Wednesday, May 1, 2024

కృష్ణ వ్రింద విహారి మూవీ ఎలా ఉందంటే..

ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృష్ణ వ్రింద విహారి చిత్రం.మరి ఈ సినిమా నాగశౌర్యకు విజయాన్ని అందించింది లేదా చుదాం..

కథ ఏంటంటే – సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. చిన్నప్పట్నుంచి ఆచార వ్యవహారాల మధ్య చాలా పద్ధతిగా పెరిగిన అతను.. తనకు పూర్తి భిన్నమైన వాతావరణంలో పెరిగిన ఆధునిక అమ్మాయి అయిన వృంద (షెర్లీ సెటియా)ను ఇష్టపడతాడు. వృందకు కూడా కృష్ణ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. తనకు పిల్లలు పుట్టరనే కారణంతో అతణ్ని దూరం పెడుతుంది. ఐతే ఆ సమస్య గురించి తెలుసుకుని.. తనకు పిల్లలు అవసరం లేదని తనకు సర్దిచెప్పి.. తనకే ఏదో సమస్య తలెత్తినట్లుగా చెప్పి తన ఇంట్లో వాళ్లను ఒప్పించి వృందను పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. కానీ కృష్ణ తల్లి సిటీలోని అతడి ఇంటికి రావడంతో కొత్త సమస్యలు తలెత్తుతాయి. అవేంటి.. వాటి వల్ల కృష్ణ-వృందల బంధంపై ఎలాంటి ప్రభావం పడింది అన్నది మిగతా కథ.

విశ్లేషణ – కృష్ణ వృంద విహారితో మళ్లీ తన రూట్లోకి వచ్చాడు దర్శకుడు అనీష్ కృష్ణ.. కాకపోతే ఈసారి అతను అక్కడక్కడా కొన్ని నవ్వులైతే పంచాడు కానీ.. తొలి సినిమా స్థాయిలో ప్రేక్షకులకు గిలిగింతలు మాత్రం పెట్టలేకపోయాడు. బలమైన కథ లేకపోవడం.. ఎక్కడా పెద్దగా మలుపులు లేకుండా.. ఆశ్చర్యానికి గురి చేయకుండా సాధారణంగా సాగిపోయే కథనం వల్ల సినిమా గ్రాఫ్ మీడియం మీటర్లో నడిచిపోయింది. టైంపాస్ చేయడానికైతే ఓకే అనిపించే సినిమా ఇది. చాలామంది రచయితలు.. దర్శకులు కథలో వచ్చే ట్విస్టు దగ్గర లేదంటే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ దగ్గర ఎగ్జైట్ అయిపోయి.. అదొక్కటే సినిమాను కాపాడేస్తుందని అనుకుంటారు. ఆ పాయింట్ కు అటు ఇటు ఫిల్లింగ్ లాగా సీన్లు పేర్చేసుకుని.. కామెడీ.. రొమాన్స్.. ఎమోషన్స్ అని మసాలాలు పులిమేసుకుని సినిమాను లాగించేస్తుంటారు. అనీష్ కృష్ణ కూడా దాదాపు చేసింది అదే. ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నప్పటికీ అది కొత్తది కూడా కాదు. హీరోయిన్ కు పిల్లలు పుట్టరని తెలిసి హీరో లోపం తనలో ఉందని చెప్పి పెళ్లికి ఒప్పించడం.. ఇరు కుటుంబాల్లో గందరగోళం నెలకొనడం గతంలో చాలా సినిమాల్లో చూశాం.

నటీనటులు- నాగశౌర్య మరోసారి చక్కటి లుక్స్.. స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతడి నటనకు కూడా వంకలు పెట్టడానికి లేదు. అన్ని సన్నివేశాల్లోనూ మంచి ఈజ్ తో నటించాడు. కథలో కీలకమైన ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించాడు. సరైన కథలు పడితే అతను సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లగలడనిపిస్తుంది. కొత్త కథానాయిక షెర్లీ సెటియా ఆకట్టుకుంది. ఆమె రెగ్యులర్ హీరోయిన్లలా కాకుండా కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. కొంచెం హైట్ తక్కువ కావడం మైనస్సే అయినా.. తన క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా వరకు తనకు సూటయ్యే పాత్ర దక్కింది. నటన ఓకే. కీలకమైన పాత్రలో రాధిక మెప్పించింది. చాదస్తపు పాత్ర కావడం వల్ల కొంచెం చికాకు పెట్టినా.. అలాంటి ఫీలింగ్ కలిగేలా నటించడంలోనే రాధిక తన ప్రత్యేకతను చాటుకుంది. వెన్నెల కిషోర్.. సత్య.. బ్రహ్మాజీ.. కనిపించినంత సేపూ బాగానే నవ్వించారు. రాహుల్ రామకృష్ణ పర్వాలేదు.

సాంకేతిక – మహతి నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఈ కథకు తగ్గట్లుగా కుదిరాయి. నిర్మాణ విలువల విషయంలో నాగశౌర్య ఫ్యామిలీ ఏమీ రాజీ పడలేదు. అలా ఎలా మూవీ తర్వాత నిరాశ పరుస్తూ వచ్చిన అనీష్ కృష్ణ.. గత సినిమాలతో పోలిస్తే మెరుగ్గా కనిపించాడు. కానీ తొలి సినిమా ప్రమాణాలను మాత్రం అందుకోలేకపోయాడు. కథనం విషయంలో అతను రొటీన్ గానే ఆలోచించాడు. కామెడీ సీన్ల వరకు రైటింగ్.. ప్రెజెంటేషన్ బాగుంది. కామెడీ మీద అతడికున్న పట్టు అక్కడక్కడా తెలుస్తుంది. మొత్తానికి సినిమాని చూడొచ్చు ..రేటింగ్ ప్రేక్షకులు చూసి మెచ్చే దానిపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement