Friday, April 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 10
10.
ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్‌
స తం పరం పురుషముపైతి దివ్యమ్‌ ||

తాత్పర్యము : మరణసమయమున ప్రాణవాయువును భృకుటిపై నిలిపి, యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావమున భగవానుని స్మరించెడివాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు.

భాష్యము : మృత్యు సమయమున మనస్సును భక్తితో పరమ పురుషునిపై లగ్నము చేయువలెనని ఇక్కడ తెలియజేయటమైనది. షట్చక్ర యోగము చేయువారు భృకుటిపై ప్రాణవాయువును నిలుపవలెనని సూచించబడినది. అయితే రాబోవు 14వ శ్లోకములో తెలిపినట్లు శుద్ధ భక్తులు భక్తి యోగము ద్వారా కృష్ణుని కృపచే మృత్యు సమయంలో ఆయనను స్మరించగలరని, వారు ఇటువంటి యోగా పద్ధతిని పాటించనవసరము లేదని అర్ధమగుచున్నది. అయితే ‘యోగ-బలము’ ఎవరికైనా, షట్చక్ర యోగికైనా, భక్తి యోగికైనా ఆవశ్యకమే. జీవితాంతము ఏ యోగమునూ పాటించకుండా హఠాత్తుగా చివరి నిమషములో దివ్య స్థితిని పొంది ఎవరూ భగవంతుణ్ని స్మరించలేరు. మృత్యు సమయములో మనస్సు ఎంతో కలత చెంది చింతను కూడి ఉంటుంది. కాబట్టి జీవిత సమయములో తప్పక ఏదో ఒక యోగాభ్యాసమును ఆచరించవలసి ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement