Thursday, May 2, 2024

దండ కారణ్యం – జన స్థానం

”రామా! ఇక్ష్వాకుని కుమారుడు దండుడు, అతడు మూర్ఖుడు. దుష్ట స్వభావుడు. ప్రజా పీడకుడు. ధర్మ ప్రభువ యిన ఇక్ష్వాకుడు కొడుకు ఆగడాలను, హింసాత్మక ప్రవృ త్తిని, ధర్మ విరోధ స్వభావాన్ని సహింపలేకపోయాడు. ప్రజా సౌఖ్యాన్ని, రాజ్య సంక్షేమాన్ని ఆకాంక్షించి, తన కొడుకు దండుని వింధ్య శైవల పర్వత ప్రాంతానికి పంపించాడు. కన్న కొడుకయినా ప్రజా సంరక్షణార్థమై దేశం నుండి బహిష్కరించాడు. దండుడు వింధ్య శైవల పర్వతాల మధ్య ”మధుమంతం” అనే నగరాన్ని నిర్మించాడు. రాక్షస గురువు శుక్రాచార్యుని పురోహితునిగా చేసు కొని రాజ్యాన్ని పాలించాడు. దండుడు ఒకనాడు యాదృచ్ఛికంగా శుక్రాచార్యుని ఆశ్రమా నికి వెళ్ళాడు. అక్కడ చూడచక్కని అందాల రాశి కనిపించింది. ఆమె అందచందాలను చూసి దండుడు కామ మోహితుడయ్యా డు. కాంక్షతో చేరవచ్చాడు. నువ్వు ఎవరు? ఎవ్వరి దానివి? ఇక్క డ విహరిస్తున్నావేమి? అని ప్రశ్నించాడు. నేను శుక్రాచార్యుని పుత్రి కను. నా పేరు అరజ అని తన గురుపుత్రికను కోరడం క్షంతవ్యం కాదు. నీవు నాపై మనసుపడితే నా తండ్రి అనుమతి పొందడానికి ప్రయత్నింపుము. ఆయన నీకు నన్ను ఇస్తే, నీకు భార్యను కాగల ను అని అరజ సౌమ్యంగా సమాధానం ఇచ్చింది.
కామాంధుడు తమకాన్ని ఆపుకొనలేకపోయాడు. గురుపుత్రిక అనే జ్ఞానం కూడా లేకుండా క్రూరాత్ముడై బలవంతంగా అరజను అనుభవించి వెళ్ళాడు. శిష్యుల ద్వారా శుక్రాచార్యుడు దండుని అత్యాచారాన్ని తెలుసుకున్నాడు. ఆశ్రమానికి వచ్చాడు. నలిగిన పువ్వు వలె వడలిపోయి నిస్తేజంగా దీనురాలై విలపిస్తున్న అరజను చూశాడు. దండుని దురాగతాన్ని తలచి కోపించి, ”దండుని నగ రం చుట్టూ నూరు యోజనాల ప్రాంతంలో ఏడు రోజుల పాటు దుమ్ము వాన కురుస్తుంది. దండుడు బంధుమిత్ర, భృత్య సహి తుడై చతురంగ బలాలతో కూడ మరణిస్తాడు” అని శపించాడు. ఏడు రోజులు దుమ్మువాన కురిసింది. మరుభూమిగా మారిపో యింది. ఒక్క ప్రాణి కూడ మిగలకుండ అది అరణ్యంగా మారిపో యింది. అందువల్ల దండకారణ్యంగా పిలువబడింది.
శుక్రుడు ఆశ్రమ వాసులను చూసి ”మీరందరూ ఈ దండుని రాజ్యం పొలి మేరలను దాటి ఆశ్రమాలను నిర్మించుకుని జీవిం చండి” అన్నాడు. శుక్రుని ఆశ్రమ వాసులు నివసించిన ప్రాంతం ”జన్మ స్థానం” అని పిలువబడింది. రాముడు ఆ సరస్సునందు స్నానమాడి, సంధ్యా కాలపు విధులను నిర్వర్తించాడు. ఆ రాత్రి అగస్త్యుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తెల్లవారిన పిమ్మట అగస్త్యుని అనుమతి పొంది బయలుదేరి అయోధ్య చేరాడు.
అశ్వమేధ యాగ ప్రాధాన్యం- పురూరవ జననం
ఒకనాడు శ్రీ రాముడు భరత శత్రుఘ్నులతో ముచ్చటిస్తూ రాజసూయ యాగం చేయాలనుకొంటున్నాను అన్నాడు. భరతుడు ”అన్నా! నువ్వు ఉదాత్త చరితుడవు. సౌమ్యుడవు. ధర్మ రక్షకుడవు. రాజసూయ యాగం నిర్విఘ్నంగా సమాప్తమయితే భీకర సంగ్రా మం జరుగుతుంది. సర్వ నాశనం సంభవిస్తుంది. ఇంతటి ఘోర కృత్యం నీవు చేయడం ఉచితం కాదు” అని సవినయంగా విన్న వించాడు. రాముడు భరతుని హృదయ నైర్మల్యానికి సంతసిం చాడు. మంచి సూచన ఇచ్చావు అని అభినందించాడు.
లక్ష్మణుడు, ”అన్నా! అశ్వమేధ యాగం సర్వ పాపాలను హరిస్తుంది. పూర్వం ఇంద్రుడు వృత్తాసురుని వధించి, బ్రహ్మ హత్య పీడితుడయ్యాడు. తేజో విహీనుడై పదవీ భ్రష్టుడయ్యాడు. తరువాత విష్ణువును ఉద్దేశించి అశ్వ మేధయాగం చేసి, బ్రహ్మ హత్య పాతకం నుండి విముక్తుడై మరల ఇంద్ర పదవిని అలం కరించాడు కదా! అశ్వమేధం శ్రేయోదాయకం” అన్నాడు. రాముడు లక్ష్మణుని సూచనను అభినందించాడు. అశ్వమేధ యాగం మహిమను తెలిపే ఒక ఇతిహాసాన్ని ఇలా తెలిపాడు.
” పూర్వం కర్దమ ప్రజాపతి కొడుకు ఇలుడు బాహ్లిక దేశాన్ని పాలించాడు. అతడు ధర్మ నిరతుడు. ప్రజారంజకుడైన పరిపాల కుడు. అతని బలపరాక్రమములు ముల్లోకాల్లో ప్రఖ్యాతి పొందా యి. ఒకనాడు ఇలుడు పరివార సమేతుడై శివుడు విహరిస్తున్న వనంలోప్రవేశించాడు. శివుని మహిమ వల్ల ఇలుడు, అతని పరి వారమంతా స్త్రీలు అయ్యారు. గుర్రాలు కూడ బడబలు (ఆడ గుర్రాలు) అయ్యాయి. అందరూ ఒకరి రూపాలను మరొకరు చూసుకుని విస్తుపోయి చింతించారు. ఇల మహరాజు శోకించి, ఇది పరమశివుని ప్రభావమే అని గ్రహించి, పరమ నిష్టాగరి ష్టుడై శివుని ఆరాధించాడు. శివుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమయ్యాడు. పురుషరూపం తప్ప మరొ క వరం ఏదైనా కోరమన్నాడు. ఇలుడు నోరు తెరవలేకపోయా డు. దేనిని ఆశించి నియతవ్రతుడై ఆరాధించాడో దానినే కోరవద్దు అని శివుడు పలకడం వల్ల ఇలుడు హతాశుడై నిరుత్తరుడయ్యాడు. పిమ్మట కరుణామూర్తి మాతృవత్సలయిన పార్వతికి భక్తితో నమస్కరించాడు. పార్వతి ప్రీతురాలై నేను శివుని శరీరంలో సగ భాగాన్ని కాబట్టి శివుని శాపాన్ని సగంమాత్రమే సరిదిద్ది నిన్ను అనుగ్రహించగలను అనింది. నీవు కొంతకాలం స్త్రీ రూపాన్ని ఒక నెల పురుష రూపును ప్రసాదింపుమని కోరాడు. అట్లే అవుతుంది. స్త్రీ రూపంలో గడిపిన జీవితం పురుష రూపాన్ని దాల్చినప్పుడు గుర్తుండదు. పురుష రూపంలో గడిపిన జీవితం స్త్రీ రూపం దాల్చినప్పుడు గుర్తుండదు అని పార్వతి అనుగ్రహించింది.
పార్వతీ పరమేశ్వరుల మహత్యంవల్ల ‘ఇల’ అనే పేరుతో అం దాల సుందరియై ప్రకాశించింది. ఇలా సుందరి తన చెలుల సమూహంతో విలాసంగా విహరిస్తూ అ వనానికి సమీపంలో ఉన్న ఒక సరస్సును సమీపించింది. చంద్రుని కొడుకు బుధుడు బ్రహ్మ చర్య నిష్టతో సరస్సు జలాల్లో తపోనియతుడై ఉన్నాడు. అతడు మన్మథుని వలె సుందర రూపుడు. కామిని మానస చోరు డు. చెలుల గుంపులో మెరుపు తీగవలె మెరుస్తూ మిసమిసలాడు తున్న ఇలా సుందరిని చూసి, బుధుడు మదన పరవశుడయ్యా డు. బుధుడు యోగ దృష్టితో ఇలా సుందరి వృత్తాంతాన్ని గ్రహిం చాడు. ఆమె చెలులను పిలిచి, ”మీరు కిన్నెర స్త్రీలుగా ఈ కొండ పరిసరాల్లో నివసింపుడు. కింపురుషులు మీకు భర్తలు అవుతారు” అన్నాడు. వారు ఇలా సుందరిని ఒంటరిగా విడిచి వెళ్ళారు.
బుధుడు ఒంటరిగా ఉన్న ఇలా కన్య వద్దకు చేరి, తన కోరి కను వెల్లడించాడు. ఇలా సుందరి అంగీకరించి, ఆ నవ మన్మథా కారుని వరించింది. వారు కామ క్రీడాతత్పరులై రాత్రింబవళ్ళు కామ సుఖాలను అనుభవించారు. ఒక నెల గడిచిన తరువాత ఇల పురుషరూపాన్ని ధరించింది. అది గమ నించి, బుధుడు జలాల్లో మునిగి యథాపూర్వం తప స్సు చేసేవాడు. ఇలుడు బుధునిచూసి,”మహాత్మ! నేను మంత్రులతో పరివారంతో వేటకువచ్చాను. వారు ఏమ య్యారో! కనిపించడం లేదు. మీకు తెలిస్తే చెప్పమ”ని కోరాడు. బుధుడు, ”రాజా! నీ పరివారమంతా వడ గండ్ల వాన కారణంగా మరణించారు. నీవు ఎలాగో తప్పించుకుని, ఈ ఆశ్రమాన్ని ఆశ్రయించావు. ఇప్పుడు వగచినందువల్ల ప్రయోజనంలేదు. నిశ్చింతుడవై కంద మూల ఫలాలను ఆహారంగా స్వీకరిస్తూ ఇక్కడ జీవిం పుమన్నాడు. ఇలుడు తన రాజ్యానికి పోవాలని పట్టు బట్టాడు. బుధుడు ఇలా సుందరియై బద్దానురాగుడై ”రాజా! నీవు తిరిగి వెళ్ళవద్దు. కొంతకాలం ఇక్కడే గడుపుము. నీకు మేలు జరుగుతుంది” అన్నాడు. యుక్తియుక్తమైన చతుర వచనాలతో ఇలుని మనసును మార్చాడు. ఇలుడు అక్కడే ఉండిపోయాడు. ఒకనెల తర్వాత స్త్రీ రూపుపొందాడు. బుధుడు తాత్కాలికంగా తపస్సుకు స్వస్తి చెప్పా డు. ఇలా సుందరితో రతిక్రీడాసక్తుడై తాను సుఖిస్తూ, ఇలా సుంద రిని సుఖ పెట్టాడు. ఇలా సుందరి గర్భవతియై ఒక కొడుకును కంది. అతడు పురూరపుడు అని పేరు పొందాడు. ఆమె కొడుకుని బుధునికి అప్పగించింది. బుధుడు ఒక సంవత్సరం ఇలా సుంద రితో కామ భోగాలను అనుభవించాడు. ఇలాసుందరి మగరూపు దాల్చిన నెలలో బుధుడు, సంవర్తుడు, చ్యవనుడు, అరిష్టనేమి మున్నగు మహర్షులను రావించాడు. ఇలుని తండ్రి కర్దమ ప్రజా పతి కూడా వచ్చాడు. ఇల మహరాజుకు పూర్వంవలె పురుష రూపం స్థిరంగా లభించేటట్లు చేయమని కోరాడు. పరమ శివుని ఉద్దేశించి, అశ్వమేధ యాగం జరిపిస్తే ఇలునికి శుభం కలుగుతుం దని కర్ణమ ప్రజాపతి సూచించాడు. అందరూ కలిసి ఇలునిచే అశ్వ మేధ యాగం చేయించారు. శివుడు ప్రత్యక్షమై మునుల అభ్యర్థన మేరకు ఇలునికి శాశ్వతంగా పురుష రూపాన్నిచ్చారు. ఇలుని తరు వాత పురూరవుడు ప్రతి ష్టాన పురానికి ప్రభువు అయ్యాడని రాముడు తెలిపాడు.
– కె.ఓబులేశు

Advertisement

తాజా వార్తలు

Advertisement