు, రుక్మిణీ మాతగా దర్శనం ఇచ్చారు. గోమాబాయి సంతోషంతో కళ్ళలో నీళ్లుధారగా కారుతుండగా వారి పాదాలపై పడిపోయింది. వారు గోమాబాయిని లేవనెత్తి ”మేము నిన్ను ఎప్పుడో మా ఆంత రంగిక భక్తురాలిగా స్వీకరించాము. అందుకే, రాత్రి పడవ వానిగా, విప్రదంపతులుగా, ఇప్పుడు యదార్థ రూపాల్లో దర్శనమిచ్చాము.దు:ఖాన్ని మాని, మమ్మల్ని సేవించుకో. నీకు త్వరలోనే నా సన్నిధిలో స్థానం ఇస్తాను” అని వెళ్లిపోయారు. అంత్యకాలంలో కృష్ణునిలో ఐక్యమయిపోయింది.
– దైతా నాగపద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement