Wednesday, May 15, 2024

కీర్తియే కదా మూలాధారం!

‘ఒక మనిషి ఎలాంటివాడు? ఏమిటి?’ అనేది ఆ మనిషి తన జీవిత కాలంలో చేసిన పనులపై ఆధారపడి ఉంటుంది. విధివశాత్తు కొన్ని చేయకూడని పనులు చేయవలసి వచ్చి చేసినప్పటికీ, వివేకంతో మనిషిగా ఒకడు చేసే అసాధారణమైన మంచి పనులకు లోకం అతడిని మంచివాడుగానే గుర్తిస్తుంది. ఎప్పటికీ ఆ మనిషిని జ్ఞాపకం వుంచుకోవడం కూడా జరుగుతుంది. దీనికి గొప్ప ఉదాహరణగా నిలిచే మహోన్నత వ్యక్తి మహాభారతంలో కర్ణుడు. కర్ణుడంటేనే ‘దానకర్ణుడు’ అని పేరు పడిన వాడు. అయినప్పటికీ భారతంలో అతడు పోషించిన పాత్ర మాత్రం అతడిని ‘దుష్టచతుష్టయం’ లో ఒకడుగా నిలిచిపోయేలా చేసింది.
ఒక సందర్భంలో అతని జన్మకు కారకుడైన సూర్యుడు వాత్సల్యంతో వచ్చి ”అర్జు నుని కాపాడుకునే ప్రయత్నం ఇంద్రుడు చెయ్యబోతున్నాడు. అడిగిన దానిని దానంగా ఇవ్వకుండా వుండలేని నీ బలహనతను అనువుగా చేసుకుని, నీ దగ్గర్నుంచి నీకు సహజంగా వచ్చిన కవచకుండలాలను కొట్టేసి, నిన్ను బలహనుడిగా చేసే పన్నాగం పన్నాడు. నేడో రేపోమారు వేషంలో వస్తాడు. జాగ్రత్త పడు నాయనా!” అని హచ్చరి స్తాడు. అది విని సూర్యభగవానుడే విస్తుపోయే విధంగా ”అలాగా! అంత సౌభాగ్యమా!” అంటాడు కర్ణుడు.

మ|| మతిఁ గుంతీసుతపక్షపాతి యగుచున్‌ మాయాస్వరూపంబుతో
జితదైత్యుండు శతక్రతుండు నను భిక్షింపంగ నేతెంచు న
ట్టి తెఱంగైనఁ దదీయ కీర్తియ చుమీ డిందుం; ద్రిలోకీ సము
న్నతమై యొప్పు మదీయకీర్తి; యిదిసూ నాపుణ్య మెబ్బంగులన్‌.
(అరణ్యపర్వం, సప్తమాశ్వాసం, 292వ పద్యం)

‘అర్జునుని ప్రాణాలను కాపాడుకోవాలన్న పక్షపాత బుద్ధితో ఇంద్రుడంతటివాడు నా ముందు నిలబడి చేతులు సాచి నన్ను ‘భిక్షించడమా?’ అని తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ”అది అతని కీర్తికే అవమానం. నా కీర్తిని మరింతగా ఇనుమడింపజేసేదే కదా!” అన్నవి కర్ణుడు సమాధానంగా చెప్పిన మరికొన్ని మాటలు.
ఆ.వె|| కీర్తి విడువఁ జాలఁ; గీర్తితో మెలఁగంగఁ
జావు వచ్చెనేనిఁ జత్తుఁ; గాని
జగములోన నెల్ల ‘సడి కంటెఁ జావు మే’
లనఁగ బరఁగు మాట యనఘ, వినవె?
(అరణ్యపర్వం, సప్తమాశ్వాసం, 293)

”అడిగిన వానికి లేదనకుండా ఇస్తాడు కర్ణుడు’ అని కీర్తించబడడాన్ని వదులుకో లేను. ఆ పేరును నిలుపుకోవడంలో మరణం వచ్చినా స్వీకరిస్తాను తప్పితే చావుకు భయ పడి విరుద్ధంగా ప్రవర్తించలేను. ప్రపంచంలో పేరు పోగొట్టుకుని బ్రతకడం కంటె, చావు మేలనే మాట వింటూనే ఉంటాం కదా!” అని కూడా అంటాడు.
‘దుష్ట చతుష్టయం’లో ఒకడిగా ఏ పరిస్థితులలో చేరవలసి వచ్చిందో, వారితో చేరి ఏఏ పనులను దుర్యోధనుడు చేయడానికి పురిగొలుపుతున్నాడో, సభలో అందరి ముందు ఒక్కొక్క సందర్భంలో ఎంత ఔచిత్యరహతంగా మాట్లాడుతున్నాడో, దానికి భీష్ముని చేత ఎన్ని రకాల తిట్లను తిన్నాడో, ముందుముందు ఇంకా తినబోతున్నాడో… ఇవన్నీ తెలిసిన కర్ణుడికి, తన జీవితంలోని ఈ మొత్తం హనత్వానికి ఎదురుగా నిలబడి, తన మంచితనా న్ని, తన వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని చాటి చెప్పగలిగే దానగుణాన్ని ప్రాణం కోసం వదులుకోవడమంటే ఎలా వీలవుతుంది? వెధవ ప్రాణం పోతే పోతుంది, అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటాడే తప్ప, వదులుకోవడానికి సుతరామూ ఒప్పుకోక పోవడంలోనే ఔచిత్యం ఉంది. కర్ణుడిలో అది ‘కీర్తి కాంక్ష’ కాదు. విధి చేతిలో ఊహం చని దెబ్బలు తింటూ బ్రతుకు సాగిస్తున్న అతనికి అది ఒక ముఖ్యమైన అవసరం. కర్ణుడు నీచుడు అని లోకం నిందించకుండా వుండడానికి అతడు ఎన్నుకుని సమర్ధ వంతంగా ఉపయోగించిన ఒక ఉదాత్తమైన ఆయుధం.

కం|| తన కీర్తి యెంతకాలము
వినఁబడు నిజ్జగమునందు వెలయఁగ నందాఁ
కను బుణ్యలోక సౌఖ్యం
బున నెంతయు నుల్లసిల్లుఁ బురుషుం డనఘా!
(అరణ్యపర్వం, చతుర్ధశ్వాసం, 369వ పద్యం)

- Advertisement -

ఎంత కాలమైతే ప్రపంచంలో ఒక మనిషి కీర్తి వెలుగుతూ ఉంటుందో, అంత కాలం ఆ మనిషి పుణ్యలోక సౌఖ్యం అనుభవిస్తూంటాడు అని పై పద్యం భావం. మర ణం తరువాత ఆత్మజనకుడైన సూర్యునిలో కలిసిపోతాడు కర్ణుడు (స్వర్గారోహణ ప ర్వం, 68వ పద్యం). అలా, కర్ణుడి పుణ్యలోక సౌఖ్యానికి ‘దానకర్ణుడు’గా అతడు సంపాదించుకున్న కీర్తియే కదా మూలాధారం!

Advertisement

తాజా వార్తలు

Advertisement