Tuesday, May 7, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 15
15.
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్త: స్మృతిర్‌ జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్‌ ||

తాత్పర్యము : సర్వుల హృదయములందు నేను నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగినవాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములను ఎరిగినవాడను నేనే.

భాష్యము : జీవుడు జన్మించగానే పూర్వజన్మలో తాను చేసిన కార్యాలను మరచిపోతాడు. పరమాత్మగా భగవంతుడు వాటిని గుర్తు పెట్టుకుని జీవునికి వాటి జ్ఞానమును ఇచ్చి ముందుకు న డిపిస్తూ ఉంటాడు. ఈవిధంగా పరమాత్ముని కృప వలన మరచిపోవుట, మరలా అవసరమైనప్పుడు గుర్తు చేసుకొనుట, తగిన జ్ఞానమును కలిగి ఉండుట అనునవి జీవునికి సాధ్యమగుచున్నవి. శ్రీ కృష్ణుడు భగవద్గీతను భోదించుట ద్వారా, వేదదములను ఇచ్చుట ద్వారా జీవుడు ఏ విధముగా నిర్ణయములను తీసుకుని తిరిగి భగవద్దామమునకు రావచ్చుననే జ్ఞానమును అందించుచున్నాడు. అంతేకాక వ్యాసదేవుని రూపములో వేదములను కూర్చెను. వేదములు భగవంతునితో మనకు గల సంబంధమును పునరుద్ధరించు విధానమును, చివరకు ఆయనను చేరు గమ్యమును వివరించుచున్నవి. వేదములను అర్థము చేసుకొనవలెనన్న దాని కి కావలసిన తెలివితేటలను సైతమూ భగవంతుడు ఇస్తాడు. ఇలా భగవంతుడు ఎంతో కరుణతో మనకు పరమాత్మ రూపములోనూ, వేదముల ద్వారానూ అన్ని విధాలా సహాయము చేయుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement