Friday, September 22, 2023

ధర్మం – మర్మం… గంగాస్నానవిధి

గంగాస్నానవిధి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

గంగాస్నానవిధి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

- Advertisement -
   

శంకరుడు ప్రసాదించిన గంగను గౌతమ మహర్షి బ్రహ్మగిరికి తీసుకొచ్చినపుడు అతనిపై దేవతలు పుష్పవర్షమును కురిపించి జయజయ ధ్వానాలు చేసిరి. అపుడు గంగాదేవి మూడులోకములలో 15 పాయలుగా ప్రవహించెను. పిదప గౌతముడు దేవదేవుడైన త్రినేత్రుడిని పూజించి గంగ యొక్క రెండు తీరములలో స్నానము చేసెనదని సంకల్పించగా గౌతముడు స్మరించినంతనే శంకర భగవానుడు ఆవిర్భవించెను. కరుణా సముద్రుడైన శంకరుని దర్శించుకున్న గౌతముడు చేతులు జోడించి ఈ తీర్థమున స్నానము ఎటుల సిద్ధించునని, సకల లోక హితము కొరకు గోదావరి తీర్థ స్నాన విధిని తనకు కృప చేయమని కోరెను.

గంగా, గోదావరీ స్నాన విధి :-

మహర్షే శృణు సర్వం చ విధిం గోదావరీ భవమ్‌
పూర్వం నాన్దీ ముఖంకృత్వా దేహ శుద్ధిం విధాయచ
బ్రాహ్మణాన్భో జయిత్వాచ తేషా మాజ్ఞాం ప్రగృహ్యచ
బ్రహ్మ చర్యేణగచ్ఛన్తీ పతితా లాపవర్జితా
యస్య హస్తౌ చ పాదౌచ మనశ్చైవ సుసంయతమ్‌
విద్యాతపశ్చ కీర్తిశ్చ సతీర్థ ఫలమశ్నుతే
దుష్ట భావం పరిత్యజ్య స్వధర్మ పరినిష్ఠిత:
శ్రాన్త సంవాహనం కుర్వన్‌ దద్యాదన్నం య ధోచితమ్‌
అంకించనే భ్య: సాధుభ్య: దద్యాద్వస్త్రాణి కంబలాన్‌
శృణ్వన్‌ హరి క ధాం దివ్యాం తధా గంగా సముద్భవామ్‌
అనేన విధినాగచ్ఛన్‌ సమ్యక్‌ తీర్థ ఫలం లభేత్‌
ద్విహస్త మాత్రే తీర్థాని సంభ విష్యన్తి గౌతమ
సర్వత్రా హంసన్నిహిత: సర్వకామ ప్రదస్తధా
గంగా ద్వారే ప్రయాగేచ తధా సాగర సంగమే
ఏతేషు పుణ్యదా పుంసాం ముక్తిదా సా భగీరధీ

తాత్పర్యము : మహర్షి గౌతమా! గోదావరీ తీర్థ స్నానవిధి సర్వస్వము వినుము. మొదట నాందీ శ్రాద్ధము జరిపి దేహశుద్ధిని ఏర్పరచుకుని బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారి అనుజ్ఞ తీసుకొని బ్రహ్మచర్యముతో పతితులను, భ్రష్టాలాపమును విడిచిపెట్టి స్నానము చేయవలెను. హస్తములు, పాదములు, మనస్సు, విద్య, తపస్సు, కీర్తి, నియమబద్ధముగా ఉంచుకున్నవాడు తీర్థ ఫలమును పొందును. దుష్ట భావమును విడిచి పె ట్టవలయును. స్వధర్మ పాలన చేయుచుండవలయును. అలసిన వారికి ఆర్తి పొందిన వారికి పాద సంవాహనాదులతో సేవ చేయవలయును. అట్లే యధాశక్తి అన్నదానము చేయవలయును. భగవంతుని అనుగ్రహమును తప్ప దేనినీ ఆశించని సాధువులకు అన్న దానమును, వస్త్ర దానమును, కంబళ దానమును చేయవలయును. స్నానము చేయుచున్నప్పుడు శ్రీహరి కథలను, గంగోత్పత్తి కథలను వినుచుండ వలయును. తీర్థమునకు రెండు హస్తముల ప్రాంతము అనగా ఆరు అడుగుల దూరమున తీర్థము ఫలప్రదమగుచుండును. కారణాంతరముల వలన నదీ జలములలో స్నానము చేయలేని వారు జలమునకు ఆరు అడుగుల దూరమున కూర్చున్ననూ స్నాన ఫలము లభించును. గంగా, గోదావరీ నదీ ప్రవాహ ప్రాంతమున అంతటా సకల కామనలను ప్రసాదించు నేను(శంకరుడు) సన్నిహితముగా ఉండును. గంగా ద్వారమున, ప్రయాగమున, సాగర సంగమున ఈ తీర్థములలో భగీరధీ నది మానవులకు పుణ్యమును, ముక్తిని ప్రసాదించును.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement