Monday, May 6, 2024

సత్క్రియలే ధర్మరూపం

మహనీయము, విపులార్థము, మానవులకు అభ్యు దయ ము, నిశ్శ్రేయసములను చేకూర్చేది ధర్మం ఒక్కటే. ఈ ధర్మము సదాచరణ రూపంలో వుంటుంది. పాణిని మహర్షి తాను ప్రవ చించిన సూత్రములలో ‘ధర్మ:’ అనే సూత్రము ద్వారా ధర్మ శబ్ద రూపాన్ని తెలిపాడు. ధృఞ, ధారణీ అను ధాతువు నుండి ఇది ఏర్పడినదనీ, ఇదే సమస్త విశ్వంను నిలకడగాను ఉంచునది అను అర్థము వాచ్యమై, ఆధారంగా ఉండునన సూచించాడు. ఇది వేద సమ్మతమని యజుర్వేద మంత్రం ఇలా తెలిపింది.
వేదోఖిలం ధర్మ మూలం – ధర్మో విశ్వస్య జగత: ప్రతిష్ఠా
లోకే ధర్మిష్ఠం ప్రజా ఉప సర్పంతి ధర్మేణ పాపమపనుదతి
ధర్మే సర్వం ప్రతి ష్ఠితమ్‌ – తస్మాద్ధర్మం పరమం వదంతి
వేదోక్తములైన ధర్మాలను ఆధారం చేసుకుని, భారత, రామాయణాది గ్రంథాలలో వ్యాస, వాల్మీకి మహర్షులు ఉపదేశించిన వాక్యాలు కూడా ధర్మ స్వరూపాలే. అయితే వీటి వలన కూడ ధర్మ స్వరూపం తెలియదు. దీనిని తెలుసుకొనుటకు ఏ ప్రమాణాలు, ఏ వాదం కూడా పనికి రావని ఆర్యోక్తి.
శబ్ద ప్రమాణమైన వేదం ద్వారా దాని అర్థ బోధకములైన స్మృతిపురాణతి హాసాదుల ద్వారానే తెలుసుకోవాలన్నారు పెద్దలు.
వేద శబ్దానికి తెలియజేయునదని అర్థం. వేదయతీతి వేద: అని వ్యుత్పత్తి.
మన భారత దేశం కర్మ భూమి, ధర్మ భూమి. యుగ దైవాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ధర్మం విలువను తెలియజేయ డానికే ఈ లోకంలో అవతరించారు. ధర్మా న్ని నీవు రక్షించు. అది నిన్ను రక్షిస్తుందన్న సత్యం భారతావనిలో ఒక మహనీయ సూక్తిగా స్థిరపడినది.
ధర్మో రక్షతి రక్షిత:
ధర్మ మార్గం తప్పిన మానవుడెంత గొప్ప వాడైనా పతనం తప్పదని ఇతిహాసాలు పురాణాలు తెలిపాయి. విద్యారణ్య స్వామి వారు కూడా తమ యజుర్వేద భాష్యంలో వేద స్వరూపమే ధర్మమని ప్రవచించారు. ధర్మ విరుద్ధములైన అర్థకామములు కూడా వేద రూపములే. ఈ విషయాన్ని వేద వ్యాసుల వారు భారతం శాంతిపర్వంలో వివరించారు. యశ్చ వేద: సవైధర్మో యశ్చధర్మ: సత్పధ: అన్నారు.
ధర్మము అస లు రూపం ఫలప్రదమైన సత్‌క్రియాచరణం. సత్ఫలమును ఆశించి ఒక పనిని ఆచరించుటయే ధర్మమని వేద స్మృతి ఇతిహాసాదులే తెలిపాయి. ఇదే గొప్ప సంస్కారం.
వేదం చెప్పిన
మరో ఉదాహరణ.
సత్యం వద, ధర్మం చర- అహింస్యాత్‌ సర్వ భూతాని అంటూ చేయదగిన కర్మలను, చేయకూడని పనులను, చెప్పే వేద వాక్యాచరణమే ధర్మమనీ, తద్విరుద్ధాచరణమే అధర్మమని గ్రహించాలి.
శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆచార ప్రభవో ధర్మ: అంటూ వ్యాస భగవానుడు సుహృత్‌ సహితంగా మహా భారతంలో పలు కథలు, ఉపాఖ్యానములు వ్రాసి ధర్మబోధ గావించాడు. ధర్మమును విడిచి అర్థ కామములను సాధింప కూడదన్నాడు. చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షములలో ధర్మానికే ప్రథమస్థానం ఇచ్చి పెద్ద పీట వేశారు. భారతం అనుశాసనిక పర్వంలో
ఆచార లక్షణో ధర్మ: సంతశ్చాచార లక్షణా:
సాధూ నాంచ యథా వృత్తమే తథాచార లక్షణ ం
అంటూ ఒక వ్యక్తి ధర్మాత్ముడనుటకు అతని నడవడియే గుర్తు. సత్పురుషులంటే ఆచార స్వరూపం. వాటిని మనం అనుసరించుటయే మన ధర్మాభిరతికి నిదర్శనం.
చతుర్విధ పురుషార్థాలలో ధర్మబద్ధమైన ఏ ఒక్క దానియందైనా ఆసక్తి గల నడవడిక కలిగి ఉండాలి. ప్రతి మానవుడు ధర్మబద్ధమైన నడవడిక లేని వాని జీవితం వ్యర్థం అని శాస్త్ర వచనం.
ఒక వ్యక్తి మరో వ్యక్తి విషయంలో ఏ విధంగా అంటే ధర్మమార్గంలో కానీ, అధర్మ మార్గంలో కానీ ప్రవర్తించినా అట్టివానిని ఎదుర్కొనటంలో తను అనుసరించిన మార్గంలోనే ప్రవర్తించిన వాడు అధర్మమును పొందడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మానవుడు తాను మాత్రం సదా ధర్మపరుడుగానే ఉండాలని మనుస్మృతి తెలిపింది.
సర్వేషాం యస్సుహృన్నిత్యం
సర్వేషాంచహితేరత:
కర్మణా మనసా వాచా
సధర్మం వేద ఔజలే
అంటూ ఒక వ్యక్తి తాను చేసే పనుల ద్వారా కాని, తన మాటల చేత గాని, తనమనస్సులో గాని, ఇతరుల యందు స్నహమునే కలిగి యుంటూ ఇతరులకు మేలు కలిగించుటయందే శ్రద్ధ వహిస్తూ జీవితమును గడుపుతాడో అతడే నిజంగా ధర్మాత్ముడు. అతడే ధర్మ స్వరూపమును కలిగిన వ్యక్తి సుమా అన్నారు.
మనువు తన ధర్మ శాస్త్రంలో ఇలా తెలిపాడు. ప్రపంచ మానవులు భారతీయ ధర్మ వేత్తల నుండి ధర్మ స్వరూపమును తెలిసికొని తమ తమ నడవడిని చక్కదిద్దుకోదాలి అని ఉపదేశించాడు. గృహస్థుడు పుత్రోత్పత్తి, భార్యా పుత్ర పోషణ, మాతా పితృసేవ, అతిథి సత్కార- ధర్మ క్రియా చరణములలో ధర్మ శాస్త్రం బోధించిన విధివిధానాలను, నిషేధాలనూ ఆచారంతో పాటిస్తే ధర్మాత్ముడౌతాడని మహా భారతం తెలిపిన సందేశం.
మానవులు ధర్మ స్వరూపమును గుర్తించి తన జీవితంలో అలాంటి ప్రవర్తనములలవరచుకుంటే ధర్మాత్ముడై సహజశాంతి భద్రములకు దోహదం చేసిన వాడౌతాడు. ధర్మం కురు అంటే ధర్మం చేయి అంటుంది శాస్త్రం.
ఆచార్య చాణక్యుడు సుఖస్యమూలం ధర్మ: ధర్మ స్యమూలం అర్ధం. అర్ధ స్యమూలం రాజ్య: అని అర్థశాస్త్రంలో తెలిపాడు. మానవుల సుఖానికి మూలం ధర్మమని తెలుపుట సమాజ సౌభాగ్యం కోసమే భర్తృహరి తన నీతి ప్రవచనంలో హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం శ్రొతస్య భూషణం శాస్త్రం అంటూ చెవికి ధర్మ వచనములే ఆభరణములని, ఇవే సహజమైన, శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు. మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణాలే లేకుంటే మానవ జన్మ వ్యర్థమని సందేశం ఇచ్చాడు. ధర్మ నిర్వచనం అంత సులువు కాదు. మహాభారత నీతి సకల జగతికీ ఆచరింపదగిన సత్యం.
బరులేయవి యొనరించిన నరవరయప్రియము
తన మనంబునకగు దా
నొరులకులకు అవి సేయకునికి పరాయణము
పరమ ధర్మ పథముల కెల్లన్‌
ఇతరులు నీకు చేసిన అప కారం వలన బాధ కలిగితే అలాం టివి నీవు ఇతరులకు చేయకుండా వుండడమే పరమ ధర్మ మార్గ మనీ, ప్రతి మానవుడూ దీనిని ఆచరించి తరించాలని వ్యాసుని దివ్య సందేశం. భారతీ య జీవన విధానానికి ఈ పద్యమే ఆలం బన. ధర్మ మూలం ఇదం జగత్‌. ధర్మమే జగతికి రక్ష.

పి.వి. సీతారామమూర్తి
94903 86015

Advertisement

తాజా వార్తలు

Advertisement