Friday, May 3, 2024

అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌గా ఖతార్‌.. టాప్‌ 20లో ఇండియా నుంచి విస్తారాకు చోటు

ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్‌ సంస్థగా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ నిలిచింది. కొవిడ్‌ సంక్షోభం తరువాత క్రమంగా విమానయాన రంగం పుంజుకుంటోంది. వివిధ దేశాల మధ్య రాకపోకలు పెరగడం, టూరిజం కూడా వృద్ధి చెందడంతో విమానప్రయాణాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు పలు ఎయిర్‌లైన్‌ సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌లైన్‌ సంస్థలపై స్కైట్రాక్స్‌ వరల్డ్‌ అవార్డ్స్‌ సంస్థ 2022కుగాను ఉత్తమ ఎయిర్‌లైన్‌ అవార్డులను ప్రకటించింది. 2021 సెప్టెంబర్‌ నుంచి 2022 ఆగస్టు వరకు ఈ సంస్థ సర్వే చేసింది. వంద దేశాలకు చెందిన కోటీ 40 లక్షల మంది ప్రయాణీకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. 350 విమాయాన సంస్థలపై జరిపిన సర్వే వివరాలను లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌, రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

మన దేశానికి చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ టాప్‌ 20లో స్థానం సంపాదించింది. విస్తారా దక్షిణాసియా, భారత్‌లో ఉత్తమ ఎయిర్‌లైన్స్‌గా నిలిచింది. టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్తంగా విస్తారాను నిర్వహిస్తున్నాయి. టాప్‌ 20లో నిలవడం పట్ల విస్తారా ఎయిర్‌లైన్స్‌ సీఈఓ వినోద్‌ కన్నన్‌ సంతోషం వ్యక్తం చేశారు. జపాన్‌కు చెందిన ఆల్‌ నిప్పన్‌ ఎయిర్‌వేస్‌ ప్రపంచలోనే అత్యంత శుభ్రత కలిగిన ఎయర్‌లైన్స్‌గా అవార్డు పొందింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ విభాగంలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బెస్ట్‌ ఫస్ట్‌క్లాస్‌ క్యాబిన్‌ విభాగంలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, బెస్ట్‌ బిజినెస్‌ క్లాస్‌ విభాగంలో ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ మొదటి స్థానంలో ఉన్నాయి. కొవిడ్‌ సమయంలోనూ ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సేవలు కొనసాగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement