Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 4
4
తత్‌క్షేత్రం యచ్చ యాదృక్చ
యద్వికారి యతశ్చ యత్‌ |
స చ యో యత్ప్రభావశ్చ
తత్సమానేన మే శృణు ||

తాత్పర్యము : ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దాని యందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినది అనెడి విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షేప వర్ణనను ఆలకింపుము.

భాష్యము : ఇక్కడ భగవంతుడు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల వాస్తవ స్థితిని వివరించుచున్నాడు. ఈ శరీరము ఎలా ఏర్పడినదో, దానికి కావలసిన మూలకములు ఎక్కడ నుండి తేబడినవో, ఎవరి నియంత్రణలో ఈ శరీరము పనిచేస్తుందో, ఈ శరీరములో మార్పులు ఎలా సంభవింపబడుచున్నాయో, చివరికి జీవుని అంతిమ లక్ష్యము మరియు అతని నిజ స్వరూపము ఏమిటో తెలుసుకొనవలెను. ఆత్మకు, పరమాత్మకు గల బేధము, వారి ప్రభావములలోనూ, శక్తులలోను గల తేడాను తెలుసుకొనవలసి ఉన్నది. మనము ఈ భగవద్గీతలో స్వయముగా భగవంతుడు ఇస్తున్న వివరణలను అర్థము చేసుకొనుటకు ప్రయత్నించినట్లయితే ఈ విషయాలన్నీ సుస్పష్టమవుతాయి. అయితే ప్రతి శరీరములోనూ ఉన్న భగవంతుడు, మరియు జీవుడు ఒకరే అనే పొరపాటును మాత్రం చేయరాదు. అది శక్తిమంతుణ్ని, శక్తిహీనునితో సమానము చేసినట్లవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement