Wednesday, May 1, 2024

ధర్మం – మర్మం : దానగుణం -1(ఆడియోతో…)

మహాభారతంలో దానగుణానికి ఉదాహరణగా ఉటంకించిన వృత్తాంతం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

తమ ప్రాణములతో ఇతరుల ప్రాణములను కాపాడిన వారికి సర్వం లభిస్తాయి కావున దానగుణం చాలా గొప్పది. దీనికి దుష్టాంతం నాగానందం అను నాటకంలోని జీమూత వాహనుని కథ.

జీమూత వాహనుడు అను యక్షరాజు పరమ దయామయుడు, రాజ్యపట్టాభిషేకం జరిగిన ఒక వివాహితుడు. ఒకనాడు అశ్వము మీద విహారానికి వెళ్ళగా ఒక పర్వత గుహలో నుంచి ఒక స్త్రీ ఆక్రందన విని తక్షణమే అచటకి వెళ్ళి ఆ స్త్రీ ఆక్రందనకు కారణం అడగగా నాగులమైన తమను గరుత్మంతుడు నిరంతరం తనకు ఆహారంగా స్వీకరిస్తున్నాడని, ఈ విధంగా అయితే తమ జాతి అంతరించిపోతుందని అలా కాక రోజుకు ఒక నాగును మాత్రమే ఆహారంగా స్వీకరించమని గరుడుడిని ప్రార్థించినట్లుగా ఆ స్త్రీ రాజుకు తెలిపెను. ఆ క్రమంలో ఈరోజు తన భర్త గరుడునికి ఆహారంగా వెళ్ళాలి కావున తాను విలపించుచున్నానని పలుకగా జీమూత వాహనుడు దయ తలచి మీ భర్తకు బదులుగా తన ప్రాణాలను అర్పిస్తానని తెలిపి ఎంత కాదన్న వినక తనను తాను అర్పించుకొనుటకు సిద్ధపడి వారిని తిప్పి పంపెను.

ఈ వార్త క్షణంలో రాజ్యమంతా పాకగా అందరూ గుంపులు గుంపులుగా జీమూత వాహనుడు ఉన్న ప్రదేశానికి తరలి వచ్చిరి. సాయంకాల సమయమున గరుడుడు రాగా పాముకు బదులు జీమూత వాహనుని చూచి ఆశ్చర్యం చెంది నీ వెవరివి అని ప్రశ్నించెను. నీవు తినవలసిన నాగులకు బదులుగా తనను ఆహారంగా స్వీకరించమని జీమూతవాహనుడు గరుడుని కోరెను. తమ రాజవంశపు నీతి అనుసారం తమ ప్రాణాలు ఇచ్చైనా ఇతరుల ప్రాణాలను కాపాడాలి కావున తన ప్రాణాలను ఆహారముగా స్వీకరించవలెనని జీమూత వాహనుడు ప్రార్థించెను. నవయవ్వనుడు, వివాహితుడైన నీవు సమృద్ధమైన రాజ్యము, సకల భోగములు వదిలి తనకు ఆహారముగా ఎలా కాగలరని గరుడుడు ప్రశ్నించగా ప్రాణాలు అశాశ్వతమైనవని , ఎప్పటికైనా పోయేవే కావున ఇప్పుడే తన ప్రాణాలను విడిచిపెడతానని జీమూతవాహనుడు పలికెను. గరుడుడు అతని మీద వాలి ఇష్టదైవాన్ని తలచుకోమనగా తన ప్రాణాలను దానం చేసే అవకాశం కల్పించినందుకు గరుడడే తన ఇష్టదైవమని కనులు మూసుకొని చేతులు జోడించెను. అతని ధైర్యానికి, త్యాగ బుద్ధికి సంతోషించిన గరుడుడు జోహార్లు అర్పించి తనని పూర్తిగా మార్చేసినందుకు కృతజ్ఞతగా ఇక మీదట మాంసాహారాన్ని తీసుకోనని శపథం చేసి జీమూతవాహనునికి అఖండ సామ్రాజ్య సంపదలను ప్రసాదించెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement