Monday, December 9, 2024

తెలుగులో పొరుగు తార‌ల హ‌వా…

మమ్ముట్టి, సురేష్‌ గోపీ, ఉపేంద్ర, అరవింద్‌ స్వామి, శరత్‌కుమార్‌, ఫాహద్‌ ఫాసిల్‌, నవాజున్‌ సిద్దిక్‌ వీరందరూ తెలుగు సినిమాల్లో నటిసు ్తన్న పొరుగు భాషలకు చెందిన నటులు. తెలుగులో భారీ కమర్షియల్‌ సినిమాకు శ్రీకారం చుట్టగానే హీరో డేట్స్‌ కన్‌ఫర్మ్‌ అయ్యాక దర్శక నిర్మాతలు పొరుగు ఆర్టిస్టులపై దృష్టి పెడుతున్నారు. విలన్‌ లేదా బలమైన క్యారెక్టర్‌ పాత్ర కోసం తమిళ్‌, కన్నడ, మలయాళ తాజాగా హిందీ భాషలకు చెందిన నటినటుల కోసం అన్వేషిస్తున్నారు.
ఒక భాషకు చెందిన నటులు మరో భాషలో నటించడం కొత్తకాదు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ ఈ విధంగానే దిగుమతి అయినవారే. కానీ ఇప్పటి ట్రెండ్‌ దీనికి విరుద్దంగా ఉంది. దాదాపు ప్రతి సినిమాలో పొరుగు తారలు ఉండాలని భావిస్తున్నారు. దీనికంతటికీ కారణం తెలుగు సినిమాకు దేశవ్యాప్త ఖ్యాతి ఉండటమే కారణం అంటున్నాయి సినీ వర్గాలు. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో మార్కెటింగ్‌ చేసుకోవాలంటే ఆయా భాషలకు చెందిన ఆర్టిస్టులు ఉంటే బావుంటుందనేది వారి అభిప్రాయం.

అయితే ఈ ఫార్ములా కేవలం తెలుగులో మాత్రమే అమలవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పాన్‌ ఇండియా సినిమాలు ఇతర భాషల్లో సైతం తెరకెక్కుతున్నారు. ఉదాహారణకు కేజీఎఫ్‌ సినిమా తెలుగులో కూడా ఆదరణ పొందింది. అందులే తెలుగు ఆర్టిస్టులు లేరు. ఇక క్రియేటర్‌ అని చెప్పబడం మణిరత్నం తన తాజా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలో డజను మందికిపైగా హీరోలు ఉన్నారు. కానీ ఆయన తెలుగు ఆర్టిస్టులను ఎవరినీ తీసుకోలేదనే విషయాన్ని కొందరు నిర్మాతలు గుర్తుచేస్తున్నారు. తెలుగులో రిలీజ్‌ చేస్తామని తెలిసినా సరే వారు తమిళ సంప్రదాయాన్నే పాటించారు.
తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలకు ఉదారస్వభావం ఎక్కువ కాబట్టి పొరుగు ఆర్టిస్టు పట్ల ఉదారంగానే వ్యవహరిస్తారు. ఇప్పటికే హీరోయిన్లుగా తెలుగువారికి అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ప్రధాన క్యారెక్టర్‌ పాత్రలు సైతం పక్కకి తరలిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్న వారున్నారు. తెలుగులో కూడా ప్రతిభావంతులైన ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వారికి ఇతర భాషల్లో అవకాశాలు తక్కువగానే వస్తున్నాయనేది వాస్తవం. ఇదిలా ఉంటే హీరోలను కూడా దిగుమతి చేస్తున్నారు. తెలుగులో దాదాపు యాభై మంది హీరోలున్నారు. అయినప్పటికీ ధనుష్‌, కార్తి, విజయ్‌, విజయ్‌ సేతుపతి, శివకార్తికేయన్‌, దేవ్‌ మోహన్‌తో హీరోలుగా సినిమాలు తీస్తున్నారు. మార్కెట్‌ ఉన్న హీరోలు డేట్స్‌ ఇవ్వక పోవడం వల్లే పొరుగు హీరోలపై ఆధారపడాల్సి వస్తోందని కొందరు నిర్మాతలు చెబుతున్నదాంట్లో వాస్తవం ఉంది.
తమిళ హీరోలతో సినిమాలు తీస్తే తమిళంతో పాటు తెలుగులో మార్కెట్‌ ఉంటుందని వారి నిర్మాతలు అంటున్నారు. కళాకారులకు ప్రాంతీయత ఉండదని, వారు ఎక్కడైనా, ఏ భాషలో అయినా నటించవచ్చని అంటారు. అయితే ఈ నిబంధన కేవలం మనకే ఉందా? ఇతర భాషల్లో తెలుగువారికి అవకాశాలు ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించేవారున్నారు. సినిమా అనేది వ్యాపారం. లాభాలు వస్తాయని తెలిస్తే ఎవరితో అయినా తీస్తారు అని ఓ నిర్మాత స్పష్టత ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement