Saturday, May 4, 2024

స్వీయ రాబడుల్లో భారీ వృద్ధి..! అన్ని రంగాల్లో ఆశించిన ఆదాయం,

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఖజానా కుదుటపడుతోంది. ఆదాయ రాబడిలో నెలకొన్న స్తబ్ధత వీడిపోతోంది. దీంతో ప్రభుత్వానికి కాస్తంత స్వాంతన చేకూరుతోంది. ప్రధాన ఆదాయ శాఖల్లో కీలకమైన రాబడి శాఖలనుంచి కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తాజాగా మద్యం విక్రయాలద్వారా ఆబ్కారీ శాఖనుంచి 8శాతం వృద్ధిరేటు నమోదైంది. అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖ ప్రగతిపథంలోకి చేరడం కూడా ప్రభుత్వానికి మరింతగా కలిసివస్తోంది. దీంతో ఖజానాకు ఆదాయం దండిగా చేరుతోంది. రిజిస్ట్రేషన్ల రాబడి ఏప్రిల్‌ 1నుంచి నేటి వరకు రూ. 4286కోట్లుగా నమోదైంది. ఇక కీలకమైన ఆబ్కారీ విక్రయాలు రూ. 9వేల కోట్లకు మించాయి. అదేవిధంగా జీఎస్టీ రాబడి కూడా మెరుగుపడుతోంది. దీంతో రాష్ట్ర రాబడుల్లో పురోగతి మొదలైంది. పన్నేతర రాబడిలో పెరుగుదలతో ఆదాయం పుంజుకుంటోంది. ఆశించిన మేర అప్పులు రాకపోయినా సొంత ఆదాయంతో ప్రభుత్వ ఖజానా సేదతీరుతోంది. రెవెన్యూ రాబడుల రూపంలో గత నెలలో రూ. 17,556 కోట్లు ఖజానాకు చేరాయి. పన్నేతర రాబడి కింద గత నెలలో రూ. 5961కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్ధిక ఏడాదిలో రూ. 2,19,003కోట్ల మూలధన, రెవెన్యూ వ్యయాల్లో రూ. 40,572కోట్లను ఇప్పటికే ఖర్చు చేసింది. ఇలా అన్ని రాబడి రంగాల్లో ప్రగతి నమోదు చేసుకుంటోంది. ఇది భవిష్యత్‌ ఆదాయాలకు ఆశాజనకమేనని ప్రభుత్వ వర్గాల అంచనా. మరోవైపు తగ్గుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు వాణిజ్య పన్నులపై కొంత ప్రభావం చూపుతోంది. దీంతో పెరిగిన సంక్షేమ భారానికి వనరులు ఎలా అనే సందిగ్దంలో కొట్టుమిట్టాడుతోన్న ఆర్ధిక శాఖ తాజా పరిణామాలతో ఊపిరి పీల్చుకుంటోంది. సీఎం ఎడాపెడా ఇస్తున్న హామీల జడివానకు నిధుల కేటాయింపు, ఆర్ధిక వనరుల లభ్యతపై ఆర్ధిక శాఖ ఇప్పటికే అంతర్మథనం చెందుతోంది. ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న హామీలే కాకుండా సీఎం కేసీఆర్‌ ఎడాపెడా చేస్తున్న వాగ్దానాలతో నిధుల సమీకరణ కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో కీలక ఆదాయ వనరులపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకొంది. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యాలే అస్త్రంగా….మెల్లమెల్లగా ఆదాయ మార్గాల్లో వృద్ధిరేటు దిశగా పావులు కదుపుతోంది.

రియల్‌ పురోగమనం…

రాష్ట్రంలో రియల్‌ వ్యాపారం గాడిలో పడుతోంది. ఇప్పటివరకు కుదేలైన ఆస్తుల క్రయవిక్రయాల్లో వేగం పుంజుకుంటోంది. దీంతో యావత్‌ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల జోరు పెరుగుతోంది. 2022-23 ఆర్ధిక యేడాదిలో రూ. 1.33 లక్షల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో పొందేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని సొంత వనరుల రాబడి శాఖలకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. జీఎస్టీ, అమ్మకం పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌, ఇతర ఆదాయాలపై సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల రాబడిపై ఈ ఆర్ధిక యేడాదిలో నెలవారీ సమీక్షలకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అంచనాల చేరికలో ఇబ్బందులు పడుతున్న సొంత వనరుల రాబడి శాఖల్లో పురోగతిని పరిశీలించి ఎప్పటికప్పుడు వేగవంతంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక మరో కీలక వనరుగా ఉన్న పన్నేతర రాబడులను కూడా ఈ ఏడాది రూ. 7వేల కోట్లనుంచి రూ. 25442కోట్లకు పెంచుకున్నారు. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ. 15500కోట్లను ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల వాటా, ఇతర సాయాల్లో రూ. 59,396కోట్లను అంచనా వేసుకోగా ఈ సాయం అందే పరిస్థితి ఆశాజనకంగా లేదని సమాచారం.
తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిలో రూ.15వేల కోట్లమేర కోతలకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 30వేల కోట్ల రుణాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మరో రూ.30వేల కోట్లు కోత పడటంద్వారా మొత్తంగా రూ.45వేల కోట్లు కోతలు పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది ప్రస్తుత ఆర్ధిక యేడాదిలో బాండ్ల విక్రయంద్వారా రూ. 53,970 కోట్ల స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్లకు కేంద్ర ఆర్ధిక శాఖ తొలుత ఆమోదించింది. ఆ తర్వాత ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు, షరతులతో ఇది రూ. 23వేల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బడ్జెట్‌ వెలుపలి రుణాలపై ఆర్ధిక శాఖ మార్చి 31న రాష్ట్రాలకు రాసిన లేఖలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో కాకుండా అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు రాష్ట్రం తీసుకున్న రుణాలు పెరిగాయని ఆక్షేపించింది. అంతే మొత్తంలో ఈ ఏడాది రుణంలో కోతలు పెడ్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement