Wednesday, May 15, 2024

మహిమాన్వితాలు… పంచ పర్వాలు

కార్తీకమాసం అన్ని మాసము లలో, అత్యంత పవిత్ర మైనదిగా భావించ బడు తున్నది. ‘న కార్తీక సమో మాస:’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్ధం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, ఆధ్యా త్మిక అంశాల శ్రవణం, దీపారాధనం, దీప దానం, తులసి మాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వన భోజనం మున్నగునవి. కాగా వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం.
జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది.. ”చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం”.
అంబాదులా నితంతీ చ, అభ్రయంతి తథైవ చ, వర్షయంతి చపుణికా, షడ్‌ ఏతే కృత్తికా స్మృతా…అంబా, దులా, నితంతీ, అభ్రయంతీ, వర్షయంతీ, చపూణికా అనే పేర్లతో పిలవబడే షట్కృత్తికలు కార్తీక మాసమునకు అధిపతులు.
కృత్తికా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము, అగ్ని స్వరూపము. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియములుగా చెప్పబడ్డాయి. ‘నక్షత్రం దేవమింద్రియం అని శృతి వచనం. వాటిలో అతిముఖ్యమైన తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తికా. అట్టి కృత్తికా నక్షృత్రముతో కూడిన పౌర్ణిమాస్య కలిగిన ఈ మాసము కార్తీక మాసముగా, విశేష పుణ్య ఫలదముగా చెప్పబడింది. చాంద్ర మాన రీత్యా ఎనిమిదవ మాసమైన కార్తీకమునకు ఒక విశేష స్థానము కలదు. శరదృతువు ఉత్తర భాగము లో వచ్చే కార్తీక మాసము నెల రోజులు పర్వదినాలుగానే భావిస్తారు.
ప్రత్యేకించి కార్తీక శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ”పంచ పర్వా లుగా” భావించ బడతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి- ఉత్థాన ఏకాదశి ప్రత్యేకత ననుసరించి, ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడు చున్నవి. మహా విష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండి, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందును కావున, దీనిని ”ఉత్థాన ఏకాదశి” అని కూడా పిలుస్తారు. పీఠాధిపతులు, యతీశ్వరులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆహార నియమాలతో చేయడం జరుగుతున్నది.
ఇలా ఐదు దినాలను పంచ పర్వాలుగా ఆచరించడం సనాతన సాంప్రదాయాచారం. దేవాలయా లలో మూల విరాట్టుల అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్య గల ఉసిరిక వక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షిణలు ఆచరించి, ఉసిరికలను దానం చేసుకుని కార్తీక దామోదరు నికి ప్రత్యేక పూజలొనరి స్తారు. మంగళ స్నానాలా చరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపా లను వదిలి పెడతారు.

– రామకిష్టయ్య
సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement