Tuesday, April 30, 2024

భారతీయ విద్యార్ధులకు యూకే ప్రయారిటీ వీసాలు

భారతీయ విద్యార్ధులకు బ్రిటన్‌ ప్రయారీటీ, సూపర్‌ ప్రయారిటీ పేరుతో వేగంగా వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. యూకే వీసాలకు ఈ సంవత్సరం విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఫలితంగా వీసాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. కొవిడ్‌ తరువాత మన దేశం నుంచి ఉన్నత విధ్య కోసం వెళ్లే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వర్క్‌ వీసా కోసం వృత్తి నిపుణులు సైతం ఎదురు చూస్తున్నారు. ప్రయారిటీ వీసా కోసం 500 పౌండ్లు, మన కరెన్సీలో దాదాపు 47 వేలు, సూపర్‌ ప్రయారిటీ వీసా కోసం 800 పౌండ్లు, మన కరెన్సీలో దాదాపు 75 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
రెగ్యూలర్‌ వీసాల జారీకి 15 రోజుల సమయం పడుతుందని, దీని కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వస్తుందని ఇమ్రిగేషన్‌ అధికారులు తెలిపారు. వీసాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయారిటీ, సూపర్‌ ప్రయారిటీ వీసాలను జారీ చేయాలని నిర్ణయించినట్లు మన దేశంలో బ్రిటీష్‌ రాయబారి అలెక్స్‌ ఎలిస్‌ తెలిపారు.

యూకేకు వస్తున్న విదేశీ విద్యార్ధుల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఈ విషయంలో చైనాను మన దేశం అధిగమించింది. వీసాకు అప్లయ్‌ చేసుకునే విద్యార్ధులు అన్ని డాక్యుమెంట్లను సరిగా సమర్పించాలని ఆయన కోరారు. యూనివర్శిటీ ఆఫర్‌ లెెటర్‌, సీఏఎస్‌, టిబీ సర్టిఫికెట్లు, ఫండింగ్‌ వివరాలు ఇలా ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి సమర్పించాలని కోరారు.
ప్రయారిటీ వీసాకు అప్లయ్‌ చేసుకున్న వారికి 5 రోజుల్లో, సూపర్‌ ప్రయారిటీ వీసాకు అప్లయ్‌ చేసుకున్న వారికి అంతకంటే ముందుగానే వీసాలు జారీ చేస్తామని చెప్పారు. సాధారణంగా ప్రయారిటీ వీసాకు అపాయింట్‌మెంట్‌ రోజు నుంచి 5 పనిదినాల్లో వీసా పొందవచ్చు. సూపర్‌ ప్రయారిటీలో అప్లయ్‌ చేసుకుంటే రెండు పని దినాల్లో వీసా పొందుతారు.

బ్రిటన్‌ జారీ చేస్తున్న మొత్తం విజిటర్‌ వీసాల్లో మన దేశానికి చెందిన వారికి ఇస్తున్న వీసాలు 28 శాతం ఉన్నాయి. స్కిల్డ్‌ వర్క్‌ వీసాల్లోనూ మన దేశానికి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. ఇండియన్స్‌కు 46 శాతం వర్క్‌ వీసాలు జారీ చేశామని హై కమిషన్‌ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం జూన్‌ నాటికి 1,18,000 వేల మంది విద్యార్ధులు స్టూడెంట్‌ విసాలు పొందారు. ఇది గత సంవత్సరం కంటే 89 శాతం అధికం. ఇప్పటి వరకు విద్యార్ధి వీసాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. దాన్ని ఈ సంవత్సరం మన దేశం అధిగమించింది. ఈ సంత్సరం అత్యధికంగా ఇండియన్స్‌కు 2,58,000 విజిటర్‌ వీసాలను జారీ చేశామని అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే విజిటర్‌ వీసాలు 630 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం జూన్‌ నాటికి మన దేశానికి చెందిన వారు 1,03,000 మందికి వర్క్‌ వీసాలు జారీ చేశారు. గత సంవత్సరం కంటే ఇది 148 శాతం అధికం. ఇందులో 46 శాతం సిల్డ్‌ వర్క్‌ వీసాలు ఉన్నాయి. ప్రతి ఏటా మన దేశం నుంచి యూకేకి వెళ్లే విద్యార్ధుల సంఖ్యతో పాటు, నిపుణులైన ఉద్యోగులు కూడా భారీ సంఖ్యలో వెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement