Saturday, April 27, 2024

ఏడుపాయ‌ల వనదుర్గమ్మ సన్నిధిలో పుణ్యస్నానాలు

పాపన్నపేట : తెలంగాణలోనే రెండవ ప్రసిద్ధ‌ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధి మాఘ స్నానాలకు ముస్తాబైంది. శనివారం ప్రారంభంకానున్న మాఘజాతరకు పాలక మండలి సభ్యులు, అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దేవిక్షేత్రంలో జరగనున్న జాతరకు రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుండి సుమారు లక్షల మంది భక్తులు రానున్నారు. ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో మాఘ అమావాస్య, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వ‌హిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొందుకు రాష్ట్ర నలుమూలలు నుండే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుండి లక్షలాధి మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

మాఘ అమావాస్య పురస్కరించుకొని ఏడుపాయల్లో జరగనున్న జాతర ఏర్పాట్ల కోసం ఏడుపాయల ఆలయ ఛైర్మన్‌ సాతెల్లి బాలాగౌడ్‌, ఈఓ సారా శ్రీనివాస్‌, ఆలయ పాలక మండలి సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఈ పాటికే చెలిమెలకుంట ప్రాంతంలో పార్కింగ్‌ కోసం నేలను చదును చేసే కార్యక్రమం కొనసాగుతుంది. అంతేకాకుండా కొల్చారం వైపు నుంచి వచ్చే భక్తుల కోసం నూతనంగా నిర్మించిన బ్రిడ్జీల వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఆలయం ముందు ప్రత్యేకమైన భారీకేడ్లు అలాగే పర్మనెంట్‌ వీఐపీల క్యూలైన్‌ కూడా ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అమ్మవారి ఆలయం ముందు మండపానికి రంగులు వేసి ముస్తాబు చేసి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ పాటికే ఏడుపాయల జాతరకు సంబంధించిన దుకాణాలు వెలిశాయి. భక్తులు స్నానం చేశాక బట్టలు మార్చుకోవడానికి సైతం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

నిండుకున్న చెక్‌డ్యామ్‌..
ఏడుపాయలకు వచ్చే భక్తులు ప్రత్యేక స్నానాలకు ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి నిండుకుండలా ఉన్న ఘనపూర్‌ ఆయకట్ట నుంచి చెక్‌డ్యామ్‌లోకి ఒక గేటును ఎత్తి కిందికి నీటిని వదిలారు. దీంతో చెక్‌డ్యామ్‌ నిండుకుంది. అయితే చెక్‌డ్యామ్‌ పొంగిపోర్లి దుర్గామాత ఆలయం ముందు నుండి క్రిందకు పారనుంది. దీంతో భక్తులు చెక్‌డ్యామ్‌తో పాటు మంజీరా నది పొడవునా స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా ఏడుపాయలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఛైర్మన్‌ సాతెల్లి బాలాగౌడ్‌, ఈఓ సార శ్రీనివాస్‌లు వెల్లడించారు. భక్తుల కోసం వైద్యాధికారిని అందుబాటులో ఉంచుతున్నట్లు డిఎంహెచ్‌ఓ చందునాయక్‌ తెలిపారు. శనివారం రోజున 108 అంబులెన్స్‌ సర్వీస్‌ను అందుబాటులో ఉంచినట్లు ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స నిర్వహించి మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

భారీగా తరలిరానున్న భక్తజనం..
ఏడుపాయల్లో మాఘ అమావాస్య పుణ్యస్నానాల కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తులు పుణ్యస్నానాలు అచరించేందుకు ఆలయ కమిటీ ఛైర్మన్‌ సాతెల్లి బాలాగౌడ్‌, ఆలయ ఈఓ సార శ్రీనివాస్‌ ప్రత్యేకంగా భక్తుల స్నానాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారికేడ్లను ఏర్పాట్లు చేసి క్యూలైన్‌లో దర్శనం కలిగించేందుకు చర్యలు చేపట్టారు. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement