Sunday, April 28, 2024

ప్రైవేట్‌ వాహనాల వైట్‌ ప్లేట్‌ దందా.. తెల్ల బోర్డుతో దర్జాగా దోపిడీ!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వ్యాపారులు కొందరు యథేచ్ఛగా ట్రాన్స్‌పోర్ట్‌ దందాను కొనసాగిస్తున్నారు. వాహనాల వైట్‌ నంబర్‌ ప్లేట్‌ చాటున ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఎల్లో బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఇప్పుడసలే దసరా సీజన్‌ కావడంతో వైట్‌ ప్లేట్‌ ఉన్న వాహనాల్లో చాలా మంది ప్రయాణికులను ఊళ్లకు తరలిస్తూ దండుకుంటున్నారు. అలాగే వైట్‌ ప్లేట్‌ వాహనాలను ఇతరత్రా రవాణా అవసరాలకు వినియోగిస్తున్నారు. దాంతో అటు ఆర్టీసీకు, ఇటు రవాణాశాఖకు ఆదాయంలో కోత పడుతోంది. సొంత అవసరాల పేరుతో వాహనాలను కొనుగోలు చేసి కొందరు వాటిని అద్దె ట్యాక్సీలుగా తిప్పుతున్నారు. అందులోనూ అనుభవంలేని డ్రైవర్లను నియమించుకుని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పండగల సీజన్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రోడ్డు, పర్మిట్‌ పన్నును ఎగగొట్టేస్తున్నారు. అంతేకాకుండా పరిమితికి మించి ప్రయాణికులను ఊళ్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే పలువురు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వాహనదారులు వైట్‌ బోర్డుతోనే క్యాబ్‌లను అద్దెకు తిప్పుతున్నారు. దాంతో ప్రభుత్వానికి రూ.కోట్లల్లో పన్ను ఎగ్గొడుతున్నారు.


రవాణా వాహనాలకు అనుమతులు తప్పనిసరి…

రవాణా వాహనాలకు రవాణా శాఖ అనుమతులు తప్పనిసిరి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని నడిపేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఎల్లో బోర్డుతో రవాణాశాఖ రిజిస్ట్రేషన్‌ నంబరు జారీ చేస్తోంది. అదే సొంత వాహనాలకు వైట్‌ నంబర్‌ ప్లేట్‌ను రవాణాశాఖ కేటాయిస్తుంది. ఇందులో ఎల్లోబోర్డు వాహనానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటే… వైట్‌ బోర్డు వాహనానికి మాత్రం రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఒకేసారి లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తే సరిపోతోంది. ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకున్న పలువురు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వ్యాపారులు వైట్‌ బోర్డు కింద వాహనాలను కొనుగోలు చేసి ట్యాక్సీలుగా అద్దెకు తిప్పుతున్నారు. ఇలా తిరిగే వాహనాలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం దసరా, బతుకమ్మ పండుగలు ఉండడంతో ప్రయాణికులను వీటిల్లోనే తరలిస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వారు త్రైమాసిక పన్నుతో పాటు రోడ్డు ట్యాక్స్‌, చెక్‌పోస్టుల్లో పర్మిట్‌ చార్జీలను తప్పించుకునేందుకే తమ వాహనాలను వైట్‌ బోర్డు ముసుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది పండుగ సీజన్‌లలో తిప్పుతూ లాభం అర్జిస్తున్నారు. ఈ రకంగా చాలా మంది అధికారులకు చిక్కకుండా వాహనాలను తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

- Advertisement -

ప్రభుత్వ కార్యాలయాల్లోనూ..

అధికారులు పండుగ సీజన్‌లలో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి ఆతర్వాత చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైట్‌ బోర్డులు తగిలించుకున్న ట్యాక్సీలు యథేచ్చగా రాకపోకలను సాగిస్తున్నాయి. మరోవైపు కొంత మంది అధికారులు తమ సొంత వాహనాలను ట్యాక్సీలుగా తిప్పుకుంటున్నారు. ప్రభుత్వ అవసరాలకు వాడాల్సిన వాహనాల కోసం వ్యక్తిగత వాహనాల పేరిట రిజిస్టర్‌ అయిన వాహనాలను తెగా వాడేస్తున్నారు. పైగా వాటిపై ఆన్‌ గౌట్‌ డ్యూటీ పేరుతో తిరుగుతూ బిల్లులు తీసేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement