Tuesday, May 7, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

59. గతి నీవంచు భజించు వార లపవర్గంబొందగా, నేల సం
తతముంగూటికినైచరింప? వినలేదాయాయురన్నంప్రయ
చ్ఛతియంచున్మొఱవెట్టగాశ్రుతులు? సంసారాంధకారాభిదూ
షిత దుర్మార్గులు గాన గాన బడవోశ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, నీవు – నీవే, గతి – అంచున్ – గతి యని, భజించువారలు – సేవించే వారు, అపవర్గంబు – ఒందగాన్ – మోక్షము పొందుతూ ఉండగా, సంతతమున్ – ఎల్లప్పుడు, కూటికిన్ – ఐ – తిండి కోసం, చరింపన్ – ఏల? – తిరగటం ఎందుకు? ఆయుః – ఆయుర్దాయమే, అన్నం – ఆహారాన్ని, ప్రయచ్ఛతి – ఇస్తుంది, అంచున్ – అంటూ, శ్రుతులు – వేదాలు, మొఱ – పెట్టగాన్ – ఘోషిస్తూ ఉంటే, వినలేదు – ఆ – వినపడ లేదా?, (లేక) సంసార – అంధకార – సంసారం అనే చీకటి వల్ల (చీకటిలో ఉండటం వల్ల) అభిదూషిత – బాగా నిందించ తగిన, దుర్మార్గులు – చెడుదారిలోనడచేవారు, కానన్ – అవటం వల్ల, కానన్ – పడవు – ఓ – కనపడలేదా? (ఆ వాక్యాల అర్థం తెలియ లేదా?)

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! నీవే గతి యని నిన్ను సేవించే వారు మోక్షాన్ని పొందుతూ ఉంటే, కొంతమంది అహర్నిశలు తిండికోసం పాట్లుపడుతూ తిరుగుతూ ఉంటారు. ఎందుకో? వారు “ఆయుర్దాయమే అన్న పెడుతుంది” అనే వేదవాక్యంవినలేదేమో? ఒకవేళ విన్నా, సంసారం అనే చీకటిలో ఉండటం చేత నిందార్హమైనచెడుదారుల్లో నడిచే వారై ఆ వాక్యాల అర్థాన్ని తెలుసుకోలేక పోయారేమో?

విశేషం:
తిండి కోసం పాట్లు పాద వలసిన అవసరం జీవులకి లేదు. “నారు అనే పోసినవాడే నీరు పోస్తాడు”, “ఆయువే అన్నాన్ని ఇస్తుంది” అనే వేదవాక్యాలనిదుర్మార్గులయిన వారు విననయినా విని ఉండరు. విన్నాఅర్థం చేసుకొని ఉండరుఅని అన్నానికై తాపత్రయ పడే వారిని చూసి జాలి పడ్డాడు ధూర్జటి.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement