Tuesday, April 23, 2024

హుజురాబాద్ ఓట్లపైనే కేసీఆర్ కు ప్రేమ

ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ పట్టం కడుతున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు ఇచ్చిన వ్యక్తి.. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులు పార్టీలో చేరారన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ ఏ రకమైన గౌరవం ఇస్తున్నారో తేటతెల్లమైందన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్ధం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ కు హుజురాబాద్ ప్రజల మీద కంటే వారి ఓట్లపైనే ప్రేమ ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం మూడేళ్ల ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ఓట్ల మీద ప్రేమ లేకపోతే.. హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

హుజురాబాద్ లో రూ.150 కోట్ల నగదు పంపిణీ చేశారని ఈటల ఆరోపించారు. కేసీఆర్ ప్రజల్ని కాకుండా పైసల్ని నమ్ముకున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. గతంలోనే తనను ఓడించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌కు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. దళిత బంధు పథకంతో పాటు బీసీల్లో కూడ ఆర్ధికంగా వెనుకబడిన వారికి కూడ ఆర్ధికంగా తోడ్పాటు అందించాలని ఈటల రాజేందర్  సీఎంను కోరారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన కోరారు. అక్రమంగా సంపాదించిన వేల కోట్ల డబ్బును హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపించారు. వందల పోలీసులు మఫ్టీలో వచ్చి ఒక్కో కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని  ఆయన మండిపడ్డారు.2018లో తనను ఓడించేందుకు పార్టీలోనే కొందరు నేతలు ప్రయత్నించారని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ నేతలు ఎన్ని తాయిలాలు ఇచ్చినా ప్రజలు తీసుకొంటారు, కానీ ఓటు మాత్రం తనకే వేస్తానని చెబుతున్నారని ఈటల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement