Monday, April 29, 2024

గృహస్థులకు పరమహంస బోధన

యోగులకు నెలవైన ఈ కర్మభూమిలో శ్రీ రామకృష్ణ పరమ హంస ఒక మణిపూస. నిరంతరం ఆత్మానుభూతితో ఆయన చేసిన బోధనలు సదా అనుసరణీయమైనవి. సాక్షా త్తు శ్రీ కాళీమాతతో సంభాషించిన అనన్య భక్తాగ్రేసరులు. భగవద్ద ర్శన భాగ్యం కలిగించి నరేంద్రుణ్ణి స్వామి వివేకానందగా జగతికి అందించిన పరమ గురువు. మానవ సేవయే మాధవ సేవగా రామ కృష్ణ మిషన్‌ అందించే నిష్కామ సేవలు లోక విదితము. గృహస్థు లకు అందించిన వారి బోధనలు గొప్ప మార్గదర్శకాలు.
గృహస్థులు తప్పనిసరిగా ఆధ్యాత్మిక సాధన చేయాలి. వారు కర్మ త్యాగం చేయకూడదు. పూజ, జపం, ధ్యానం, సంధ్యావంద నం, తీర్థయాత్రలు ఇత్యాది నైమిత్తిక కర్మలు చేయాలి. ఏ వ్యక్తి లోనైనా నాట్యం, సంగీతం, చిత్రలేఖనం, గానం, కవిత్వం మొదలై న నైపుణ్యాలు ఉంటే అతనిలో భగవత్‌ శక్తి ప్రత్యేకంగా ఉందని గ్రహించాలి. వారిలో భగవంతుడు నిత్య చైతన్యమై ఉంటాడు.
అహంకారం, మితిమీరిన అభిమానం కలవారు ఆధ్యాత్మిక సాధకులు కాలేరు. మతములనేవి భగవంతుణ్ణి చేరడానికి వివిధ మార్గాలు. వాటిలోని లోటుపాట్లను గ్రహించి సత్యపథంలో సాధన చేసేవారు భగవంతున్ని చేరుకుంటారు. ఆయన పట్ల వ్యాకులత, ప్రేమ, ఏకాగ్రత ముఖ్యం. అంతరంగంలోనున్న జ్ఞాన జ్యోతిని తెలుసుకోవడానికి అంకుఠిత సాధన అవసరం.
గాలివానలో పడవ నడిపేవాడు చుక్కానిని గట్టిగా పట్టుకోవా లి. సుడిగుండాలు, ప్రవాహం పడవను ప్రమాదానికి గురి చేస్తా యి. చుక్కానిపై చాలాబలం వినియోగించాల్సిన అవసరం ఉం టుంది. గాలివాన తగ్గాక చుక్కాని తనంతట తానే సులభంగా దారి చూపుతుంది. నావికుడు చుక్కాని మీద అలవోకగా చేయివేసి నిశ్చిం తగా ప్రయాణం చేయవచ్చు. అలాగే సంసారయానంలో ఆశలు, అడియాశలనే ఎన్నో సుడిగుండాలు, గాలి వానలు వస్తుంటాయి. ఆ సమయంలోనే మనోధైర్యంతో దైవమనే చుక్కానిని గట్టిగా పట్టు కుని జీవన నౌకను దాటించాలి.
యోగుల మనస్సు సదా ఆ భగవంతుని మీదే లగ్నమై ఉంటుంది. గుడ్లు పొదిగే పక్షి అరమోడ్పు కన్నులతో పరధ్యానంగా ఉన్నట్లుంటుంది. కానీ పక్షి మనసు మాత్రం గుడ్లపైనే ఉంటుంది. అలాగే యోగుల హృదయం ఆత్మయందు లగ్నమై ఉంటుంది.
గృహస్థులు ధార్మిక జీవనాన్ని అలవర్చుకోవాలి. అధికంగా ధనం సంపాదించు, కానీ అది సరైన మార్గంలోనే ఉండాలి.
ఇతరులను క్షోభకు గురిచేయకూడదు. ధన సంపాదన ఒక్కటే లక్ష్యం కాకూడదు. భగవంతుని సేవించడానికి సంపాదించే ధనం లో దోషముండదు. కూడు, గుడ్డలకు సరిపోయేంత ధనం సంపా దించుకుంటే చాలు. పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడ్డ తరువాత వాళ్ళ భారాన్ని వహించాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఆహారం సేకరించడం నేర్పిన పక్షి తిరిగి ఆహారం కోసం దగ్గరకు వచ్చిన పిల్లలను ముక్కుతో పొడిచి వెళ్ళగొడుతుంది. కోడలు గర్భవతి అయితే అత్తగారు ఆమె పనిని కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ పో తుంది. బిడ్డ పుట్టాక పూర్తి సంరక్షణ ఆ తల్లిదే అవుతుంది గనక.
గృహస్థు పూజ, జపం, ధ్యానం, నామ సంకీర్తనం మొదలయి నవి నిత్య సాధన చేయాలి. అందుకే గృహస్థును సాధకుడని అంటా రు. అనుక్షణం భగవంతుణ్ణి స్మరిస్తూ కర్మల నాచరించే వారు చైత న్యంతో వెలిగిపోతారు. బిడ్డ తండ్రి చెయ్యి పట్టుకుని నడిస్తే పడి పోయే అవకాశం ఉంది. కానీ తండ్రే బిడ్డ చేయి పట్టుకుంటే పడి పోయే అవకాశమే లేదు. అందుకే భగవంతుడే మన చేయి పట్టు కునేలా సాధన చేయాలి. ఆర్తితో అలమటిస్తే ఆయన కృప కలగడం తథ్యం. భగవంతుడు ఈ సంసార సాగరంలో అటుఇటు పరుగులు పెట్టించేందుకు ఈ లోకాన్ని ఒక మహా మాయగా సృష్టించాడు. ఆ మాయాశక్తి రూపిణిని సర్వశ్య శరణాగతి చేసినప్పుడే ఆమె అమృత హస్తం మనకు ఆసరా అవుతుంది.
భగవంతుడు అందరినీ పవిత్రులుగానే సృష్టించాడు. అప విత్రులు అనేవారు లేనే లేరు. కానీ ఎవరైతే సృష్టి ధర్మానికి విరుద్దం గా వర్తిస్తారో వారు అపవిత్రులౌతారు. తెలిసో తెలియకో పవిత్రత ను కోల్పోతే తిరిగి భగవన్నామ స్మరణతో పునీతులవ్వవచ్చు. అయితే తిరిగి అవే తప్పులు పునరావృతం చేస్తే వారి గతి అథోగతే!
భగవంతుని యథార్థ స్వరూపాన్ని ఎవరూ వర్ణించలేరు. ఆయనకు సాధ్యం కానిది ఏదీలేదు. అందుకే ఆయనను ఏ కోణం లోనూ సందేహించకూడదు.. ”సందేహాత్మా వినశ్యతి” సందేహం తో స్మరిస్తే ఎప్పటికీ ఆయన నీ చేతిని పట్టుకోడు.
ఆధ్యాత్మిక సాధనలోనున్న ఇద్దరు యోగుల దగ్గరకు ఒక రోజు నారద మహర్షి రావడం జరిగింది. ఒక యోగి ”మీరు వైకుం ఠం నుండి వస్తున్నారా? శ్రీ మహా వి ష్ణువు మీరు వెళ్ళినప్పుడు ఏమి చేస్తున్నారు?” అని ప్రశ్నించాడు. ”ఆయన ఒకసూది బెజ్జం గుండా ఏనుగులను, ఒంటెలను అటు ఇటూ పంపిస్తున్నారు” అన్నాడు.
”అందులో ఆశ్చర్యమేమున్నది, ఆయనకు సాధ్యం కానిది ఏముంది” అన్నాడు యోగి. కానీ రెండో యోగి ”ఏమిటి, సూది బెజ్జం గుండా ఏనుగులను, ఒంటెలను పంపిస్తున్నాడా? అది అసా ధ్యం, మీరు అసలు వైకుంఠం వెళ్ళారా?” అని ప్రశ్నించాడు. ఆ యోగికి ఎన్ని జన్మలెత్తినా భగవద్దర్శనం అవుతుందా?
ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులు కలిగించే భార్య లేక భర్త అజ్ఞా నంలో ఉన్నట్లు భావించాలి. అటువంటి వారికి ప్రాధాన్యతనివ్వ డం తగ్గించాలి. అవసరమయితే త్యజించడమే ఉత్తమం. అయితే వారికి నిష్కపటమైన, యథార్థమైన భక్తి సాధన ఉండాలి. ఓర్పు వహిస్తే కొంత కాలానికి ఒకరినొకరు అనుసరించవచ్చు.
సాధన సాకార విగ్రహరాధనతోనే ప్రారంభించాలి. విగ్రహాలు మృణ్మయాలు కావు. అవి చిన్మయాలు. శ్రీ కృష్ణుడు అర్జునునితో ”నేను సాకారులకు సాకారినై, నిరాకారులకు నిరాకారినై దర్శన మిస్తాను” అన్నాడు. గృహస్థులు తీర్థయాత్రలు చేయాలి. అక్కడ వారికి భగవద్దీపన తప్పక కలుగుతుంది.
తీర్థాలలో యోగుల ఆత్మ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. వారి సందర్శనతో తీర్థక్షేత్రాలు పవిత్రమై ఉంటాయి. గృహస్థుకు మాతాపితరుల పూజ ఒక ఉత్తమ సాధన. వారి రూపాలను ధ్యానం చేయడం కూడా భగవరాధనే! తల్లి బ్రహ్మ స్వరూపిణి. భగవంతుని ఆసరాతో గృహస్థులు తమ సంసార యాత్రలో తామరాకు మీద నీటిబొట్టులా అంటీ అంటనట్లు ఉంటారు. కర్మ ఫలాలను ఆశించ కుండా, సంసార భయం లేకుండా ఉత్తమ గృహస్థునిగా నిలిచి భగవంతునిలో లయమౌతారు. ఓం పరమ హంసాయ విద్మహే మహా హాం సాయధీమహి, తన్నోహంస: ప్రచోదయాత్‌’ ఈ హంస గాయత్రిలోని ”తన్నో హంస: ప్రచోదయాత్‌”ను రామకృష్ణ మిషన్‌ చిహ్నంలో చూడవచ్చు.
– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement