Friday, May 3, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 13,14

13.
అద్వేష్టా సర్వభూతానాం
మైత్ర: కరుణ ఏవచ |
నిర్మమో నిరహంకార:
సమదు:ఖసుఖ: క్షమీ||

14.
సంతుష్టస్సతతం యోగీ
యతాత్మా దృఢనిశ్చయ: |
మయ్యర్పితమనోబుద్ధి:
యో మద్భక్తస్స మే ప్రియ: ||

13—14 తాత్పర్యము : ద్వేషమనునది లేకుండా సర్వజీవుల యెడ మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మథ్యాహంకార రహితుడును, సుఖ దు:ఖములు రెండింటియందును సమభావము కలవాడును. క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైనవాడును, ఆత్మనిగ్రహము కలవాడును, తన మనో బుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టివాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు.

భాష్యము : శుద్ధ భక్తి మార్గానికి తిరిగి శ్రీ కృష్ణుడు శుద్ధ భక్తుని యొక్క దివ్య లక్షణాలను పొగుడుచున్నాడు. శుద్ధ భక్తుడు ఎటువంటి పరిస్థితిలోనూ కలత చెందడు. ఎవరి పట్ల ద్వేషాన్ని కలిగి యుండడు. ఎవరైనా తన పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటే, ”ఇతడు నా పూర్వ కర్మానుసారము ఇట్లు ప్రవర్తిస్తున్నాడని భావించి, దీనిని ఓర్చుకొనుటమే మేలు కాని ప్రతీకారము నిష్ప్రయోజనమని” తన శత్రువును సైతము ద్వేషించడు. అంతేకాక కృష్ణుడు నా కర్మఫలాన్ని తగ్గించి కేవలము స్వల్పముగానే శిక్షించుచున్నాడని అర్థము చేసుకొనుట వలన ఎప్పుడూ శాంతముతో, ఓపికగా జీవిత కష్టాలను ఎదుర్కొనును. అంతేకాక శత్రువు పట్ల కూడా దయ కలిగి అందరినీ కరుణతో చూచును. తాను శరీరాన్ని కాదు అనే అవగాహన ఉండుట వలన శారీరక బాధలకు, కష్టాలకు ఎక్కువ ప్రాముఖ్యత నివ్వడు. శరీర భావన లేని కారణమున అహంకారమూ ఉండదు. అందుచేత సుఖ, దు:ఖాలలో సమత్వాన్ని కలిగి ఉంటాడు. ఓర్పును కలిగి భగవంతుడు ఇచ్చిన దానితో సంతుష్టిని పొంది ఉంటాడు. దేనిని గొప్ప ప్రయాసతో సాధించడానికి ప్రయత్నించడు కనుక ఎల్లప్పుడూ ఉల్లాసముగా ఉంటాడు. గురువు ఆజ్ఞలనే పాటించుటకు ప్రయత్నించును కనుక అతడు యోగి. అలా ఇంద్రియాలను నిగ్రహిస్తాడు కనక అతడు దృఢనిశ్చయాన్ని కలిగి ఉంటాడు. కృష్ణుడే శాశ్వతముగా తనకు ప్రభువని తెలియుట వలన ఎవరూ అతనిని చలింపలేరు. ఈ కారణాల చేత అతడు తన మనస్సు బుద్ధిని భగవంతునిపై నిమగ్నము చేస్తాడు. అటువంటి అరుదైన వ్యక్తి భగవంతునికి ఎంతో ప్రియుడు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement