Friday, May 3, 2024

డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈవో.. ఇత‌ర సీనియ‌ర్ మేనేజ‌ర్ల‌కు బాధ్య‌త‌లు

ఒక సంస్థకు సీఈవో అంటే ఏసీ గదుల్లో కూర్చుకుని కార్యకలాపాలను పర్యవేక్షించడం అనే అర్థాన్ని మార్చేశాడు జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌. క్షేత్రస్థాయిలోకి వెళ్లడం, అట్టడుగు స్థాయిలో స్వయంగా సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావడం ద్వారానే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని నిరూపిస్తున్నాడు. తానొక్కడే కాకుండా, సంస్థలోని ఇతర సీనియర్‌ మేనేజర్లకూ ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తూ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ట్రేడ్‌మార్క్‌ రెడ్‌ టీ షర్టు ధరించి, సాధారణ డెలివరీ బాయ్‌ మాదిరిగా బైక్‌ మీద ఫుడ్‌ డెలివరీలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు దీపిందర్‌ గోయల్‌. తద్వారా వినియోగదారుల అభిప్రాయాలతోపాటు, సిబ్బంది ఇబ్బందులు కూడా నేరుగా తెలుసుకునే వీలుంటుందని భావిస్తున్నాడు.

అందుకే ప్రతి మూడు నెలలకోసారి ఈ విధంగా డెలివరీబాయ్‌ అవతారం ఎత్తుతున్నాడని, మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో సంస్థ పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నాడని నౌకరీడాట్‌ కామ్‌ యజమాని సంజీవ్‌ బిక్‌చందానీ ట్విట్టర్‌లో వెల్లడించారు. మూడేళ్లుగా డెలివరీ బాయ్‌ రూపంలో సేవలు అందిస్తున్నానని, ఇంతవరకు ఎవరూ తనను గుర్తుపట్టలేదని దీపిందర్‌ తనతో చెప్పినట్లు సంజీవ్‌ వివరించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు జొమాటో సీఈవోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement