Saturday, April 27, 2024

ధర్మం – మర్మం : మహాలక్ష్మీ దేవి

మహాలక్ష్మీ అవతార అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

త్రిమూర్తుల శక్తిని ఇతిహాసపురాణాలు మూడు విధాలుగా అభివర్ణిస్తున్నాయి. వాటి ఆధారంగా శ్రీమహావిష్ణువుకు ఉండే శక్తిని మహాలక్ష్మిగాను, శంకరునిలోని శక్తిని మహాకాళిగా, బ్రహ్మలోని శక్తిని మహాసరస్వతిగా వ్యవహరిస్తున్నాము. శ్రీమహావిష్ణువు రక్షించువాడు, రుద్రుడు సంహరించువాడు, బ్రహ్మ సృష్టించువాడు. పరమాత్మ ఎలాగైతే ఒక్కడో అలాగే పరమాత్మలో ఉండే శక్తి కూడా ఒక్కటే. గుణాలను, పనులను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఈ మూడు శక్తులలో విశిష్టమైనది విష్ణుశక్తే.

ఏకదేశస్థితస్యాగ్నే: జ్యోత్స్నా విస్తారిణీ యథా
పరస్య బ్రహ్మణోశక్తి: తథేదమఖిలం జగత్‌ ||

ఒక ప్రదేశంలో ఉన్న అగ్ని ప్రకాశం చాలా దూరం వరకు ప్రసరిస్తున్నట్టే పరమాత్మ శక్తి సకల ప్రపంచంలో వ్యాపించి ఉండునని ఈ శ్లోక భావం. ఇలా పరమాత్మకు ఉండే అనంత శక్తులలో ఒకటైన అహంతాశక్తియే ‘మహాల క్ష్మి’గా వ్యవహరించబడుతుంది.

తస్య యా పరమా శక్తి: జ్యోత్స్యే వ హిమ దీధతే:
సర్వావస్థాగతా దేవీ స్వాత్మభూతానపాయినీ
అహన్తా బ్రహ్మణస్తస్య సాహమస్మి సనాతనీ

- Advertisement -

అని లక్ష్మీతంత్రములో ఇంద్రునికి, చంద్రునికి వెన్నెల వలె తాను ఆ శ్రీమన్నారాయణునికి పరమశక్తినని, సకలావస్థలలో విడిచి ఉండని దానినని లక్ష్మీదేవి పేర్కొంది. తానే అహంతాశక్తినని, సనాతన శక్తినని ఈ శక్తియే నారాయణి అని కూడా తెలిపింది.

నిత్యనిర్దోషనిస్సీమ కల్యాణగుణశాలినీ
అహం నారాయణీ నామ సాసత్తా వైష్ణవీమాతా

ఈవిధంగా నారాయణుని శక్తియే నారాయణిగాను, వైష్ణవిగాను, మహాలక్ష్మిగాను వ్యవహరించబడుతుంది. ఈ మహాలక్ష్మి స్వయంగా పరమాత్మకు విశేషణమై, ధర్మమై అనేక గుణములు, ధర్మములు శక్తి శక్తిమలు కలదని గ్రహించాలి. విష్ణుశక్తిగా చెప్పబడిన అహంతా శక్తియే ఆదిలక్ష్మి, అందులోనివే ఆ పరాశక్తి, విద్యాశక్తి అని స్పష్టపరచబడింది.

పరమాత్మగా చెప్పబడే శ్రీమన్నారాయణునికి అన్నివేళలా అన్ని కార్యాలను సమకూర్చేది శక్తే. ఈ జగత్తునంతా ఆమె లక్షిస్తుంది. అనగా చూస్తుంది, కటాక్షిస్తుంది, లక్ష్యంగా చేసుకుంటుంది కావున లక్ష్మీ అయింది. శ్రీమహావిష్ణువు యొక్క భావమును ఆశ్రయిస్తుంది కావున ‘శ్రీ’ అని వ్యవహరిస్తారు. అందరికీ కోరికలను తీరుస్తుంది కావున ‘కమల’ అయింది. అలాగే పద్మ, పద్మమాలిని అని కూడా లక్ష్మీని వ్యవహారిస్తారు. పరమాత్మ సృష్టిలో ఉన్న తారతమ్యములకు అమ్మవారి కనుబొమల కదలికే కారణం. కనుబొమలు ఎగురవేసినట్లయితే దేవతలుగాను, తక్కువుగా ఎగురవేస్తే మానవులగాను, కిందకి చేసినట్లయితే దానవులగాను, అసలు కదల్చుకుంటే పశువులుగాను పరమాత్మ సృష్టిస్తాడు. స్వామి రక్షణలో అమ్మ పురుషకార రూపంగా, సంహారంలో మహాకాళిగా సహకరిస్తుంది. పరమాత్మ మోక్షం ఇచ్చునట్లు చేసేది పురుషకారరూపం. జీవుల కర్మలను లక్ష్యంగా చేసుకొని సృష్టికార్యంలో సహకరిస్తుంది కావున ఆమ్మను శ్రీమహాలక్ష్మిగా, రక్షణలో శ్రీదేవిగా పేర్కొనబడుతుంది. అమ్మ దయ లేనిదే స్వామి అనుగ్రహం పొందలేము. అమ్మవారి చూపులు, స్పర్శ అమృతం చిలకరిస్తాయి కావున లక్ష్మీదేవిని అమృతదృక్‌, అమృతా అని కూడా వ్యవహరిస్తారు.

మహాలక్ష్మి దేవికి ఇష్టమైన నైవేద్యం లడ్డూలు, చక్కిలాలు, అరిసెలు, కజ్జికాయలు.

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement