Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 4
4.
యజంతే సాత్త్వికా దేవాన్‌
యక్షరక్షాంసి రాజసా: |
ప్రేతాన్‌ భూతగణాంశ్చన్యే
యజంతే తామసా జనా: ||

తాత్పర్యము : సత్త్వ గుణము నందు నిలిచిన వారు దేవతలను, రజోగుణము నందు నిలిచిన వారు యక్షరాక్షసులను, తమో గుణము నందు నిలిచినవారు భూతప్రేతములను పూజింతురు.

భాష్యము : ఒక వ్యక్తి చేయు వేరువేరు పూజలను బట్టి వారు ఏ ఏ గుణములలో ఉన్నారో ఈ శ్లోకము నందు దేవాదిదేవుడు వివరించుచున్నాడు. శాస్త్రాల ప్రకారము భగవంతుణ్న పూజించాలని తెలియజేసినా, వాటి పట్ల విశ్వాసము లేని వారు తమ గుణములను అనుసరించి వేరు వేరు వస్తువులను, వ్యక్తులను పూజించుదురు. సత్వ గుణములో ఉన్వారు వారి కోరికలను తీర్చగలిగే దేవతలైన ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మ, శివుడు ఇలా ఎవరో ఒక దేవత ను పూజించెదరు. ఇక రజో గుణములో ఉన్నవారు ఎవరిని పూజించినా ఒకటేనని తమకు కావలసిన ఫలితము కోసము శక్తివంతుడైన, పేరు గల మానవుణ్న భగవంతునిగా పూజించుదురు. ఒక తమో గుణములో ఉన్నవారు స్మశానాలలో, చెట్లు పుట్టల వద్ద భూత ప్రేతాలను పూజించుదురు. నిరాకారాలు పంచోపాసన పేరుతో విష్ణువు కూడా దేవతలతో సమానము చేసి అయిదుగురిని పూజించుదురు. కానీ నిరాకార బ్రహ్మమే అన్నింటికీ మూలమని, సత్యమని భావించి ఆ పూజలను తాత్కాలికముగా చేసి వదిలి వేయుదురు. కాబట్టి దివ్య స్థితిలో ఉన్న వ్యక్తుల సాంగత్యము ద్వారా మాత్రమే త్రిగుణములతో కలుషితమైన విశ్వాసాన్ని పవిత్రము చేయవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement