Friday, May 17, 2024

ధన నాశనానికి మూలం..

”ధనం మూలమిదం జగత్‌” అనే లోకోక్తి వుందిగదా!
ప్రపంచం అంతా ధనంతోనే ముడిపడి వుంది. ధనం లేనిదే ఏ పనీ జరుగదు. మానవులు ధనం సంపాదించి, విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటారు. దుర్వినియోగం చేస్తూ, కష్టాల పాలౌతుం టారు. కొన్ని సమయాల్లో అప్పులపాలౌతుంటారు. అది స్వయం కృతాపరాధం. ధనం నశించిపోవడానికి పలు కారణాలను తెలు పుతూ భర్తృహరి తను రచించిన నీతి శతకంలో అర్థ పద్ధతిని వివ రిస్తూ ఒక పద్యంలో యిలా సందేశం అందించారు.
మ|| యతి సంగంబున బాలుడాదరముచే, జ్యా భర్త దుర్మంత్రిచే
శ్రుతిహానిన్‌ ద్విజుడన్వయంబు ఖలుచే, గ్రూరాప్తిచే శీలము
ద్ధతిచే మిత్రత, చూపులేమి గృషి- మద్యప్రాప్తిచే సిగ్గు దు
ర్మతిచే సంపదలున్‌ నశించు, జెడు నర్థంబుల్‌ ప్రమాదంబునన్‌||

అంటూ సాంగత్యంతో సన్యాసి, లాలన వల్ల కుమారుడు, చెడ్డ మంత్రి వలన రాజు, వేదం అధ్యయనం లేకపోవడం వలన బ్రాహ్మ ణుడు, కుపుత్రుని వలన వంశము, దుర్మార్గులతో స్నేహం చేయుట వలన శీలము, గర్వము వలన స్నేహం, తరచుగా చూడకపోవడం వలన వ్యవ సాయం మద్యము సేవించుట వలన సిగ్గు- చెడు బుద్ధుల వలన సంపదలు- ఐశ్వర్యము- అజాగ్రత్త వలన అనగా పరాకువలన ధనం నశిస్తాయని భర్తృహరి తెలిపారు.
ధనం ఏయే కారణాల వలన నశిస్తుందో అనేక దృష్టాంతాలను పైపద్యంలో సమాజానికి తెలియజేశారు కవి.
సంగమంటే సాంగత్యం. దీనివలన కామమూ, కామము వలన క్రోధమూ, క్రోధము వలన సమ్మోహమూ, సమ్మోహం వలన స్మృతి భ్రంశము అనగా మతిమరపు కలుగుతాయని శ్రీకృష్ణ భగవానుడు గీతలో దివ్య సందేశ మందించినాడు.
”సంగాత్‌ సంజాయతే కామ:- కామాత్‌ క్రోధోభిజాయతే
క్రోదాద్భవతి సమ్మోహ:- సమ్మోహాత్‌ స్మృతి విభ్రమ:||”

అంటూ సామాన్యుని విషయంలో సాంగత్యం పలు అనర్థాలకు దారి తీస్తుంది. ఇక యతులు అనగా సన్యాసుల విషయంలో చెప్పాల్సిన పనిలేదు. సన్యాసి అంటే సన్యసించినవాడు గాదు. అన్నిటినీ త్యాగంచేసినవాడు. అన్నిటినీ పరిత్యజించినవాడు అని అర్థం. అలాంటి వ్యక్తి సాంగత్యానికి బానిసైతే అంటే లోనైతే తుదకు నాశనం తప్పదని కవి సందేశం.
పుత్రుల విషయంలో ఒక కవి ఒక శ్లోకంలో యిలా వివరించారు.
శ్లో|| లాలనా ద్బహవోదోషా: తాడనాత్‌ బహవో గుణా:
తస్మాత్‌ పుత్రంచ శిష్యంచ తాడయేన్నతులాలయేత్‌||

అంటూ పుత్రుడిని అతి గారాబం చేయుటవలన అనేక అనర్థాలు కల్గు తాయి. శిక్షించడం వలన, దండన వలన అతనికి పలు గుణాలు అబ్బుతాయి. కావున పుత్రుని, శిష్యుని శిక్షించాలేగాని అతి గారాబం చేయకూడదని శ్లోక భావం. పుత్రుని గారాబం చేస్తే ఆ పుత్రుడు గుణహీనుడై నాశాన్ని పొందుతాడు.
భర్తృహరి రాజుల విషయాన్ని వివరిస్తూ మంత్రుల మంత్రాంగాన్ని యిలా తెలిపాడు. మంత్రం గలవాడు మంత్రి. మంత్రం అంటే ఆరు గుణాలను కలిగి వుంటుంది. అవి వరుసగా సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధం, ఆశ్ర యం అనేవి. ఇవే షడ్గుణాలు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఈ విషయమే యిలా వివరించబడి వుంది.
”సంధి విగ్రహాన యాన- సంశ్రయ ద్వైధీ భావా: షాడ్గుణ్యం” అని.

ఈ ఆరు గుణాలను చక్కగా వివేచించి ప్రయోగించినపుడే రాజుకు విజ యంతోబాటు నిశ్చింతగా రాజ్యపాలన సాగుతుంది. మంత్రులు ఈ గుణాలను సమయానుకూలంగా ప్రయోగించాలి. అలా ఉపయోగించకపోతే రాజు హాని కలిగి నశిస్తాడు. రాజ్య పాలన సాగదు. కావున రాజుకు సలహాలనిచ్చే మంత్రి దుర్మార్గుడైతే రాజు వినాశనానికి కారకుడౌతాడు.
షాడ్గుణ్యాన్ని సరిగా ప్రయోగించకపోవడమే దౌర్మంత్య్రం.
ఇక ఫలితాన్ని అపేక్షించకుండా బ్రాహ్మణుడైనవాడు షడంగ యుక్తమైన వేదాన్ని అధ్యయనం చేయాలి. దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి.
”నిష్కారణ నబ్రాహ్మణన- షడంగ యుక్తో వేదో, అధ్యే యోజ్ఞేయశ్చ”
అని వేద వాక్యం.
”అనధీత శ్రుతిర్విప్ర:- సభామధ్యేన శోభతే” అనేది వేద వాక్యం.

- Advertisement -

అనగా వేదం అధ్యయనం చేయని బ్రాహ్మణునికి సభలో గౌరవం వుండ దని వేద ఘోష. కావున బ్రాహ్మణునకు వేదాధ్యయనం అత్యంతావశ్యకం. అలా చేయకపోతే బ్రాహ్మణునికి నాశనం కల్గుతుంది.
మూర్ఖుడైన పుత్రునిచే వంశ నాశనం జరుగుతుంది. కుపుత్రుడు కులా న్నంతా సమూలంగా నాశనం చేస్తాడు.
”కుపుత్రస్తు కులే జాత:- స్వకులం నాశయేత్‌ ధృవమ్‌”
అని శాస్త్రం. శీలం అంటే సత్‌స్వభావం. సదాచారం.
యిక పంచ మహాపాతకాల్లో మద్యపానం ఒక పాతకం” అని మన పూర్వు లు తెలిపారు. మద్యపానం చేసిన వ్యక్తి ప్రవర్తన ఎలా వుంటుందో ఒక కవిగారు యిలా వివరించారు.
”అయుక్తం బహుభాషంతే- యత్ర కుత్రాపి శేరతే
నగ్నా విక్షిప్య గాత్రాణితే- జాల్మా ఇవ మద్యపా:?”

అంటూ మద్యం తాగినవారు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. ఎక్కడ బడితే అక్కడ పడుకుంటారు. దేహంపై బట్టలున్నవీ లేనిదీ గ్రహించరు. నలుగురిలో అతని లజ్జ పోతుంది. పలు వ్యసనాలకు బానిసౌతారు.
పై పద్యంలో భర్తహరి చివరకు ”అర్థంబుల్‌ ప్రమాదంబునన్‌” అని పరా కువలన అనగా అజాగ్రత్త వలన ధనం నశిస్తుందని పేర్కొంటూ, ధనం విష యంలో కడు జాగరూకులై వుండాలంటూ, సూచనను, హెచ్చరికనూ సమాజా నికి మనోజ్ఞంగా తెలుపుట సమాజ క్షేమం కొఱకే. కవిగారి సందేశం సంఘ సంక్షేమం కోసం- దేశాభివృద్ధి కోసమే గదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement