Thursday, December 7, 2023

ధ‌ర్మం మ‌ర్మం (ఆడియోతో..)

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా శంకరుడు, గౌతమ మహర్షుల మధ్య సంభాషణ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

పరమశివుని అష్ట అవతారమునకు తగినట్లుగా గంగా కూడా రూపాలను ధరించి పతివ్రతా తత్త్వమును సార్ధకము చేసుకొనుచున్నది. ఈవిధంగా శివ పార్వతులను గంగను గౌతమ మహర్షి స్తుతిం చగా పరమేశ్వరుడు, పార్వతీ, గణశాధిగణములతో సాక్షాత్కరించి నీవు భక్తితో చేసిన స్తోత్రములతో, వ్రతములతో తాను సంతోషించిన కారణంగా దేవతలకు కూడా దుర్లభమైన దానిని నీకిచ్చెదనని మహా శివుడు గౌతమునితో పలికెను. ఏమి వరము కావాలో కోరుకోమన్న జగన్మూర్తి అయిన శంకరుని వాక్యములు విన్న గౌతముడు ఆనంద భాష్పములతో తడిసిన శరీరము కలవాడై ఆశ్చర్యముతో దైవము, ధర్మము, బ్రాహ్మణ పూజనము తప్పక అద్భుత ఫలితము అందించునని అనుకొనెను. ఈ లోక గతి అత్యాశ్చర్యము అనుకున్న గౌతముడు ఆలోచించి దేవతలచే పూజించబడు జగన్నాధుడవయిన నీవు తన స్తోత్రములకు సంతోషించినచో నీ జటలలో దాగి ఉన్న శుభప్రదమైన గంగను తనకు ప్రసాదించమని శంకరునికి నమస్కరించి వినయముగా వేడుకొనెను. మూడులోకములకు ఉపకారం చేయుటకు కోరిన కోరికకు సంతోషించిన శంకరుడు భయము వీడి నీ కోసం మరొక కోరిక కోరుకోమని గౌతమునితో పలికెను. తాను శంకరునికై చేసిన స్తోత్రములను స్తుతించిన భక్తులకు సర్వకామసమృద్ధి కలగవలెనని గౌతముడు రెండో వరమును కోరెను. అనుగ్రహించిన శంకరుడు ఇది కూడా లోకోపకారముకేనని నీ కొరకు ఏదైనా వరము కోరుకోమని ప్రేరేపించెను. నీ జటలలోని గంగ – పావని, లోకమాత కావున ఆమెను విడిచిపెట్టినచో ఆ గంగా అన్ని నదులకు తీర్థరూపమగును, సముద్రం వరకూ ప్రవహిస్తున్న ఆ గంగలో స్నానమాచరించినచో మనస్సు, వాక్కు మరియు శరీరము వలన చేసిన సకల పాపములు నాశము చెందనిమ్ము అని గౌతముడు శంకరుని కోరెను.

- Advertisement -
   

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement