Sunday, May 19, 2024

గీతాసారం ( ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 3

మనుష్యాణాం సహస్రేషు
కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తి తత్త్వత: ||

తాత్పర్యము : వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలిసికొనగలుగుచున్నాడు.

భాష్యము : శ్రీ కృష్ణుడు ఈ శ్లోకములో తనను అర్థము చేసుకోవటం ఎంత అరుదో తెలియజేయుచున్నాడు. ఎక్కువ శాతం ప్రజలు తమ తక్షణ సమస్యలైన ఆహారం, నిద్రావసతులు, మైథున భోగము మరరియు రక్షణ ఏర్పాట్లను సమకూర్చుకోవటంలోనే తలమునకలై పోతూ ఉంటారు. ఎవరో కొద్ది మంది ఆత్మసాక్షాత్కారానికి ప్రయత్నిస్తారు. వారు జ్ఞాన యోగము ద్వారా, ద్యానయోగము ద్వారా నిరాకార బ్రహ్మాన్ని అర్థము చేసుకుంటారే గాని బ్రహ్మము, పరమాత్మకు అతీతమైన భగవంతుడి దరి చేరలేరు. ఎందువలనంటే భగవద్‌ తత్త్వము భక్తునికి మాత్రమే భగవంతుడు తెలియజేస్తాడు. దేవతలు సైతమూ భగవంతుడ్ని అర్థము చేసుకొనలేరు. కాబట్టి అట్టి మహాత్ముడు చాలా అరుదు ‘స మహాత్మసుదుర్లభ: ‘ అందుచే అందరూ భగవంతుని సేవలో నిమగ్నమైతే ఆ భగవంతుడిడు మెచ్చి తన గురించి తాను తెలియజేస్తాడు భగవంతుడ్ని సంపూర్ణముగా తెలియవలెనన్న ఇంతకు మించి వేరే మార్గము లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement