Monday, May 20, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 27

స్పర్శాన్‌ కృత్వా బహిర్బాహ్యాన్‌
చక్షుశ్చైవాంతరే భ్రువో: |
ప్రాణాపానౌ సమౌ కృత్వా
నాసాభ్యంతరచారిణౌ ||
28.
యతేంద్రియమనోబుద్ధి:
మునిర్మోక్షపరాయణ: |
విగతేచ్ఛాభయక్రోధో
య: సదా ముక్త ఏవ స: ||
nతాత్పర్యము : బాహ్యేంద్రియార్థములన్నింటిని త్యజించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను నాసిక యందే సమములుగా చేసి తద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను అదుపు జేయునట్టి మోక్ష వాంఛితుడు కోరిక , భయము, కోపముల నుండి ముక్తుడగును. అట్టి స్థితిలో సదా నిలిచి యుండువాడు తప్పక ముక్తిని పొందగలడు.

భాష్యము : ఇంతకు ముందు శ్లోకాలలో భగవత్సేవ ద్వారా భౌతిక బంధనాల నుండి విముక్తుడై భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకొనే మార్గాన్ని బ్రహ్మ నిర్వాణమని తెలుసుకున్నాము. ఈ రెండు శ్లోకాలలో అష్టాంగ యోగ పద్ధతి ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి ఏవిధముగా ముక్తి సాధించ వచ్చనే దానిని క్లుప్తంగా వివరించారు. రాబోవు ఆరవ అధ్యాయములో మరింత స్పష్టముగా ఈ పద్ధతి వివరించడము జరిగినది. ఈ పద్ధతిలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి అను ఎనిమిది సోపానాలు ఉన్నాయి. మనలోని రకరకాల వాయువుల ప్రసరణను నియంత్రించి ఇంద్రియాలను, ఇంద్రియ భోగ వస్తువుల నుండి ఉపసంహరించి ముక్తి మార్గములో పయనించుటకు ప్రయత్నించుదురు. అయితే కృష్ణ చైతన్యములో నున్న వ్యక్తి భగవత్సేవలో నిమగ్నుడగుట వలన సహజముగానే ఇతరములైన వాటి పట్ల ఆసక్తి లేకుండుటచే ఇంద్రియాలను నిగ్రహించుటలో ‘అష్టాంగ యోగ పద్ధతి’ కంటే సులభమైనదని గమనించవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement