Wednesday, May 1, 2024

అంతర్దర్శనం

ఆధ్యాత్మికం అంతా అర్ధమైపోయినట్లు ఉంటుంది. అర్ధమైపోతున్నట్టు అనిపి స్తుంది. అర్ధమైంది ఏంటని ప్రశ్నించుకుంటే, ఏం అర్థమైందో ఏమీ తెలి యదు. అంతా అయోమయం. ఓ పక్క అవగతమైనట్టు ఉంటూనే మరోపక్క ఆందోళన పరుస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికాన్ని అనుభవించగలిగితే, అనుభవంలోని కి తెచ్చుకోగలిగితే అద్భుతం అవుతుంది.
జీవుడు ఊగిసలాటని తప్పించుకోవటానికి, అస్థిత్వాన్ని సంపాదించుకోవ టానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని అధిరోహంచటానికి, అయోమయం నుంచి అద్భుతమైన స్థితికి చేరుకోవడానికీ, జ్ఞానమయం అవడానికీ జీవుడికి ఉపయోగప డది సాధన. సాధనతో ఆధ్యాత్మికాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అద్భుతాలను అనుభవించవచ్చు. మనీషిగా పరిణామం చెందవచ్చు.
ఉదాహరణకు ఒకటికి మరొకటి కలిస్తే ఎంత అని ఆలోచిస్తే, రెండయితే అది గణితం. అదే మూడయితే ఆధ్యాత్మికం. అదే రకంగా మూడు నుంచి ఒకటి తీస్తే రెండ యితే అది గణితం. మూడు నుంచి ఒకటి తీసేస్తే, ‘ఒకటే’ అయితే అది ఆధ్యాత్మికం.
అదెలాగో ఓసారి చూద్దాం. నువ్వు ఉన్నావు. నీకు తోడుగా నీకెదురుగా ఓ పెద్ద నిలువుటద్దం పెట్టేం అనుకుందాం. ఏవైంది? బింబంగా నువ్వు ఉన్నావు. నీకెదురుగా నిలువుటద్దం ఉంది. అద్దంలో నీ ప్రతిబింబంగా నువ్వు ఉన్నావు. మూడు అయింది కదా? అంటే ఒకటికి మరొకటి కలిస్తే మూడు. ఇదే ఆధ్యాత్మికం. ఇప్పుడు నీకు ఎదు రుగా ఉన్న నిలువుటద్దాన్ని అక్కడ నుంచి తీసేద్దాం. ఏవయ్యింది? అద్దం పోయింది. అద్దంలోని నీ ప్రతిబింబం పోయింది. నువ్వు ఒక్కడివే మిగిలేవు. అంటే మూడు లోంచి ఒకటి పోతే ”ఒకటే”! ఇక్కడే… ఇలాంటి స్థితిలోనే, అవస్థలోనే దాగుంది ఆధ్యా త్మిక సూక్ష్మమంతా! ఆధ్యాత్మిక రహస్యమంతా!!
అదొక ఆశ్రమ పాఠశాల. అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల ఒడిలో, సహజ అందాల గుడిలా ఉంటుందా పాఠశాల. అక్కడ మామూలు విద్యతోపాటు మానవతా విలువలు బోధిస్తారు. ఆధ్యాత్మిక విజ్ఞాన శోభ అక్కడ అడుగడుగునా పరిఢవిల్లుతుంది. భౌతిక విషయాల పరిజ్ఞానంతో పాటు, జీవన మాధుర్యాన్నీ, జీవిత మనో అంతరంగాన్ని బోధనల రూపంలో ఆవిష్కరిస్తారక్కడ. అంతరిక్ష విష యాలతో పాటు ఆత్మతత్వ రహస్యాలను కూడా అవగతమయ్యేట్టు చెబుతారక్కడ.
ఉపాధ్యాయుడు ఆ రోజు పాఠాన్ని అద్భుతంగా చెబుతున్నారు. జీవితంలో ఎదు రయ్యే చిన్నచిన్న ఘటనల్ని, జీవితాలలో జరిగిన చిన్నచిన్న సంఘటనలను జోడిం చి పాఠాన్ని వివరించటం ఆ ఉపాధ్యాయుని ప్రత్యేకత. అందుకే విద్యార్థులంతా ఆ ఉపాధ్యాయుని పాఠమంటే చెవులు కోసుకుంటారు.
మాస్టారు పాఠం చెప్పటం పూర్తి చేసారు. పిల్లల్ని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. ”నీ కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. ఏమైందిరా?” అని ఓ పిల్లాడిని ప్రశ్నించారు. ”నా కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయా?” అమా యకంగా అడిగాడు కుర్రాడు. మరో పిల్లాడిని ”నీ ముఖం మీద నల్లగా ఆ మసి ఏంటిరా?” అనడిగారు. ”ఏమో నాకు తెలీదండి. అయినా నా ముఖం నాకు కన్పించదు కదండి.” ఆ పిల్లాడి సమాధానం. మాస్టారు మరో పిల్లాడిని ”ఏదైనా తిన్న తర్వాత మూతిని శుభ్రం చేసుకోవాలని తెలీదా?” అని అడిగారు. ఏమైందో తెలీక తెల్లమొహం వేసాడా కుర్రాడు. పిల్లలందరినీ ముఖానికి సం బంధించిన ఎన్నో ప్రశ్నలు వేసారు. ఏ ఒక్కరూ సమాధానం సరిగ్గా చెప్పలేదు.
”ఈ రోజు మీకందరికీ ఏమైందిరా? ఏ ఒక్కరూ ఏ సమాధానం చెప్పలేక పోతున్నారు.” కొంచెం విసుగు, మరికొంచెం తెచ్చుకున్న కోపం మాస్టారి గొంతులో ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడు ఒక్కసారిగా పిల్లలందరూ మూ కుమ్మడిగా ముక్తకంఠంతో అన్నారు. ”సార్‌! మా తల గురించి, ముఖం గురిం చి, మూతి గురించి, వాటికి అంటుకున్న మసి, మాలిన్యం, అపరిశుభ్రతకి సంబంధించిన, మీరడుగుతున్న ప్రశ్నలకు మేం సమాధానాలు చెప్పలేక పోవ టానికి కారణం, అవి ఎలా ఉన్నాయో మాకు మేముగా చూసుకోలేక పోవ డమే!” అని అమాయకంగా అసలు విషయం బయటపెట్టా పిల్లలు. మాస్టారు కు కావాల్సింది అదే.
అప్పుడు తనతో తీసుకువచ్చిన సంచీలోంచి అరచెయ్యంత సైజుండే అద్దాలను తీసారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. పిల్లలంతా అద్దంలో తమ ముఖాలను చూసుకున్నారు. మాస్టారు చిరునవ్వు నవ్వుతున్నారు. పిల్లలు ఒక్కొక్కరు లేచి, అంతకు మునుపు మాస్టారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఖచ్చితంగా చెప్పారు. మాస్టారు సంతోషించారు.
”చూసారా? ఇందాక మీరెవ్వరూ నేనడిగిన ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడందరూ సమాధానం సరిగ్గా చెప్పారు. ఏంటి కారణం?” అని మాస్టారు ప్రశ్నించారు. ”ఈ అద్దం సార్‌. ఇందులో మా ముఖాలను మేము పూర్తి గా చూసుకున్నాం.” అని చెప్పారు పిల్లలంతా.
”అదే గమ్మత్తు. అక్కడే ఉంది అసలు రహస్యమంతా.” ముందు మీ ముఖమేం టో, ఆ ముఖం పరిస్థితి ఏంటో మీరు చూసుకోలేకపోయారు. తర్వాత అద్దం సహా యంతో మీ ముఖం ఎలా ఉందో అంతా తెలుసుకున్నారు. అంతేనా?” అన్నారు మాస్టారు. అవునని పిల్లలు సమాధానం యిచ్చేరు. అవును. మనం చూసుకోలేని, తెలు సుకోలేని, మన ముఖంలోని లోపాలను, మనకు తెలిసేలా, మనల్ని మనకు చూపిస్తుం ది ఆ అద్దం.
అదే రకంగా మనం అనుకునే ‘మనం’ ఎలా ఉంటామో, ఎలా ఉండాలో, మన రూపం ఏమిటో, మన స్వరూపం ఏమిటో, మన స్వభావం ఏమిటో మనకు తెలుసా? తెలీని స్థితి మనందరిది. అజ్ఞానం అనే మలినంలో ఎలా? ఎంతలా? కూరుకు పోయా మో, ‘నేను’, ‘నాది’ అనే మాయలో ఏరకంగా కొట్టుమిట్టాడుతున్నామో, మన అసలైన స్థితి ఏమిటో, మనకు తేటతెల్లం అవ్వాలి. మన స్వరూపం ఏమిటో మనం తెలుసు కోగలగాలి. అదెలా సాధ్యం? మనల్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసి, మన అంత: స్వరూపా న్ని, మన ఆత్మ స్వరూపాన్ని మనకు మనమే దర్శనం చేసుకునేలా, మనల్ని మనకు బహర్గతపరిచే, మన కళ్ళకు మనలను చూపించే ఓ దివ్య భవ్య అద్దమే గురు వు.
గురువు నీకు తెలీని ‘నిన్ను’ని నీకు కనబడేలా చేస్తాడు. కనబడేలా నిన్ను తయారుచేసి ‘నిన్ను’ నీకు చూపిస్తాడు గురువు. నీలో ఉన్న లోపాలు నీకు తెలిసేలా చేస్తాడు. నిన్ను శుద్ధం చేస్తాడు. కాంతిమయం చేస్తాడు. నువ్వు శాంతిమయం అయ్యే లా చూస్తాడు.” అంటూ అసలు విషయాన్ని విపులంగా వివరించారు మాస్టారు. పిల్లలందరూ ఆనందించారు.
నువ్వు అన్ని స్థితుల్ని దాటగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, సాధనాలను నీకు అందిస్తాడు గురువు. వాటన్నింటినీ నువ్వు అందుకునేలా నిన్ను తయారుచేస్తాడు. జ్ఞానాగ్నిలో నిన్ను దగ్ధం చేస్తాడు. పరిశుద్ధం చేస్తాడు. నిన్ను పరిపూర్ణుణ్ణి చేస్తాడు. నీకుపరిపూర్ణతను తీసుకొ స్తాడు. ఆధ్యాత్మికం నీకు అద్భుతాల మయమయ్యేందుకు గురువు దోహదపడతాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement