Thursday, May 9, 2024

పరమాత్మే నిత్య వస్తువు!

కలియుగంలో మానవుల జీవన విధానాలలో ప్రతి జీవికి జననం- మరణం- ¸°వనం- ముదుసలితనం- సుఖ సంతోషాలు- ధనాశ- ప్రశమ సుఖం- మిటారుల వలపుల వలలు సద్గుణ ములు- మాత్సర్యంతో నిండిన కూళలు వన ప్రదేశము లను ఘాతుక జంతువులు, రాజులను దుర్జనులు, ఐశ్వర్యములను నిలకడ లేమి చెరచి వేస్తున్నాయి. అందుకని నిత్య వస్తువైన పరమేశ్వరునందే మనస్సు లగ్నం చేయాలని, నీతి శతకకారుడైన భర్తృహరి కవి ఈ విషయాలను సమాజ శ్రేయస్సుకు వైరాగ్య ప్రకరణం ద్వారా వివరించారు. అది దివ్యోపదేశం. ఒక శ్లోకం ద్వారా ఇలా తెలియజేశారు.
శ్లో|| ఆక్రాంతం మరణన జన్మ- జరసాచాత్యుజ్జ్వలం యవ్వనమ్‌
సంతోషోధన లిప్సయా- శమ సుఖం – ప్రౌఢాంగనా విభ్రమై:
లోకైర్మత్సరి భిర్గుణా- వన భువో వ్యాళై: నృపాదుర్జనై:
అస్థైర్యేణ విభూతయో: – అప్యుపహతాగ్రస్తం నకిం కేనవా!!
ఈ శ్లోకంలో మానవుడు జన్మించినది మొదలు మరణించే వరకు, తన యింద్రియ చాపల్యముల ద్వారా, పలు రకాలుగా ఆనందం సుఖభోగాలను అనుభవించి, యవ్వన భ్రమలలో మునిగి చివరకు ముసలితనం రాగానే విలపిస్తూ వుంటాడు. పలు కష్టాలు పడతాడు. ఆ జీవికి దైవ భావన- చింతనలుండవు. దైవ మాయలో చిక్కి పలు కష్టాలను అనుభవిస్తూ వుంటాడు. ఇవన్నీ అస్థిర పదార్థాలని నమ్మక, పరమార్థ వస్తువైన పరమాత్మను తెలుసుకోలేక సతమతమవుతున్నాడు. ఇదే కలి మాయ. ఈ విషయాలనే నమ్మిక దృఢ పడుటకై ఒక పద్యం ద్వారా కూడ భర్తృహరి వివరించాడు. జీవుల మనస్తత్వం ఇందులో పొందుపరిచాడు. ఒక రకంగా హెచ్చరికలందించాడు. వైరాగ్య జీవనం దైవ మందు మనస్సు లగ్నం కావాలనీ వివరించాడు.
చం|| జననము చావు చేత- శమ సౌఖ్యము కాంతల లీలల చేత, జ
వ్వనము జరార్తి చేత- గుణ వర్గము- కూళల చేత- రాజు, దు
ర్జనుములచే – ముదంబు ధనరాగముచే- సిరులెల్ల లేమిచే విని
హతి జెందు- దోష పరి విద్దము గాదె- తలంప నెద్దియున్‌||
అంటూ దివ్య సందేశాన్ని అందించాడు.
మనోవ్యధలు, వ్యాధుల వల్ల ఆరోగ్యం పాడవుతున్నది. సంపద లెక్కడుంటే అక్కడ ఆపదలు తిష్ట వేసుకుని ఉంటాయి. మాయదారి మృత్యువు ప్రాణులను తన పొట్టన పెట్టుకుంటుంది. అడ్డూ అదుపూ లేని ఆ దైవముచే సుస్థిరమని చెప్పేవిధంగా నిర్మితమైనది ఏది వుంది? అన్నిటియందు వైరాగ్యం పొందడం అనేది శాశ్వత సుఖాన్నిస్తుంది.
బ్రహ్మ చేత ఏది సుస్థిరంగా సృజింపబడినదో అది ఏదై ఉంటుంది? అంటే ఏదీ లేదనటమే విశ్వాసం. ఏ విషయంలోనైనా విచ్చలవిడితనం పనికిరాదన్నాడు. యవ్వన సౌఖ్యములు మూడునాళ్ళ ముచ్చటలే. ఈ సంసారాన్ని నిస్సారంగా గ్రహించమన్నాడు.
భోగాలు ఎత్తయిన తరంగాల్లా క్షణంలో చితికిపోతాయి. ప్రాణం విషయంలో ఏ క్షణంలో ఉంటుందో, ఏ క్షణంలో పోతుందో ఎవరూ చెప్పలేరు. పరమాత్మ గీతలో ”జాత స్యహి ధృవో మృత్యు:- ధృవం జన్మ మృతస్యచ” అన్నారు.
ప్రియురాళ్ళతో అనుభవించే యవ్వన సౌఖ్యాలు వృధా అన్నాడు. ఇలా కలి జనులకు హితబోధ చేశాడు కవి. సుఖాలనేవి కొన్ని రోజులే వుంటాయి. అందుకే సకల జనులూ మనసారా సద్భావనతో వుండాలి.
మానవ జీవితాలు గాలికి రెపరెపలాడుతూ మీరాకు మీది నీటి బిందువుల వలె నిలిచేవి కావు. పడుచుతనపు కోరికలు స్థిరములు గావు. జనులెల్లరూ సంసారాభిలాష వదిలి మన స్సులను సమాధి యోగంలో వుంచాలన్నాడు. పరమాత్మ యోగమందు బుద్ధిని నిలప మన్నాడు. జనుల ఆయువు చంచలమైనది. భవసాగర తరణమునకు బ్రహ్మ చింతన ఒక్కటే మార్గం. దాన్ని వదలక నిరంతరం స్మరిస్తూ, సజ్జనుల సరసన చేరి జీవితాలను ధన్యం చేసుకోమని సందేశమిచ్చాడు. బ్రహ్మ జ్ఞానం కం టే మరొక తరుణోపాయం లేదన్నాడు.
మానవులు ఆశాపాశాలు తెంచుకుని మనస్సును పరబ్రహ్మయందు నిలుపమని భర్తృహరి చెబుతున్నాడు. బ్రహ్మానందానుభవంలో మునిగి వుండమన్నాడు. అది ఎంతో దివ్యానుభవమన్నాడు. అనంత కేవలానందము అని వివరిస్తూ ఇలా తెలిపాడు.
ఉ|| ఎందు వసించి ధన్యుడు- విధీంద్ర ముఖామర కోటినెల్ల- నెం
చందృణమట్ల- దేని జవి జూచుటచే- రసహీన భావముం
జెందు జగత్‌ ప్రభుత్వము జెప్పగరాని- యనంత కేవలా
నందము- దాని యందు మదినాటుము- మాను మునీచ భోగముల్‌||
అంటూ హెచ్చరిస్తూ ఏమి చేయాలో పరిష్కార మార్గం వైరాగ్యమనీ, బ్రహ్మ చింతన మనీ సందేశమందించాడు జగతికి భర్తృహరి.
వైరాగ్యం సాధించి జీవ బ్రహ్మైక్యాను సంధానం చేయవలసినదిగా కోరుట మానవుల జీవితం ధన్యమగుటకే కదా! దీన్ని అందరూ గ్రహించి, ఆశయాలతోగాక ఆచరణలో చూపిన రోజు మన జీవితాలు బ్రహ్మ చింతనలో నిలిచి వుంటాయనడంలో అతిశయం లేదు.
ఇదే యధార్థము. సత్యం. నిత్యం అలరారే భావజాలం.
నిత్య వస్తువు పరమాత్మే కదా!

– పివి సీతారామ మూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement