Friday, May 3, 2024

మన పర్యాటక రంగం దూసుకుపోతుంది.. ట్రావెలర్ అవార్డుల ప్రదానోత్సవంలో కిషన్ రెడ్డి 

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కరోనా తర్వాత పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత పర్యాటక రంగం సమీప భవిష్యత్తులో దూసుకుపోవడం ఖాయమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగాలను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు.

బుధవారం ఢిల్లీలో జరిగిన ‘ఔట్‌లుక్ ట్రావెలర్ మ్యాగజైన్’ అవార్డుల ప్రదానోత్సవానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటక రంగానికి మరిత ప్రోత్సాహాన్ని అందించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యాటక, ఆతిథ్య రంగం ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామన్నారు. వారి అవసరాలను ఎప్పటికప్పడు గుర్తిస్తూనే తదనుగుణంగా ప్రోత్సాహ చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇందులో భాగంగా పర్యాటక, ఆతిథ్య రంగాలకు అవసరమైన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకాన్ని రూ 4.5 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు పెంచేలా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇందులో భాగంగా పెంచిన రూ.50వేల కోట్లను సద్వినియోగపరచుకునే విధంగా పథకాన్ని 31 మార్చి 2023 వరకు పొడగించినట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా రెస్టారెంట్లు, పెళ్లి మండపాలు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, ఆతిథ్యానికి సంబంధించిన ఇతర వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈ లకు లబ్ధి చేకూరుతుందన్నారు.

భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘దేఖో అప్నా దేశ్’ను ప్రారంభించుకున్న విషయాన్ని ప్రస్తావించిన కిషన్ రెడ్డి, మన దేశంలోని సాంస్కృతిక వైవిధ్యత, చారిత్రక కట్టడాలతోపాటు పర్యాటక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని, దీని సత్ఫలితాలు ఇప్పుడిప్పుడే కనబడుతున్నాయని అన్నారు.

దేశంలో 76 థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్స్ అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఇందుకోసం రైలు మార్గం, రహదారులు, జలమార్గాలు, విమానాశ్రయాల  మధ్య అనుసంధానతకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేంద్ర మంత్రి ఇప్పటికే ప్రతిష్టాత్మక రామాయణ్, బుద్ధ సర్క్యూట్  రైళ్లు ప్రారంభమయ్యాయన్నారు. పర్యాటక  మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘ఉత్సవ్ పోర్టల్’ లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలు, పండగలు, యాత్రాస్థలాల్లో దైవదర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎప్పటికప్పుడు చూడవచ్చన్నారు.

- Advertisement -

అంతర్జాతీయ యాత్రికులను ప్రోత్సహించేందుకు కెనడా, అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, ఓమన్ తదితర దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లో కొత్తగా పర్యాటక రంగ అధికారులను నియమించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. 

పర్యాటక, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ భారత పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లేనని కిషన్ రెడ్డి అన్నారు. భారతీయులు మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు విశ్రమించరని, తాజాగా, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రజల ఉత్సావంగా ఘనంగా జరుపుకోవడమే ఇందుకు చక్కటి ఉదాహరణ అని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి మన సాంస్కృతిక వైవిధ్యతకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్ మహరాజ్, ఔట్‌లుక్ గ్రూప్ సీఈవో ఇంద్రనీల్ రాయ్, ఔట్‌లుక్ ఎడిటర్ చింకీ సిన్హా, సీఏజీ డీజీ  మీనాక్షీ శర్మతోపాటు భారతదేశ పర్యాటక, ఆతిథ్య రంగానికి సంబంధించిన ప్రముఖులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement