Monday, April 29, 2024

బ్యాంక్‌ల్లో తగ్గిన డిపాజిట్లు.. పెరిగిన రుణాలు మంజూరు

బ్యాంక్‌ల్లో డిపాజిట్లు తగ్గాయి. అదే సమయంలో బ్యాంక్‌లు ఇచ్చే రుణాలు మాత్రం పెరిగాయి. 2022, ఆగస్టు 12 నాటికి బ్యాంక్‌ల్లో 23,407 కోట్లు మేర డిపాజిట్లు తగ్గాయి. బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు 64,981 కోట్లకు పెరిగాయి. బ్యాంకింగ్‌ నివేదిక ప్రకారం డిపాజిట్లు 67,143 కోట్లకు తగ్గాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మాత్రం 43,736 కోట్లకు పెరిగాయి. ఇటీవల బ్యాంక్‌లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వడ్డీ రేట్టు పెంచినందున కస్టమర్లు తమ సేవింగ్స్‌ను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా మార్చినట్లు బ్యాంకింగ్‌ నిపుణుడు వి. విశ్వనాథన్‌ అంచనా వేశారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలు అధిక వడ్డీరేట్లను ఇస్తున్నందున చాలా మంది వాటిల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంక్‌ల్లో డిపాజిట్లు భారీగా తగ్గాయని ఆయన విశ్లేషించారు. డిపాజిట్లు తగ్గితే బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై ప్రభావం పడుతుంది. అందు వల్ల బ్యాంక్‌లు నిధులను సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్లు (సీడీ) ద్వారా సేకరించవచ్చని ఆయన సూచించారు.

ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బ్యాంక్‌లు ఏదో ఒక సమయంలో సేవింగ్‌ అకౌంట్స్‌ వడ్డీరేట్లను పెంచాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుఉన్నారు. ప్రస్తుతం బ్యాంక్‌లు సేవింగ్‌ అకౌంట్స్‌కు 2.70 నుంచి 3 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నాయి. రెండో త్రైమాసికం తరువాత ఆగస్టు 12 వరకు బ్యాంక్‌ల్లో అన్ని రకాల డిపాజిట్లు 14,045 కోట్లు తగ్గాయి. రుణాలు 49,599 కోట్లకు పెరిగాయి. ఈ సంవత్సరం మార్చి నుంచి ఆగస్టు 12 వరకు బ్యాంక్‌ల డిపాజిట్ల పెరుగుదల కంటే, రుణాల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ కాలంలో బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు 5,41,701 కోట్లు ఉంటే, డిపాజిట్లు మాత్రం 4,75,174 కోట్లుగా ఉన్నాయి. దీని వల్ల బ్యాంక్‌లు 23,947 కోట్ల రూపాయలను 5.59 నుంచి 6.35 వడ్డీ రేటుకు నిధులను సమీకరించాల్సి వచ్చింది.
పెట్టుబడి కార్యకలాపాలు పెరుగుతున్నందున రుణాలకు డిమాండ్‌ పెరుగుతుందని ఎస్‌బీఐ పరిశోధనా విభాగం అంచనా వేసింది.
సాధారణంగానే ప్రతి నెల 15వ తేదీ లోపు బ్యాంక్‌ల్లో నగదు ఉపసంహరణ ఎక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఎక్కువగా వేతనాల అకౌంట్స్‌ నుంచి అవసరాల కోసం నిధులు డ్రా చేస్తుంటారు. సాధారణ డిపాజిట్ల సేకరణపై బ్యాంక్‌లు మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న రుణాల డిమాండ్‌కు అనుగుణంగా డిపాజిట్లు పెరగకుంటే బ్యాంక్‌లు ఆర్బీఐ వద్ద రుణం తీసుకోవాల్సి వస్తుంది. అందుకే బ్యాంక్‌ల్లో సేవింగ్‌ అకౌంట్‌ వడ్డీరేట్లు పెంచితే ఆ మేరకు నిధుల లభ్యత పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement