Saturday, May 18, 2024

Samsung | దేశీయంగా ల్యాప్‌టాప్‌ల తయారీ.. ఈ ఏడాది ప్రారంభించనున్న శాంసంగ్‌

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్‌ ఈ ఏడాది నుంచి భారత్‌లో ల్యాప్‌టాప్‌ల తయారీని ప్రారంభించనుంది. నోయిడాలోని యూనిట్‌లో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రెసిడెంట్‌ టీఎం రోహ్‌ తెలిపారు. శాంసంగ్‌ సంస్థకు భారత్‌లో తయారీ కేంద్రాలు ఎంతో కీలకమైనవని, నోయిడా యూనిట్‌ రెండో అతి పెద్దదని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం నుంచి నోయిడా ప్లాంట్‌లో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. డిమాండ్‌కు తగినట్లు ఈ ప్లాంట్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిపారు.

నోయిడా ప్లాంట్‌లో శాంసంగ్‌ ఫీచర్‌ ఫోన్లు, స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ట్యాబ్‌లెట్ల ను తయారు చేస్తోంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన గెలాక్సీ ఎస్‌24 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను నోయిడా ప్లాంట్‌లోనే తయారు చేస్తామని శాంసంగ్‌ ఇప్పటికే ప్రకటించింది. విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్‌ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. దేశీయంగా వీటి తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో విక్రయిస్తున్న ల్యాప్‌టాప్‌ల్లో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న చాలా ల్యాప్‌టాప్‌ కంపెనీలు దేశీయంగానే ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించాయి. వీటిని ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహక స్కీమ్‌ (పీఎల్‌)లో చేర్చింది. దీంతో దాదాపు అన్ని కంపెనీలు దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

- Advertisement -

ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం…

వివిధ కీలక వృద్ధి రంగాలపై దృష్టి పెట్టడానికి ఐఐటీ కాన్పూర్‌తో నోయిడాలోని శాంసంగ్‌ ఆర్‌ అండ్‌ టీ ఇనిస్టిట్యూట్‌ ఐదు సంవత్సరాల కాలపరిమితో ఉన్న ఒప్పందం చేసుకుంది. ఈ పరిశోధనలో విద్యార్ధులు, టీచర్లు, శాంసంగ్‌ ఇంజినీర్లు పాల్గొంటారు. ఆరోగ్యం, విజువల్‌, ఫ్రేమ్‌వర్క్‌, బీ2బీ భద్రత, జనరేటివ్‌ ఏఐ, క్లౌడ్‌ అంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ఈ పరిశోధనలు జరుగుతాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాంసంగ్‌ నోయిడా మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యుంగ్యున్‌ , ఐఐటీ కాన్పూర్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ తరుణ్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement