Monday, May 20, 2024

ధర్మం – మర్మం : ఋషి హృదయం, శ్రీహరి అవతార వైభవము-101 (ఆడియోతో)…

భాగవతం ప్రథమ స్కంధం, నాల్గవ అధ్యాయంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భగవంతుని కథ…

న యద్వచ: చిత్ర పదం హరేర్యశ: జగత్పవి త్రం ప్రగృణీత కర్హిచిత్‌
తద్వాయసం తీర్థం ఉశంతి మానసా: న యత్ర హంసా: నిరమంతి ఉశిక్‌ క్షయా:

చిత్ర విచిత్రమైన పదములు, శబ్దాలంకారములు అర్థాలంకారములు, గుణములు, రీతులు, వృత్తులు, శృంగారాది రసములు, కావ్య బంధములు, చమత్కార భణుతులు (పలుకులు) ఎన్ని ఉన్ననూ సకల జగముల ను పవిత్రము చేసే శ్రీహరి కీర్తిని చెప్పనివాడు ఆ కావ్యము కాకులు స్నానము చేయు తీర్థమే (గుంటయే) అవుతుంది.

మానస సరోవరంలో విహరించు మలినమును తొలగించే హంసలు అందులో స్నానం చేయవు. గుంటలు అనగా వర్షము పడినప్పుడు ఏర్పడే చిన్న చిన్న గోతులలో కాకులు స్నానం చేస్తాయి. కాకి స్నానం అంటే తన శరీరాన్ని మొత్తం ఒకేసారి ముంచలేదు. మునిగే నీళ్ళు ఆ గుంటలో ఉండవు. దోసెడు నీళ్ళల్లో కాకి శరీరం మునుగదు కావున ఒక పక్కకు ఒరిగి ఒక రెక్కను రెండో పక్కకి ఒరిగి రెండో రెక్కను వెనకకు వంగి తోకను, ముందుకు వంగి తలను ముంచి స్నానం అయింది అనుకుంటుంది. అంత చేసినా శరీరం మొత్తం తడవదు. అందుకే ఇప్పటికీ ఒళ్ళు తడవకుండా స్నానం చేసిన వారిని కాకి స్నానం చేశారని అంటారు. కాకి స్నానం చేస్తుండగా చూడరాదని కూడా శాస్త్రం. ఇలా కాకి స్నానం చేసే మడుగులో అతి విశాలమైన మానస సరోవరంలో స్నానం చేసే హంసలు మునుగుతాయా.? కాలుష్యాన్ని దూరం చేసేవి హంసలు, కాలుష్యాన్ని అంటించుకొనేవి కాకులు. మురికి అంటించుకొనే గుంటలో మురికి పోగొట్టే హంసలు స్నానం చేయనట్లే భగవంతుని ప్రస్తావన లేని ఎంతటి కావ్యమైనా భగవద్భక్తులకు రుచించదు అనేది ఇందులోని ఋషి హృదయం.

- Advertisement -

– శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement