Thursday, May 16, 2024

4న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం


తిరుమల, ప్రభన్యూస్‌: దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్‌ 4వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఏటా ఆశ్వీయుజవాసం అమావాస్య (దీపావళి) నాడు స్వామివారికి సుప్రభాతం మొదలుకుని మొదటి గంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. అందులో భాగంగా మలయప్పస్వామి దేవేరులతో కలసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారుకు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారిని స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకార సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడవీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
అర్జిత సేవలు రద్దు..
దీపావళి ఆస్థానం కారణంగా నవంబర్‌ 4న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వర్చువల్‌ అర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement